TRP స్కామ్ : అర్నాబ్ గోస్వామికి సమన్లు జారీ చేయండి…ముంబై పోలీసులకు హైకోర్టు ఆదేశం

TRP case:summons to Arnab Goswami before arraignment ప్రముఖ నేషనల్ న్యూస్ ఛానల్ రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామికి సమన్లు ​​జారీ చేయాలని బాంబే హైకోర్టు సోమవారం ముంబై పోలీసులను ఆదేశించింది. టెలివిజన్ రేటింగ్‌ పాయింట్స్(TRP)స్కామ్ కి సంబంధించి ఎఫ్ఐఆర్ లో అర్నాబ్ ని నిందితుడిగా చేర్చాలని ప్రతిపాదించినట్లయితే అతనికి మొదట సమన్లు జారీ చేయాలని బాంబే హైకోర్టు ముంబై పోలీసులను ఆదేశించింది.



కాగా,టీఆర్‌పీ స్కామ్‌కు సంబంధించి అక్టోబర్-6న నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ రిప‌బ్లిక్ టీవీకి చెందిన ARG అవుట్ లయిర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారించిన బాంబే హైకోర్టు ఈ మేరకు పోలీసులకు ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా,అటువంటి సమన్లు అందుకున్నట్లయితే అర్నాబ్ గోస్వామి అధికారుల ముందు హాజరై విచారణకు సహకరిస్తాడని అర్నాబ్ తరపు న్యాయవాది ఇచ్చిన స్టేట్మెంట్ ను కోర్టు రికార్డు చేసింది.



సమన్లు జారీ చేసినట్లయితే పోలీసుల ముందు అర్నాబ్ గోస్వామి హాజరై,విచారణకు సహకరిస్తాడని జస్టిన్ ఎస్ఎస్ షిండే,జస్టిస్ ఎమ్ఎస్ కర్ణిక్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా, గతవారం టీఆర్‌పీ స్కామ్‌కు సంబంధించి రిపబ్లిక్ టీవీకి చెందిన ARG అవుట్ లయిర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్ పై విచారించేందుకు నిరాక‌రించిన సుప్రీంకోర్టు… ముంబై హైకోర్టుకు వెళ్లాలని సూచించిన విషయం తెలిసిందే.



సుప్రీం నిరాకరణతో బాంబే హైకోర్టులో రిపబ్లిక్ టీవీ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రేటింగ్స్ ఆరోప‌ణ‌ల‌పై న్యాయమైన,పారదర్శకత విచారణ కోసం ఈ కేసుని సీబీఐ కి ట్రాన్స్ ఫర్ చేయాలని పిటిషన్ లో కోరారు. ఈ నేపథ్యంలో ఇవాళ దీనిపై కోర్టు విచారించింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను నవంబర్-5,2020 మధ్యాహ్నాం 3గంటలకు వాయిదా వేస్తున్నట్లు ఇవాళ బాంబే హైకోర్టు తెలిపింది. అంతేకాకుండా ఈ కేసులో దర్యాప్తు పేపర్లను సీల్డ్ కవర్లో నవంబర్-4న సమర్పించాలని ముంబై పోలీసులను ఆదేశించింది.

ట్రెండింగ్ వార్తలు