ఆఫర్లో TVలు కొనుక్కునేందుకు ట్రై చేస్తున్నారా.. గతంలో మాదిరి కాదు. ప్రభుత్వం విధించిన అదనపు పన్ను కారణంగా టీవీ ధరలు మరింత పెరగనున్నాయి. వాటి తయారీలో వాడే ఓపెన్ సెల్‌ను ఎక్కువ కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ దిగుమతిపై గురువారం 5 శాతం సుంకాన్ని విధించింది కేంద్రం. వీటి ఫలితంగా టీవీల ధరలు ఆటోమేటిక్ గా పెరిగిపోనున్నాయి.
ఇండియాలో ఎక్కువగా అమ్ముడుపోయే 32 అంగుళాల టీవీలు ఇవాళ్టి నుంచి 600 రూపాయల వరకు పెరిగాయి. మోడల్స్‌ను బట్టి 1200 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు పెరిగాయి. వీటికి మళ్లీ జీఎస్టీ అదనం. మేకిన్ ఇండియాలో భాగంగా ఇండియాలోనే ఓపెన్ సెల్ తయారీ చేపట్టాలని కేంద్రం పిలుపునిచ్చింది. కొన్ని రకాల రాయితీలు కూడా ప్రకటించింది. వాటిని విస్మరించి చాలా కంపెనీలు దిగుమతులపైనే ఆధారపడ్డాయి.
సొంత ప్రొడక్షన్‌కు మరికొంత సమయం కావాలని అడగడంతో కేంద్రం ఇంపోర్ట్ ట్యాక్స్ విధించేందుకు కొన్నాళ్లు ఆగింది. అది ఇవాల్టితో ముగియడంతో ఆటోమేటిగ్గా టీవీల ధరలు పెంచనున్నారు. ఓపెన్ సెల్ లాంటి వస్తువుల్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే.. దేశీయంగా టీవీల ఉత్పత్తి రంగం ఎప్పటికీ ఊపందుకోదని గమనించిన కేంద్రం, ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. కానీ కంపెనీలు మాత్రం దేశీయంగా వాటిని తయారుచేసే కంటే, విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటేనే తక్కువ ధర పడుతుందని వాదిస్తున్నాయి.
ఈ ఓపెన్ సెల్ ధర 32ఇంచుల టీవీకి రూ.2వేల 700ఉండగా.. 42 ఇంచుల టీవీకి 4వేల నుంచి 4వేల 500 రూపాయల వరకూ ధర ఉంటుంది. పండుగ సీజన్లు కాబట్టి డిసెంబర్ వరకూ అదనపు పన్ను విధించకూడదని టెలివిజన్ మేకర్లు భావిస్తుంటే ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి క్లారిటీ రాలేదు. ఈ ఓపెన్ సెల్స్ దాదాపు చైనా నుంచే డౌన్ లోడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి రిలాక్సేషన్ ఉండకపోవచ్చు మరి.