పెద్ద పులుల మధ్య పోరాటం : మూడేళ్ల ‘వీరూ’మృతి

  • Publish Date - October 4, 2019 / 09:40 AM IST

రెండు పెద్ద పులల మధ్య సాగిన భీకర పోరాటంలో మూడు సంవత్సరాల వయస్సున్న ‘వీరు’ అనే పెద్దపులి మృతి చెందింది. చనిపోయిన పులికి అటవీశాఖ అధికారులు శాస్త్రోక్తంగా కర్మకాండలు చేశారు. రాజస్థాన్ లోని రణథంబోర్ నేషనల్ పార్క్ లో  ఈ ఘటన చోటుచేసుకుంది. పార్క్ లోని  పులుల సంరక్షణ కేంద్రంలో టీ-42, టీ-109 అనే పులులు రెండు రోజుల కిందట హోరాహోరీగా తలపడ్డాయి. ఈ ఘటనలో టీ109 వీరూ అనే పెద్ద పులి తీవ్రంగా గాయపడింది. 

ఈ విషయాన్ని గుర్తించిన రణథంబోర్ నేషనల్ పార్క్ సిబ్బంది ట్రాన్క్విలైజర్ల ద్వారా దాన్ని బంధించారు. అనంతరం చికిత్స చేయించారు. ఆ తరువాత వీరూని తిరిగి పార్క్ లో వదిలి పెట్టారు. తరువాత ఆ గాయాలు తిరగబెట్టాయి. దీంతో అనారోగ్యానికి గురైన వీరు గురువారం (అక్టోబర్ 3)న చనిపోయింది. పులి కళేబరానికి అధికారులు పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం శుక్రవారం (అక్టోబర్ 4)అంత్యక్రియలు చేశారు.

దేశంలోనే అతి పెద్ద టైగర్ రిజర్వుడ్ జోన్ గా గుర్తింపు ఉన్న రణథంబోర్ నేషనల్ పార్క్ చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఈ పార్క్ లో పెద్ద పులులు చనిపోవటం మూడవది కావటం..అతి తక్కువ వ్యవధిలోనే మూడు పులులు మృత్యువాత పడటంతో  పులులను సంరక్షించే సంస్థల ప్రతినిధులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

కాగా వీరు పులికి పోరాటంలో అయిన గాయాలకు చికిత్స చేయించిన తరువాత దాన్ని పార్క్ లో వదిలి వేసిన అధికారులు దాని ఆరోగ్యం గురించిపట్టించుకోలేదనీ అందుకే వీరు చనిపోయిందని పులులను సంరక్షించే సంస్థల ప్రతినిథులు ఆరోపిస్తున్నారు.  పులుల మధ్య జరిగిన పోరాటంలో తీవ్రంగా గాయాలపాలైన వీరూ 48 గంటల పాటు మృత్యువుతో పోరాడి చనిపోయందనీ..సరైన సమయంలో అటవీ శాఖ సిబ్బంది స్పందించి..వెంటనే చికిత్స చేయించి ఉంటే బ్రతికి ఉండేదని..అధికారుల నిర్లక్ష్యం వల్లనే వీరూ చనిపోయిందని ఆరోపిస్తున్నారు. 

వీరు మృతి చెందిన తరువాత పోస్ట్ మార్టం నిర్వహించిన వెటర్నరీ డాక్టర్  రాజీవ్ గార్గ్ మాట్లాడుతూ..పులికి తీవ్రమైన రక్తస్రావం అయిందనీ పులి శరీరంపై 40 నుంచి 50 గాయాలు ఉన్నాయని తెలిపారు. పులుల మధ్య జరిగిపోరులో వీరుకు గాయాలు అయ్యాయన్నారు. అనారోగ్యం పాలైన విషయాన్ని ఆలస్యంగా గుర్తించటంతో గాయాలకు ఇన్ఫెక్షన్ అవ్వటంతో తట్టుకోలేక వీరు మృతి చెందిందని తెలిపారు. గుర్తించిన తరువాత చికిత్స చేసినా వీరును రక్షించలేకపోమని అన్నారు.