దేశ ప్రజలకు సంక్రాంతి కానుక : జనవరి 13 నుంచి కరోనా వ్యాక్సినేషన్‌

corona vaccination process will start from the 13th of january : దేశ ప్రజలకు సంక్రాంతి కానుకగా వ్యాక్సినేషన్ ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 13 నుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి రాజేష్ భూష‌ణ్ వెల్ల‌డించారు. మంగ‌ళ‌వారం (జనవరి 5, 2021) ఆయ‌న మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రై రన్ సక్సెస్ అయినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌కు అన్ని రాష్ట్రాలూ సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. దేశంలో ప్ర‌ధానంగా నాలుగు ప్రైమ‌రీ వ్యాక్సిన్ స్టోర్లు ఉన్న‌ట్లు ఈ సంద‌ర్భంగా రాజేశ్ భూషణ్ చెప్పారు. వీటిని జీఎంఎస్‌డీగా పిలుస్తార‌ని, ఇవి క‌ర్నాల్‌, ముంబై, చెన్నై, కోల్‌క‌తాల‌లో ఉంటాయ‌ని తెలిపారు.

మొత్తంగా దేశంలో 37 వ్యాక్సిన్ స్టోర్లు ఉంటాయ‌ని వెల్ల‌డించారు. ఈ స్టోర్లు భారీ సంఖ్య‌లో వ్యాక్సిన్‌ను నిల్వ చేస్తాయ‌ని, అక్క‌డి నుంచి వాటిని పంపిణీ చేస్తార‌ని తెలిపారు. ఆయా స్టోర్ల‌లో ఎన్ని వ్యాక్సిన్లు ఉన్నాయి, ఏ ఉష్ణోగ్ర‌త ద‌గ్గ‌ర వాటిని స్టోర్ చేశార‌న్న వివ‌రాలు డిజిట‌ల్ రూపంలో ప‌రిశీలిస్తామ‌ని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ డ్రై రన్ సక్సెస్ అయిందని చెప్పింది. తొలి కేసు నమోదైన ఏడాదిలోపే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పటికే కోవిషీల్డ్, కొవాగ్జిన్‌ వ్యాక్సిన్లకు అనుమతి లభించింది.

దేశవ్యాప్తంగా తొలివిడతలో మూడు కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తామని కేంద్రం ప్రకటించింది. తొలివిడత వ్యాక్సినేషన్‌లో భాగంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన కోటి మంది వైద్యారోగ్య సిబ్బందికి, రెండు కోట్ల మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఉచితంగా టీకా అందజేయనున్నారు. ప్రాధాన్యతా క్రమంలో ఉన్న తదుపరి 27 కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఎలా అందించాలనే దానిపై ఓ నిర్ణయానికి రానున్నారు.

దేశ వ్యాప్తంగా 116 జిల్లాల్లోని 259 ప్రదేశాల్లో వ్యాక్సినేషన్‌ మాక్‌ డ్రిల్‌ను నిర్వహించారు. టీకా పంపిణీ కోసం ఏర్పాటు చేసిన అన్ని వ్యవస్థల పనితీరును ఈ డ్రైరన్‌లో అధికారులు విస్తృతంగా పరిశీలించారు. నిజమైన టీకా ఇవ్వడం తప్ప వాస్తవ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో పాటించే మొత్తం ప్రక్రియను ఇందులో పాటించారు. డిసెంబరు 28, 29న దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన తొలివిడత డ్రైరన్‌లో తలెత్తిన లోపాల్ని సవరించి కొత్త మార్గదర్శకాల ప్రకారం తాజా డ్రైరన్‌ను నిర్వహించారు.

తెలంగాణలో 2 జిల్లాల్లోని 7 ప్రాంతాల్లో డ్రైరన్‌ నిర్వహించారు. హైదరాబాద్‌లోని తిలక్‌నగర్‌- ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నాంపల్లిలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి, సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రి, సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిని ఎంపిక చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా కేంద్ర ఆసుపత్రి, ప్రైవేటులో నేహ షైన్‌ ఆసుపత్రిని ఎంపిక చేశారు.

ఒక్కో కేంద్రంలో 25 నుంచి 30 మంది చొప్పున ఆరోగ్య సిబ్బందిని, సాధారణ పౌరులను ఎంపిక చేసి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు. టీకా పొందే వ్యక్తి ఆరోగ్యకేంద్రానికి వచ్చినప్పటి నుంచి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపర్చడం వరకూ అన్ని దశల ప్రక్రియలను ప్రయోగాత్మకంగా పరిశీలించారు.

ఏపీలోని 13 జిల్లాల్లో డ్రైరన్‌ నిర్వహించారు. ఒక్కో జిల్లాలో మూడు చొప్పున మొత్తం 39 కేంద్రాల్లో ఈ డ్రైరన్‌ ప్రక్రియ కొనసాగింది. ఎంపిక చేసిన ఆరోగ్య కార్యకర్తలకు ముందుగానే సమాచారం ఇచ్చారు. అన్ని జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలోనూ మరోసారి డ్రై రన్‌ నిర్వహించారు.