UP Elections 2022 : 58అసెంబ్లీ స్ధానాలకు రేపు యూపీలో తొలివిడత పోలింగ్

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రేపు ఉత్తరప్రదేశ్ లో తొలి విడత పోలింగ్ జరుగుతుంది. 

UP Elections 2022

UP Elections 2022 : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రేపు ఉత్తరప్రదేశ్ లో తొలి విడత పోలింగ్ జరుగుతుంది.  కోవిడ్ ప్రోటోకాల్‌కు అనుగుణంగా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.  మొదటి విడతలో పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లో 58 అసెంబ్లీ స్ధానాలకు పోలింగ్ జరుగుతోంది.

మొదటి విడత 623 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.  సుమారు.2.27 కోట్ల మంది రేపు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొదటి విడత ఎన్నికల పోలింగ్ కు ప్రచారం నిన్నటితో ముగిసింది. యూపీ  ఎన్నికల్లో బహుముఖ పోరు నెలకొని ఉంది.  అధికార బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ-ఆర్ఎల్డి, బీఎస్పీ, ఎంఐఎం పోటీలో ఉన్నాయి. యూపీలోని పశ్చిమ ప్రాంతంలో జాట్-ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉంది.

పశ్చిమ యూపీలో అధిక స్థానాలు గెలిచిన పార్టీలే రాష్ట్రంలో అధికారం చేపడతాయన్న సెంటిమెంట్‌ ఉండటంతో ప్రధాన పార్టీలు ఇక్కడ అత్యధిక స్ధానాలు గెలిచేందుకు హోరా హోరీగా ప్రచారం నిర్వహించాయి. మొదటి విడత ఎన్నికల బరిలో 9 మంది మంత్రులు పోటీ చేస్తున్నారు. వీరిలో సురేశ్ రాణా, అతుల్ గార్గ్, శ్రీకాంత్ శర్మ, సందీప్ సింగ్, అనిల్ శర్మ, కపిల్ దేవ్ అగర్వాల్, దినేష్ ఖాటిక్, డాక్టర్ జీఎస్ ధర్మేష్, చౌదరి లక్ష్మీ నారాయణ్ ఉన్నారు.

గత ఎన్నికల్లో ఇక్కడి 58 స్థానాలకు గాను బీజేపీ 53 స్థానాలు గెలుచుకుంది. ఎస్పీ,బీఎస్పి రెండేసి స్థానాలు.. ఆర్ఎల్డి ఒక సీటు గెలుచుకున్నాయి. మొదటి విడత పోలింగ్ జరగుతున్న జిల్లాల్లో ప్రబుద్ధ్‌ నగర్‌ (షామ్‌లి), మీరట్‌, హాపూర్‌ (పంచ్‌శీల్‌ నగర్‌), ముజఫర్‌నగర్‌, బాఘ్‌పట్‌, ఘజియాబాద్‌, బులంద్‌శహర్‌, అలీగఢ్‌, ఆగ్రా, గౌతమ్‌బుద్ధ్‌ నగర్‌, మథుర ఉన్నాయి.

ఈ ఎన్నికల్లో  సాగు చట్టాలు రద్దు చేసి, రైతులకు బహిరంగ క్షమాపణ,రైతులపై కేసుల ఎత్తివేత, బకాయిల చెల్లింపు వంటి చర్యలతో బీజేపీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డీ)తో పొత్తు తో రైతులు,ముస్లింలకు చేరువయ్యేందుకు సమాజ్ వాది పార్టీ ప్రయత్నించింది.

తొలి విడత పోలింగ్‌ జరిగే 58 స్థానాల్లో ఏడు కీలక సీట్లు ఉన్నాయి. వీటిలో నోయిడా, ముజఫర్‌నగర్‌, బాఘ్‌పట్‌, మథుర, అత్రౌలి, కైరానా, థానా భవన్‌ ఉన్నాయి. ప్రతి ఒక్కరి దృష్టి వీటిపై ఉంది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌  కుమారుడు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పంకజ్‌సింగ్‌ నోయిడా నుంచి బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పంకజ్ సింగ్ పై పోటీలో సునీల్‌ చౌధురి (ఎస్‌పీ), పంఖూరీ పాఠక్‌ (కాంగ్రెస్‌), పంకజ్‌ ఆవానా (ఆప్‌) లు ఉన్నారు.
Also Read : 60% funding..National project : కేంద్రం మరో షాక్‌..ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించినా..కేంద్రం నుంచి 60 శాతం నిధులే
ఇక ముజఫర్‌నగర్ స్థానాన్ని బీజేపీకి, ఎస్‌పీ-ఆర్‌ఎల్‌డీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కపిల్‌దేవ్‌ అగర్వాల్‌ బీజేపీ నుంచి పోటీలో ఉండగా.. ఎస్‌పీ కూటమి తరఫున సౌరభ్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా సుబోధ్‌ శర్మ పోటీ చేస్తున్నారు.

ఇక బాఘ్‌పట్‌లో  బీజేపీ తరవున సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే యోగేశ్‌ ధర్మ, ఎస్‌పీ-ఆర్‌ఎల్‌డీ   కూటమి తరఫున అహ్మద్‌ హమీద్‌ పోటీ చేస్తున్నారు. మథురలో బిజెపి తరపున బరిలో శ్రీకాంత్‌ శర్మ,ఎస్‌పీ నేత దేవేంద్ర అగర్వాల్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి దేవేంద్ర మాథుర్‌ పోటీలో ఉన్నారు.  అత్రౌలి స్థానంలో బిజెపి తరపున సందీప్ సింగ్‌ పోటీలో ఉండగా, ఎస్పీ నుంచి వీరేశ్‌ యాదవ్‌.. కాంగ్రెస్ పార్టీ నుంచి ధర్మేంద్ర లోధీ పోటీ చేస్తున్నారు.

కైరానా నుంచి సమాజ్ వాదీ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే నహీద్‌ హసన్‌ పోటీ చేస్తుండగా, బీజేపీ నుంచి మృగాంకా సింగ్‌ పోటీలో ఉన్నారు. ఇక్కడి నుంచి ఎస్పీ తరుఫున పోటీ చేస్తున్న నసీద్ హసన్ సోదరి ఇఖ్రా చౌధురి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. థానాభవన్‌ లో బిజెపి నుంచి సురేశ్‌ రాణా పోటీలో ఉండగా, ఆర్ఎల్డీ నుంచి ఆష్రాఫ్‌ అలీ.. కాంగ్రెస్ నుంచి సత్య సయ్యం సైనీ పోటీ చేస్తున్నారు.