Dowry Death Case
Dowry Death Case: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఇటీవల నిక్కీ భాటి అనే మహిళను అదనపు వరకట్నం కోసం అత్తింటివారు నిప్పు అంటించి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్య కలకలం రేపిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ బఘ్‌పట్‌లో జరిగిన మహాపంచాయత్‌లో కమ్యూనిటీ నాయకులు కీలక పిలుపునిచ్చారు.
కన్యాదానం సమయంలో తల్లిదండ్రులు కూతుళ్లకు బంగారం, వెండి, డబ్బు ఇవ్వకుండా తుపాకులు, కత్తులు, ఖడ్గాలు ఇవ్వాలని సూచించారు. ఇటీవల జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
గౌరీపూర్ మిత్లీ గ్రామంలో నిర్వహించిన కేశరియా మహాపంచాయత్‌లో ప్రధానంగా రాజ్‌పుత్ కమ్యూనిటీ ప్రజలు పాల్గొన్నారు. ఆల్ ఇండియా క్షత్రియ మహాసభ అధ్యక్షుడు ఠాకూర్ కున్వర్ అజయ్ ప్రతాప్ సింగ్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆభరణాలు, డబ్బు మహిళల రక్షణకు పనికిరావని అన్నారు.
“మనమంతా కన్యాదానం సమయంలో కూతుళ్లకు బంగారం ఇస్తాం, అది వారికి పనికిరాదు. దాని బదులు కత్తి, తుపాకీ, ఖడ్గం ఇవ్వండి. నేరాల నుంచి తమను తాము కాపాడుకోవచ్చు” అని సింగ్ చెప్పారు. ఆయుధాలు ఈ సమస్యకు తుది పరిష్కారం కాకపోయినా, ఈ కాలంలో ఆత్మరక్షణకు అవసరమని అన్నారు. ( Dowry Death Case)
Also Read: Rains: ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించిన అధికారులు
ఠాకూర్ కున్వర్ అజయ్ ప్రతాప్ సింగ్ చేసిన సూచనలకు ఆ కమ్యూనిటీ వారు మద్దతు తెలిపారు. బ్రిజేంద్ర సింగ్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. “అప్పట్లో రాణి లక్ష్మీబాయి వంటి సాహసవంతులు ఆత్మరక్షణ పద్ధతులు అనుసరించారు. కానీ ఆధునిక కాలంలో పోలీసుల భయంతో ఆ ఆచారం ఆగిపోయింది. ఆయుధాలు అన్ని సమస్యలను పరిష్కరించకపోయినా, మహిళలకు తమను తాము రక్షించుకునే ధైర్యాన్ని ఇస్తాయి” అన్నారు.
బఘ్‌పట్ మహాపంచాయత్‌లో పెద్దలు చేసిన సూచనలు తీవ్ర చర్చలకు దారితీసింది. మహిళలకు ఆయుధాలు ఇవ్వడం వల్ల వారు శక్తిమంతం అవుతారని కొందరు అంటుండగా, మరికొందరు ఇది మరింత హింసకు దారితీస్తుందని భావిస్తున్నారు.
బఘ్‌పట్ పోలీస్ సూపరింటెండెంట్ సురజ్ రాయ్ దీనిపై స్పందిస్తూ.. అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. “సోషల్ మీడియా ద్వారా ఈ ఘటన గురించి తెలిసింది. సర్కిల్ ఆఫీసర్‌కు విచారణ బాధ్యతలను అప్పగించాం. నిజాలు వెలుగులోకి వచ్చిన తరువాత కఠిన చర్యలు తీసుకుంటాం” అని రాయ్ తెలిపారు.