UP: యూపీలో విషాద ఘటన.. స్కూల్ యాజమాన్యం తీరుతో బాలిక సూసైడ్.. అసలేం జరిగిందంటే?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రతాప్ గఢ్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.

Uttar Pradesh student

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రతాప్ గఢ్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. రూ.800 చెల్లించాలని బలవంతం చేయడంతోపాటు, తనతోపాటు తన కుటుంబ సభ్యులను అవమానించడంతో మనస్థాపం చెందిన బాలిక సూసైడ్ చేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంహితలో వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

 

ప్రతాప్ గఢ్ జిల్లాలోని ఓ పాఠశాలలో రియా ప్రజాప్రతి (17) విద్యార్థిని తొమ్మిదో తరగతి చదువుతుంది. పరీక్ష రాయడానికి బాలిక శనివారం స్కూల్ కు వెళ్లింది. అయితే, స్కూల్ యాజమాన్యం బాలికను పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. నువ్వు ఇంకా రూ.800 బాకీ ఉన్నావు.. ఫీజు కడితేనే పరీక్ష రాయనిస్తామని స్కూల్ యాజమాన్యం చెప్పింది. ఆ తరువాత బాలిక ఎంతసేపు వేడుకున్నా పరీక్షకు అనుమతించలేదు. దీంతో ఆ బాలిక ఇంటికెళ్లి ఆత్మహత్య చేసుకుంది. పొలం పనులకు వెళ్లిన ఆమె తల్లి ఇంటికి వచ్చేసరికి కుమార్తె ఆత్మహత్య చేసుకొని ఉండటం చూసి బోరున విలపించింది.

 

స్కూల్ యాజమాన్యం తన కూతర్ని అవమానించిందని, అందుకు ఆత్మహత్య చేసుకుందని, స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లి డిమాండ్ చేసింది. ఇప్పటికే రూ.1500 ఫీజు చెల్లించామని, ఇంకా రూ.800 కట్టాలని స్కూల్ యాజమాన్యం నా కూతుర్ని ఇబ్బంది పెట్టడంతో ఈ దారుణం జరిగిందని కన్నీరుమున్నీరైంది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.