మహా “బలపరీక్ష”లో గందరగోళం…సభలో బీజేపీ నినాదాలు

మహారాష్ట్ర అసెంబ్లీలో సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే బలపరీక్ష ప్రారంభమైంది. అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన వెంటనే బీజేపీ సభ్యులు సభలో నినాదాలు చేశారు. అసెంబ్లీ సెషన్ రూల్స్ ప్రకారం నడవడం లేదని ప్రతిపక్ష బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు. వందేమాతరం లేకుండానే సెషన్ ప్రారంభమైందని,ఇది రూల్ ఉల్లంఘన అని ఆయన అన్నారు.

ఉద్దవ్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వ ఏర్పాటు విషయంలో…సభలో సంబంధం లేని విషయాలను ఫడ్నవీస్ లేవనెత్తుతున్నారని ప్రొటెం స్పీకర్ దిలిప్ పాటిల్ అన్నారు. ఈ ప్రత్యేక సెషన్ కి గవర్నర్ అనుమతి ఇచ్చారని,ఈ సెషన్ రూల్స్ ప్రకారం జరుగుతుందన్నారు. ఫడ్నవీస్ వ్యాఖ్యలను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. అయితే రాజ్యాంగంపై తాను మాట్లాడేందుకు అనుమతించకపోతే తనకు సభలో కూర్చొనే హక్కు లేదని ఫడ్నవీస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మహారాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ కూడా స్పీకర్ ను ఎన్నుకోకుండా విశ్వాస పరీక్ష జరగలేదని ఫడ్నవీస్ అన్నారు. ఈ సారి ఉన్న భయం ఏంటి అని పరోక్షంగా సీఎం ఉద్దవ్ ని ఉద్దేశించి విమర్శించారు. ఈ సెషన్ లో నిబంధనలు ఉల్లంఘించారంటూ సభలో బీజేపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది.