ఖాకీ కావరం : ఫోన్ చోరీ చేశాడని బూటుకాళ్లతో తొక్కుతూ దాడి

  • Publish Date - January 10, 2020 / 06:31 AM IST

యూపీలోని డియోరియా పోలీసు స్టేషన్‌లో మొబైల్‌ను దొంగిలించాడనే నెపంతో ఓ వ్యక్తిని పోలీసులు చితకబాదారు. గురువారం జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  మహేన్‌ గ్రామానికి చెందిన సుమిత్‌ గోస్వామిని మొబైల్‌ దొంగతనం చేశాడనే అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గోస్వామిని స్టేషన్‌కు తీసుకువచ్చిన పోలీసులు..విచక్షణారహితంగా దాడి చేశారు.ముగ్గురు పోలీసులు కలిసి తమ బూట్ల కాళ్లతో ఇష్టమొచ్చినట్లుగా తన్నారు. తొక్కారు. బెల్ట్‌తో చితకబాదారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. 

ఈ వీడియో పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి రావటంతో వెంటనే స్పందించారు. గోస్వామిని చితకబాదిన ముగ్గురు పోలీసులను సస్పెండ్‌ చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి పూర్తి స్థాయి విచారణ జరపాలని పోలీస్ అధికారి శ్రీపతి మిశ్రా ఆదేశించారు.చంద్రమౌలేశ్వర్ సింగ్, లాల్ బిహారీ, జితేంద్ర యాదవ్ అనే ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.