Maha Kumbh Mela
Maha Kumbh Mela 2025: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. ప్రపంచ నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఫలితంగా ప్రయాగరాజ్ ప్రాంతంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఆధ్యాత్మిక సందడి ఉట్టిపడుతోంది. అయితే, ఆధ్యాత్మిక వేడుక పట్ల కొందరు అభ్యంతరకరంగా ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది.
ప్రయాగ్ రాజ్ లోని మహాకుంభ మేళాలో మహిళా భక్తులు స్నానం చేస్తున్న అభ్యంతరకరమైన వీడియోలను పోస్టు చేసినందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు రెండు సోషల్ మీడియా ఖాతాలపై కేసు నమోదు చేశారు. పోలీసుల ప్రకటన ప్రకారం.. కుంభమేళాలో మహిళలు స్నానం చేస్తున్న, బట్టలు మార్చుకుంటున్న వీడియోలను కొంతమంది కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేస్తున్నారని సోషల్ మీడియా మానిటరింగ్ బృందం కనుగొంది. ఇది మహిళా భక్తుల గోప్యత, గౌరవాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమే. దీంతో కొత్వాలి కుంభమేళా పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేయడంతోపాటు సంబంధిత సోషల్ మీడియా ఖాతా నిర్వాహకులపై చట్టపరమైన చర్యలను పోలీసులు ప్రారంభించారు.
ఫిబ్రవరి 17న కుంభమేళాలో స్నానం చేస్తున్న సమయంలో మహిళా భక్తుల అనుచిత వీడియోలను పోస్టు చేశారనే ఆరోపణలతోపాటు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై కేసు నమోదైంది. ఖాతా నిర్వాహకులను గుర్తించేందుకు మెటా నుంచి వివరాలను కోరినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు అందిన తరువాత అరెస్టుతో పాటు చట్టపరంగా వారిపై చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 19న నమోదైన మరో కేసులో ‘టెలిగ్రామ్’ ఛానల్ ఇలాంటి వీడియోలను వేరువేరు ధరలకు అమ్మకానికి అందిస్తున్నట్లు తేలింది. ఆ ఛానెల్ పై కూడా చట్టపరమైన చర్యలను పోలీసులు ప్రారంభించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
#WATCH | Prayagraj, UP: Devotees continue to arrive in large numbers at Triveni Sangam to take a holy dip during the ongoing Maha Kumbh Mela. pic.twitter.com/7yQCRn2iYF
— ANI (@ANI) February 20, 2025