అప్పు తిరిగివ్వమంటే 39మందిపై అత్యాచారం కేసు

ఉత్తరప్రదేశ్‌లోని ఓ మహిళ తనపై 35మంది గుర్తు తెలియని వ్యక్తులతో సహా 39మంది తనని రేప్ చేశారంటూ కేసు పెట్టింది. ఆ ఒక్క మహిళ గ్రామంలోని అంతమంది వ్యక్తులపై ఫిర్యాదు చేయడంతో ఎస్పీ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు గ్రామస్థులు. తన ఇంటిపైకి వచ్చిన ప్రతి వ్యక్తిపైనా అత్యాచారం ఫిర్యాదు చేసినట్లుగా స్థానిక సమాచారం. 

ఆ మహిళ భర్త పలువురి వద్ద రూ.2.5లక్షలు అప్పు తీసుకున్నాడు. అది అడగడానికి ఇంటికి వెళ్లేవారు. కొన్నిసార్లు వాదనపెరగడంతో మాటమాటా అనుకునేవారు. అంతే ఆ మహిళ సదరు వ్యక్తిపై అత్యాచారం కేసు నమోదు చేసేది. 

భర్త తాగుబోతు. తాగడానికి చాలా మంది వద్ద అప్పులు చేసేవాడు. వారికి ఇచ్చిన మాట ప్రకారం.. అప్పులు తీర్చలేకపోయేవాడు. దీంతో తాను ఆస్తులు అమ్మిన తర్వాత డబ్బులు ఇచ్చేస్తానని మాటిచ్చాడు. అమ్మకాలు పూర్తయినా అప్పుడు తీర్చలేదు సరికదా భార్యను తప్పుడు కంప్లైంట్లు ఇవ్వమంటూ ప్రోత్సహించాడు. 

ఆ మహిళ తన కంప్లైంట్ లో చమన్, అమిత్, శంబూ, పుష్పేంద్ర అనే నలుగురి పేర్లను ప్రస్తావించి రేప్ చేశారంటూ కేసు పెట్టింది. అంతేకాకుండా ఆ నలుగురు కలిసి మహిళను 35 మందితో పడుకోబెట్టి వీడియో రికార్డు చేశారని ఆరోపించింది. తన ఇంటి నుంచి రూ.50వేలు కూడా దొంగిలించారంటూ ఫిర్యాదులో పేర్కొంది. రంగంలోకి దిగిన పోలీసులు అమాయకులకు శిక్ష పడకూడదని పూర్తి వివరాలు తెలిసిన తర్వాతే శిక్షపడేలా చూస్తామని తెలిపారు.