Uttarakhand Tunnel Crash News Updates how vertical drilling underway explained
ఉత్తరాఖండ్ టన్నెల్ దగ్గర అసలేం జరుగుతోంది? రెండో రోజుల క్రితం ఇప్పుడో.. ఇంకాసేపటికో పూర్తవుతుందని అనిపించిన రెస్క్యూ ఆపరేషన్ ఇంకా ఎందుకు ముగియలేదు? క్రిస్మస్ సమయానికి కార్మికులు బయటకు వచ్చే అవకాశముందని అంతర్జాతీయ టన్నెల్ నిపుణులు ఆర్నాల్డ్ డిక్స్ చెబుతున్నారు. అంటే దాదాపు ఇంకా నెలపాటు కార్మికులు సొరంగం లోపలే ఉండాలి. ఇప్పటికే 15 రోజులు గడిచిపోయాయి. అసలు రెస్క్యూ ఆపరేషన్ ఇన్ని రోజులు పట్టడానికి కారణమేంటి?
ఈ నెల 12న దీపావళి రోజు తెల్లవారుజామున సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను రక్షించే బాధ్యత ఇండియన్ ఆర్మీ స్వీకరించింది. అమెరికా ఆగర్ యంత్రంతో సమాంతరంగా సాగుతున్న డ్రిల్లింగ్ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలు మొదలయ్యాయి. విపత్తు సమయాల్లో రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టే ఆర్మీ.. కార్మికులను బయటకు తెచ్చేందుకు తమ ఇంజినీరింగ్ నిపుణులను పంపింది. వారు సొరంగంలో తవ్వకాలు మొదలుపెట్టారు. టన్నెల్‌లో కార్మికులు 60 మీటర్ల దూరంలో చిక్కుకుపోగా.. అగర్ యంత్రం సాయంతో 47 మీటర్లు డ్రిల్లింగ్ చేసి పైపులు వేశారు. మిగిలిన 12 మీటర్లను ఆర్మీ ఇంజీనిరింగ్ బృందం తవ్వి పైపులు వేయాల్సి ఉంది. మాన్యువల్ డ్రిల్లింగ్‌తో కార్మికులను బయటకు తేవాలంటే.. నెలరోజుల సమయం పడుతుంఇ. మరోవైపు నిలువుగా డ్రిల్లింగ్ కొనసాగుతోంది. సమాంతర డ్రిల్లింగ్‌లో అగర్ యంత్రం వాడకాన్ని నిలిపివేసిన అధికారులు నిలువు డ్రిల్లింగ్‌లో ఆ యంత్రంతో తవ్వకాలు చేస్తున్నారు. నిలువుగా డ్రిల్లింగ్.. కాస్త రిస్క్‌తో కూడుకున్నదని అధికారులు చెబుతున్నారు. మొత్తం 86 మీటర్లు నిలువుగా డ్రిల్లింగ్ చేయాల్సి ఉంది. సమాంతర డ్రిల్లింగ్‌లా కాకుండా నిలువుగా డ్రిల్లింగ్ అనుకున్న మేర సాగితే.. మరో నాలుగు రోజుల్లోపే కార్మికులు బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ సమాంతరంగా డ్రిల్లింగ్‌లో కూడా చాలా సమస్యలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
కార్మికులు చిక్కుకుపోయిన రోజు నుంచి సహాయక కార్యక్రమాలు మొదలయ్యాయి. ముందుగా కార్మికులు ఎక్కడ చిక్కుకుపోయారో గుర్తించి…పైపుల ద్వారా ఆహారం అందించడం ప్రారంభమయింది. పదిరోజుల పాటు కార్మికులకు డ్రై ఫ్రూట్స్, ద్రవాహారం పంపారు. తర్వాత స్టీల్ పైపు ద్వారా వేడి వేడి ఆహారం పంపడం మొదలయింది. టన్నెల్ లోపలకు ఎండోస్కోపిక్ ఫ్లెక్సీ కెమెరా పంపిన సహాయక సిబ్బంది.. కార్మికులతో ఆడియో, విజువల్ కాంటాక్ట్ అయ్యారు. లోపల ఉన్న కార్మికులు దృశ్యాలు విడుదలయ్యాయి. కార్మికులతో కుటుంబ సభ్యులను ఎప్పటికప్పుడు మాట్లాడిస్తున్నారు. ఉత్తరాఖండ్ సీఎం కూడా కార్మికులతో మాట్లాడారు.
మొదట సమాంతర డ్రిల్లింగ్‌తోనే కార్మికులను బయటకు తీసుకురావచ్చని అధికారులు భావించారు. దేశంలోని అగర్ యంత్రాలతో పాటు అమెరికా నుంచి 25 టన్నుల ఆగర్ యంత్రం తెప్పించారు. అయితే తొలిరోజుల్లోనే ఆగర్ యంత్రాలకు ఇనుపరాడ్లు అడ్డువచ్చాయి. ఓ దశలో అగర్ యంత్రానికి ఇనుప మెటల్ తగలడంతో మళ్లీ సొరంగం కూలుతున్నంత సౌండ్ వచ్చి సహాయక సిబ్బంది తీవ్ర ఆందోళన చెందారు. సహాయక చర్యలు నిలిపివేశారు. సమాంతర డ్రిల్లింగ్ అనుకున్నమేర సాగకపోవడంతో నిలువుగా డ్రిల్లింగ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. సిల్‌క్యారా టన్నెల్ మరోవైపున బార్‌కోట్ వరకు వర్టికల్ డ్రిల్లింగ్‌కు అవసరమైన భారీ యంత్రాలు తరలించేందుకు వీలుగా బోర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ రెండు రోడ్లు నిర్మించింది. డ్రిల్లింగ్ జరిగే ప్రాంతానికి భారీ వాహనాలు వెళ్లేందుకు వీలుగా రోడ్డు నిర్మాణం జరిగింది. కొండపైన టన్నెల్ ఎగువ ప్రాంతం నుంచి బార్‌కోట్ దగ్గరకు 12 వందల మీటర్ల రోడ్డును BRO నిర్మించింది. రెండు రోజుల్లో రోడ్డు నిర్మాణం పూర్తయింది. ఈ లోపు అగర్ మిషన్‌తో సమాంతర డ్రిల్లింగ్ వేగవంతమయింది. దీంతో నిలువుగా డ్రిల్లింగ్ చేయడానికి ప్రదేశాన్ని గుర్తించినప్పటికీ.. తాత్కాలికంగా ఆ ఆప్షన్‌ను పక్కనపెట్టారు.
భారీ ఇనుప వస్తువు అడ్డుపడి..
ఈ నెల 21 అర్ధరాత్రి నుంచి వేగంగా పనులు సాగాయి. ఒక రాత్రిలోనే పదిమీటర్ల శిథిలాలు తొలగించారు. ఈ నెల 22 నుంచి కార్మికులు బయటికిరావడంపై ప్రచారం మొదలయింది. సహాయక కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయని.. కార్మికులకు ఏ క్షణంలోనైనా సొరంగం నుంచి విముక్తి కలుగుతుందని భావించారు. ఈ నెల 23న ఉదయం అంతా టన్నెల్ దగ్గర ఉత్కంఠ నెలకొంది. పైపులు వెల్డింగ్ చేసే నిపుణులు ఢిల్లీ నుంచి వచ్చారు. కేంద్ర మంత్రి వీకే సింగ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి టన్నెల్ దగ్గరకు చేరుకున్నారు. ఆ రోజు మధ్యాహ్నం లోపు రెస్క్యూ ఆపరేషన్ పూర్తవుతుందని కూడా నిపుణులు ప్రకటించారు. కానీ అగర్ యంత్రానికి ఇనుప మెటల్ తగలడంతో సహాయక చర్యలు నిలిచిపోయాయి. తర్వాత మెటల్‌ను కట్ చేసి సహాయక చర్యలు ప్రారంభం కావడానికి సాయంత్రం వరకు సమయం పట్టింది.
వరుస ఆటంకాలు
ఇక ఆ తర్వాత నుంచి వరుస ఆటంకాలు వేధించాయి. కొన్ని మీటర్లు తవ్వేందుకు అమెరికా అగర్ యంత్రం ప్రయత్నించడం.. భారీ ఇనుప వస్తువు అడ్డుపడి సహాయక చర్యలు నిలిపివేయాల్సి రావడం పదే పదే జరిగింది. చివరకు ఈ నెల 24న సాయంత్రం ఓ భారీ మెటల్ తగిలి ఆగర్ యంత్రం బాగా దెబ్బతింది. హైదరాబాద్ నుంచి ప్లాస్మా కటర్ అత్యవసరంగా తీసుకొచ్చి.. శిథిలాల్లో చిక్కుకుపోయిన ఆగర్ యంత్రం బ్లేడ్‌లు తొలగించారు. సొరంగం నుంచి అగర్ యంత్రాన్ని బయటకు తీసి మాన్యువల్ డ్రిల్లింగ్ కోసం ఆర్మీని రంగంలోకి దించారు. కార్మికులను బయటకు తెచ్చేందుకు మొత్తం ఆరు మార్గాలు సిద్ధం చేసుకున్నారు. సమాంతర డ్రిల్లింగ్ మొదటిది కాగా నిలువు డ్రిల్లింగ్ రెండోది. సమాంతరంగా మాన్యువల్ డ్రిల్లింగ్‌తో పాటు రెండో ఆప్షన్ అయిన వర్టికల్ డ్రిల్లింగ్ విధానంలో సహాయక కార్యక్రమాలు సాగుతున్నాయి.
సురక్షితంగా కార్మికులు
సిల్‌క్యారా సొరంగంలో కార్మికులు సురక్షితంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆక్సిజన్, నీళ్లు, వేడి ఆహారం, మందులు అన్నీ అందుతున్నాయి. సొరంగం నిర్మాణం పూర్తి కావొస్తుండడంతో లోపల కరెంటు, నీటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. దీంతో టన్నెల్ లోపల కార్మికులకు స్నానం చేయడానికీ ఎలాంటి ఇబ్బందీ లేదు. కార్మికులను కుటుంబ సభ్యులతో మాట్లాడిస్తూ.. వారిని మానసికంగా వీలయినంత ధృఢంగా ఉంచడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే డ్రిల్లింగ్ మరో నెల పడుతుందన్న అంచనాలు మాత్రం అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పదిహేను రోజులుగా రేపో మాపో బయటకు వస్తామన్న ఆశతో ఉన్న కార్మికులకు.. ఇంకో నెలరోజుల పా టు అక్కడే ఉండాల్సిరావడం తీవ్ర ఆవేదన, ఆందోళన కలిగించేదే. ఈ క్లిష్ట పరిస్థితులను కార్మికులు అధిగమించగలగాలి. వారు ఆ రకమైన ధైర్యాన్ని ప్రదర్శించగలిగేలా అధికారులు కావాల్సిన చర్యలు తీసుకోవాలి.
సిల్ క్యారా సొరంగం నిర్మించింది పర్వత ప్రాంతం. పర్వతాలను తొలిచి ఈ సొరంగం నిర్మించడం ఎంత వ్యయప్రయాసో.. ఇప్పుడు అందులో చిక్కుకుపోయిన కార్మికులను బయటకు తేవడం అంతకుమించిన కష్టంగా మారింది. పర్వత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు అత్యంత కష్టమైనవని..ఎప్పుడే జరుగుతుందో ఎవరూ చెప్పలేరని.. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అథారిటీ అధికారులు తెలిపారు. శిథిలాల తవ్వకాలు నిర్వహించేవారికి రక్షణ పరంగా అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేశారు. లోపల ఉన్న కార్మికులు నిరంతరం తమ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వీలుగా ల్యాండ్ లైన్ ఏర్పాటుచేశారు. డాక్టర్లు కార్మికులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఆరోగ్యంపై సలహాలు ఇస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమవుతుండడంతో కార్మికులు ఒత్తిడికి గురవకుండా.. వీడియోగేమ్స్ ఆడుకునేందుకు మొబైల్స్ పంపించారు. డ్రోన్ కెమెరాలతో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
ఉత్తరాకాశీలోని సిల్‌క్యారా, దండల్‌గావ్‌లను కలుపుతూ నిర్మిస్తున్న ఈ సొరంగంలో సిల్‌క్యారా వైపు 200 మీటర్ల దూరంలో ప్రమాదం జరిగింది. కార్మికుల్లో ఒకరు ఉత్తరాఖండ్‌కు చెందినవారు. మిగిలినవారంతా బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తర్‌ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన వారు. 4వేల531 మీటర్ల పొడవైన సిల్‌క్యారా టన్నెల్‌ను 853కోట్లకు పైగా వ్యవయంతో నిర్మిస్తున్నారు. చార్ ధామ్ ప్రాంతాలకు అనుసంధానం పెంచేందుకు ఈ నిర్మాణం చేపట్టారు. నిర్మాణంలో ఉన్న టన్నెల్ దీపావళి రోజు కుప్పకూలడం వల్ల ప్రమాద తీవ్రత తగ్గింది. సాధారణంగా రోజూ ఒక షిష్ట్‌కు 150 నుంచి 160 మంది కార్మికులు సొరంగం లోపల పనిచేస్తుంటారు. నవంబరు 12న దీపావళి కావడంతో ఎక్కువమంది రాలేదు.
సహాయక చర్యల ఆలస్యంపై ఆందోళన
ఇప్పటివరకు కార్మికులు ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే మరో నెలరోజుల పాటు ఇదే మానసిక స్థైర్యాన్ని కొనసాగించగలగాలి. పైపుల ద్వారా కావాల్సినవన్నీ కార్మికులకు అందుతున్నాయి. ఆక్సిజన్, ఆహారం, నీళ్లు, మందులు వంటివి పైపు ద్వారా పంపిస్తున్నారు. సొరంగం లోపల విద్యుత్, నీటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. లోపల అందరూ బాగానే ఉన్నామని కార్మికులు కుటుంబ సభ్యులకు చెబుతున్నారు. సహాయక సిబ్బందితో మాట్లాడుతున్నారు. అయితే ఎక్కువ రోజులు సొరంగంలో ఉండడం వల్ల కార్మికుల శారీరక, మానసిక ఆరగ్యం దెబ్బతినే ప్రమాదముంది. ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ.. కార్మికులు తెలియని ఒత్తిడికి గురవుతారు. సహాయక చర్యలు ఆలస్యమవుతుండడం వారిలో ఆందోళనకు, గందరగోళానికి దారితీస్తాయి. బయటకు వెళ్లాలనే ఆరాటానికి, వెళ్లలేని నిస్సహాయత తోడై కార్మికులు మానసిక సమస్యల బారిన పడే ప్రమాదముంది.
బయటి వాతావరణ స్థితికి, సొరంగం లోపలి పరిస్థితులకు చాలా తేడా ఉంటుంది. విపత్కర పరిస్థితులు, ఎప్పుడు బయటికెళ్తామో తెలియని అనిశ్చితి కార్మికులను కలవరపెడతాయి. కార్మికుల్లో మానసికంగా బలహీనంగా ఉన్నవారు ఎక్కువరోజులు సొరంగంలో ఉంటే.. ఏవో శబ్దాలు వింటున్నట్టుగా, కుటుంబ సభ్యులు పిలుస్తున్నట్టుగా భ్రాంతికి లోనవుతారని, ఆలోచనలపై నియంత్రణ కోల్పోతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కార్మికులను బయటకు తీసుకొచ్చిన తర్వాత కూడా కొన్నిరోజులు పాటు వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని సూచిస్తున్నారు. NDRF, SDRF, BROతోపాటు DRDO సామాగ్రితో భారత వాయుసేన కూడా సహాయక చర్యల్లో భాగమయింది. కార్మికులను బయటకు తెచ్చేందుకు అన్ని విభాగాలూ సమన్వయంతో పనిచేస్తున్నాయి.