Double Decker Train : వందేభారత్ డబుల్ డెక్కర్ రైలు.. 160 కి.మీ వేగం.. ప్రయాణికులు, సరుకులు ఒకేసారి!

vande bharat double decker : రైల్వే బోర్డు ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ వందేభారత్ డబుల్ డెక్కర్ రైలుకు సానుకూలంగా సిఫారసు చేయడంతో ఈ ప్రాజెక్టుకు ముందడుగు పడే అవకాశం కనిపిస్తోంది.

vande bharat double decker passenger cum goods train

Vande Bharat Double Decker Train : భారతీయ రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడంతోపాటు.. గూడ్స్ రవాణాకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది. అయితే, తాజాగా.. భారతీయ రైల్వేలో కేంద్ర ప్రభుత్వం వినూత్న ప్రయోగానికి సిద్ధమవుతోంది. విమానాల్లో అమలులో ఉన్న బెల్లీ ప్లైట్ విధానాన్ని రైళ్లలోనూ ప్రవేశపెట్టే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఈ విధానంలో పైన ప్రయాణికులు, కింద సరుకులు ఒకేసారి తరలించే ప్యాసింజర్ కమ్ గూడ్స్ డబుల్ డెక్కర్ రైలు రూపొందించే అంశంపై రైల్వే శాఖ త్వరలో తుది నిర్ణయం తీసుకోనుంది.

Also Read : New Ration Cards : తెలంగాణ ప్రజలకు శుభవార్త.. కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభానికి డేట్ వచ్చేసింది.. ఆ రోజు నుంచే..

రైల్వే బోర్డు ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ ఈ ప్రతిపాదనకు సానుకూలంగా సిఫారసు చేయడంతో ఈ ప్రాజెక్టుకు ముందడుగు పడే అవకాశం కనిపిస్తోంది. గతంలో రూపొందించిన ఈ నమూనాను తాత్కాలికంగా నిలిపివేసినా, ఇప్పుడు దానిని వందే భారత్ సిరీస్‌లో భాగంగా ప్రవేశపెట్టాలని కమిటీ సూచించింది.

ప్యాసింజర్ కమ్ కార్గో డబుల్ డెక్కర్ రైళ్లలో పైడెక్కులో ప్రయాణికుల కోసం వందే భారత్ ఎగ్జిక్యూటివ్ కోచ్ తరహా సౌకర్యాలు ఉంటాయి. దాదాపు 46 సీట్లు, ఒక పాంట్రీ, టాయిలెట్లు ఏర్పాటు చేస్తారు. లోయర్ డెక్ లో గరిష్ఠంగా ఆరు టన్నుల వరకు సరుకును తరలించే అవకాశం ఉంటుంది. అయితే, ఈ సరుకుకు సంబంధించిన వాసన, ఇతర ప్రభావాలు పైడెక్కులోకి రాకుండా రూఫ్ ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో స్మోక్ డిటెక్షన్, వీడియో సర్వైలెన్స్ కెమెరా వంటి ఏర్పాట్లు ఉంటాయి. ఒక్కో కోచ్ తయారీకి రూ.4.5 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ఈ రైలు కూడా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

నాలుగేళ్ల క్రితమే సిద్ధమైన నమూనా..
ప్యాసింజర్ కమ్ కార్గో డబుల్ డెక్కర్ తరహా నమూనాను నాలుగేళ్ల క్రితమే పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తాలా ఫ్యాకక్టరీ రూపొందించింది. ఆ తరువాత దీనిపై తుది నిర్ణయం తీసుకోకుండా ప్రాజెక్టును నిలిపివేశారు. ఇప్పుడు మళ్లీ దీనిని అమలు చేయాలని కమిటీ సిఫారసు చేయడంతో ఈ ప్రాజెక్టు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ప్రతిపాదనపై ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాల మేరకు రైల్వే బోర్డు తుది నిర్ణయం తీసుకోనుంది. నిర్ణయం అనుకూలంగా ఉంటే మరో మూడు నుంచి నాలుగు నెలల్లో ప్రోటోటైప్ రైలు ట్రయల్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. లేకపోతే ఈ వినూత్న ప్రాజెక్టుకు తాత్కాలికంగా బ్రేక్ పడే అవకాశముంది.