Cairn
Oil Discovered: వేదాంత గ్రూపుకు చెందిన కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ సంస్థ, రాజస్థాన్ లోని బార్మర్ ప్రాంతంలో చమురు నిక్షేపాలు కనుగొన్నట్లు ప్రకటించింది. ఓపెన్ ఎక్రేజ్ లైసెన్సింగ్ పాలసీ(OALP) కింద సంస్థకు ఇచ్చిన బ్లాక్ లో చమురు నిక్షేపాల గురించి.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డిజిహెచ్) మరియు పెట్రోలియం మంత్రిత్వ శాఖకు సమాచారం అందించినట్లు ఈమేరకు ఫిబ్రవరి 21న విడుదల చేసిన ఒక ప్రకటనలో కంపెనీ తెలిపింది. అదే సమయంలో OALP బ్లాక్ మానిటరింగ్ ప్యానెల్ అయిన మేనేజ్మెంట్ కమిటీకి కూడా సమాచారం అందించినట్లు కెయిర్న్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
Also read: Corbevax : మేడిన్ ఇండియా.. పిల్లలకు అందుబాటులోకి మరో వ్యాక్సిన్
“రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో ఓఎఎల్ పి బ్లాక్ ఆర్ జె-ఒఎన్ హెచ్ పి-2017/1లో.. అనుమానిత చమురు బావి WM-బేసల్ డిడి ఫ్యాన్-1లో చమురు నిక్షేపాల ఆవిష్కరణ గురించి మేనేజ్మెంట్ కమిటీ, డిజిహెచ్ మరియు పెట్రోలియం మంత్రిత్వ శాఖకు ఫిబ్రవరి 21న నోటిఫై చేశాము” అని వేదాంత ప్రతినిధి తెలిపారు. చమురు నిక్షేపాలు కనుగొన్న ఈ బ్లాక్ కు ‘దుర్గా’గా నామకరణం చేశారు. డ్రిల్లింగ్ సమయంలో బావిలోపల.. “లేట్ పాలియోసీన్ నుండి ఎర్లీ ఇయోసిన్” వయస్సున్న నాలుగు హైడ్రోకార్బన్ మండలాలను గుర్తించినట్లు కూడా సంస్థ తెలిపింది.
ముంబై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న వేదాంత సంస్థ.. తన గ్రూప్ కంపెనీల్లో భాగంగా స్టీల్, పెట్రోలియం వంటి ఇతర పవర్ సెక్టర్లలో కార్యకలాపాలు సాగిస్తుంది. వేదాంత గ్రూప్ కు సబ్సిడీ సంస్థే ఈ కెయిర్న్ ఆయిల్ & గ్యాస్ కంపెనీ. అక్టోబర్ 2018లో జరిగిన ఓపెన్ ఎక్రేజ్పా లైసెన్సింగ్ పాలసీ (OALP) మొదటి దశలో భాగంగా కెయిర్న్ సంస్థ 41 ప్రాంతాలలో(బ్లాక్) చమురు అన్వేషణ కోసం బిడ్ ను దక్కించుకుంది. ప్రస్తుతం చమురు కనుగొన్న “దుర్గా బ్లాక్” రెండవ బావి కావడం గమనార్హం. WM-బేసల్ డిడి ఫ్యాన్-1(దుర్గా బ్లాక్)లో 2615 మీటర్ల లోతులో ఈ చమురు నిక్షేపాలు కనుగొన్నట్లు కెయిర్న్ సంస్థ తెలిపింది.