Rajagopala Chidambaram: ప్రముఖ అణు శాస్త్రవేత్త చిదంబరం కన్నుమూత.. దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన మోదీ, చంద్రబాబు

: ప్రముఖ అణు శాస్త్రవేత్త డాక్టర్ రాజగోపాల చిదంబరం (88) కన్నుమూశారు. ఆయన మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు సంతాపం తెలియజేశారు.

Rajagopala Chidambaram

Nuclear Scientist Rajagopala Chidambaram: ప్రముఖ అణు శాస్త్రవేత్త డాక్టర్ రాజగోపాల చిదంబరం (88) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాజగోపాల చిదంబరం చెన్నైలో జన్మించారు. 1974లో జరిపిన పోఖ్రాన్-1, 1998లో నిర్వహించిన పోఖ్రాన్-2 అణు పరీక్షల్లో పాలుపంచుకున్న అణుశాస్త్రవేత్తగా రాజగోపాల చిదంబరం అరుదైన ఘనత సాధించారు.

Also Read: HMPV Outbreak In China: చైనాలో మరో కొత్త వైరస్ కలకలం.. లక్షణాలేంటి.. ఎవరికీ ప్రమాదం..?

బార్క్ డైరెక్టర్ గా వ్యవహరించిన ఆయన.. అణుశక్తి కమిషన్ కు చైర్మన్ గానూ సేవలందించారు. అణుశక్తి విభాగం కార్యదర్శిగా, భారత ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారుగా పనిచేశారు. 1975 సంవత్సరంలో పద్మశ్రీ, 1999లో పద్మ విభూషణ్ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను సత్కరించింది.

Also Read: KTR : ప్రజల దాహార్తి తీర్చే ఏకైక అస్త్రం అదే..! రేవంత్ సర్కార్ పై వరుస ట్వీట్లతో కేటీఆర్ ఫైర్

రాజగోపాల చిదంబరం మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా సంతాపం తెలిపారు. ‘‘భారత అణు కార్యక్రమ నిర్మాతల్లో రాజగోపాల కీలకమైన వ్యక్తి. దేశ శాస్త్రీయ, వ్యూహాత్మక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేశారు. దేశం మొత్తం ఆయనకు రుణపడి ఉంటుంది. ఆయన సేవలు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకం అని ప్రధాని మోదీ కొనియాడారు.


ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజగోపాల చిదంబరం మరణంపై విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా సంతాపం తెలియజేశారు. ‘‘భారతదేశ అణుశక్తి విభాగానికి నాయకత్వం వహించి ఆయుధ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం మరణం విచారకరం. దేశం నిర్వహించిన రెండు అణు పరీక్షలలో ఆయన పాత్ర చిరస్మరణీయం. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ… వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.