India's first virtual school
India’s first virtual school: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. దేశంలోనే మొట్టమొదటి ‘వర్చువల్ స్కూల్’ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ‘ఢిల్లీ మోడల్ వర్చువల్ స్కూల్’గా దీనికి పేరు పెట్టారు. ఢిల్లీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనుబంధంగా ఈ స్కూల్ కొనసాగుతుందని అన్నారు. దేశంలోని విద్యార్థులు ఇందులో చేరవచ్చని తెలిపారు. పాఠశాలలకు వెళ్ళి చదువుకోవడంలో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు ఇందులో చేరవచ్చని ఆయన అన్నారు. తొమ్మిదో తరగతిలో చేరడానికి నేటి నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చని వివరించారు.
స్కూల్ లో చేరే విద్యార్థులు ఇంటి వద్ద నుంచే లైవ్ లో పాఠాలు వినవచ్చని చెప్పారు. ‘ఢిల్లీ మోడల్ వర్చువల్ స్కూల్’ నుంచి మెటీరియల్ కూడా అందుకోవచ్చని ఆయన అన్నారు. అంతేగాక, జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు కూడా తాము సాయం చేస్తామని చెప్పారు. ఆ విద్యార్థులకు వర్చువల్ పద్ధతిలో శిక్షణ ఇస్తామని తెలిపారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని చెప్పారు.