We don’t want to do any politics in this says Kharge on Gujarat tragedy
Mallikarjun Kharge: గుజరాత్లోని మోర్బీ పట్టణంలో మచ్చు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై రాజకీయాలు చేయదల్చుకోలేదని, ఆ విషయంలో ఎవరినీ నిందించదల్చుకోలేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో స్పందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై సోమవారం ఆయన స్పందిస్తూ ఘటన దిగ్భ్రాంతికరమని విచారం వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని, అవసరమైతే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి చేత ప్రత్యేక పానెల్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
‘‘చాలా బాధాకరమైన ఘటన. ప్రతి కోణంలో క్షుణ్ణంగా విచారణ జరగాలి. అవసరమైతే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి చేత ప్రత్యేక పానెల్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలి. అలాగే ఘటనలో మరణించి, గాయపడిన వారి కుటుంబాలకు పరిహారం ప్రకటించాలి’’ అని ఖర్గే అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ఈ విషయంలో రాజకీయాలు చేయదల్చుకోలేదు. అలాగే ఎవరినీ నిందించాలని కూడా అనుకోవడం లేదు. ముందైతే ఎంక్వైరీ రిపోర్ట్ రానివ్వండి. ఆ తర్వాత పూర్తి స్థాయిలో స్పందిస్తాం’’ అని అన్నారు.
కాగా..ఆదివారం (అక్టోబర్ 30,2022) సాయంత్రం మచ్చు నదిపై బ్రిటిష్ కాలంనాటి వంతెన మరమ్మతులు చేసిన వారంరోజులకే కుప్పకూలింది. బ్రిడ్జి కూలిన సమయంలో ఛత్ పూజకు సంబంధించి కొన్ని ఆచారాలు నిర్వహించడానికి ప్రజలు భారీగా గుమ్మికూడారు. ప్రమాద సమయంలో సుమారు 500 మంది బ్రిడ్జిపై ఉన్నట్లు సమాచారం. పలువురు ప్రాణాలతో బయటపడగా సోమవారం తెల్లవారుజాము వరకు ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం 137 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో చాలా మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు.
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు చెందిన ఐదు బృందాలు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. సైన్యం, నౌకాదళం, వైమానిక దళం కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. అర్థరాత్రి వరకు సహాయక చర్యలు కొనసాగగా, వెలుతురు లేకపోవడంతో కొంత ఆటంకం ఏర్పడింది. సోమవారం తెల్లవారు జామునుంచి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
మోర్బిలోని కేబుల్ బ్రిడ్జి దాదాపు 150 సంవత్సరాల పురాతనమైనది. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఏడు నెలల పాటు దానిని మూసివేసి ఉంచారు. మరమ్మతుల అనంతరం గుజరాతీ నూతన సంవత్సరమైన అక్టోబర్ 26న ప్రజలకు తిరిగి అందుబాటులోకి తెచ్చారు. మరోవైపు ఈ ఘటనపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ బ్రిడ్జిని ప్రారంభించినందుకు కంపెనీకి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ జారీ చేయబడిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. వంతెన మరమ్మతు పనులకోసం కంపెనీ ఏ రకమైన మెటీరియల్‌ను ఉపయోగించిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే వంతెన మరమ్మతులు చేపట్టిన కంపెనీపై ఐపీసీ సెక్షన్ 304, 308 మరియు 114 కింద కేసులు నమోదు చేసినట్లు గుజరాత్ హోం మంత్రి తెలిపారు.
PM Modi: గుజరాత్ ప్రమాద స్థలానికి మోదీ.. మంగళవారం పర్యటించనున్న ప్రధాని