Mamata Banerjee
Bengal Teachers Recruitment scam: ఉపాధ్యాయ నియామకాల వ్యవహారంలో మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో దాఖలైన పిటిషన్ల పై దర్యాప్తు చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఇవాళ కీలక తీర్పును వెలువరించింది. 25వేలకుపైగా టీచర్ల నియామకాలు చెల్లవని, ఆ నియామకాలను రద్దు చేస్తూ గతంలో కోల్ కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం సమర్థించింది. అయితే, ఉపాధ్యాయులకు స్వల్ప ఊరటనిచ్చింది.
ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో 9 నుంచి 12 తరగతులకు ఉపాధ్యాయులతో పాటు గ్రూప్ సి, గ్రూప్ డి స్టాప్ సిబ్బంది నియామకాల కోసం 2016లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి సెలక్షన్ పరీక్ష నిర్వహించింది. అనంతరం ఇందులో ఎంపిక ప్రక్రియ చేపట్టి 25,753 మందికి అపాయిట్ మెంట్ లెటర్లు అందజేశారు. ఈ నియామక ఎంపిక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. విచారణ చేపట్టాలని న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి.
Also Read: Inter Results: ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు గుడ్ న్యూస్.. పేపర్ దిద్దే విషయంలో కొత్త నిర్ణయం
2016 నాటి స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామక ప్రక్రియ చెల్లదని గతేడాది ఏప్రిల్ లో కోల్ కతా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ పరీక్షతో జరిపిన నియామకాలను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. అంతేకాదు.. ఉద్యోగాలు సాధించిన టీచర్లు తమ వేతాన్ని తిరిగి ఇచ్చేయాలని వెల్లడించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఫిబ్రవరి 10న తీర్పును సీజేఐ ధర్మాసనం రిజర్వ్ లో పెట్టింది. అయితే, తాజాగా వెల్లడించిన తీర్పులో హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకునేందుకు సరైన కారణాలు లేవని, ఆ నియామకాలు చెల్లవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు నిర్ణయమే ఫైనల్ అని పేర్కొంది.
ఈ నియామక ప్రక్రియ కింద ఉద్యోగాలు సాధించిన టీచర్లు ఇప్పటి వరకు అందుకున్న వేతనాలు, ఇతర భత్యాలను తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఉపాధ్యాయులకు కాస్త ఊరట కల్పించింది.