ఎలక్టోరల్ బాండ్ల పథకం ఎవరు ప్రవేశపెట్టారు.. సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేసింది?

ఎలక్టోరల్ బాండ్స్ విధానాన్ని 2018 జనవరి 2న నోటిఫై చేసిన కేంద్ర ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. దీని ద్వారా ఎవరైనా సరే..

Electoral Bonds: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని రద్దు చేసింది సుప్రీంకోర్టు. అసలు ఏంటీ ఎలక్టోరల్ బాండ్ల పథకం? ఐదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ స్కీమ్ ఉద్దేశమేంటి? మోదీ సర్కారు దీన్ని ప్రవేశపెట్టడానికి కారణమేంటి? విపక్షాలు ఈ స్కీమ్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? దీని వల్ల లబ్ధి పొందుతున్నది ఎవరు? దేశ సర్వోన్నత న్యాయస్థానం ఎందుకీ విధానాన్ని తప్పుపట్టింది?

సాధారణంగా రాజకీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థలు, కోటీశ్వరులు, అభిమానులు విరాళాలు అందజేస్తూ ఉంటారు. అయితే.. బ్లాక్ మనీని వైట్‌గా మార్చుకునేందుకు చాలా మంది విరాళాల రూపంలో పార్టీలకు అందజేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే రాజకీయ పార్టీలకు విరాళాలు సమకూర్చేందుకు ఒక విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. 2017లో కేంద్ర బడ్జెట్‌లో ఎలక్టోరల్ బాండ్లు ప్రవేశపెట్టి.. దాని ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలు అందించే విధానానికి శ్రీకారం చుట్టింది.

ఆ తర్వాత 2018 జనవరి 2న ఎలక్టోరల్ బాండ్స్ విధానాన్ని నోటిఫై చేసిన కేంద్ర ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. దీని ద్వారా ఎవరైనా సరే.. తమ పేరు బయటకు రాకుండా వివిధ రాజకీయ పార్టీలకు బాండ్ల రూపంలో విరాళాలను అందించవచ్చు. రిజిస్టర్ అయి ఉండి.. అంతకుముందు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక శాతం ఓట్లు పొందిన పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల నుంచి నిధులు పొందేందుకు అర్హత ఉంటుంది.

రాజకీయ పార్టీలకు సహకారం అందించేందుకు వ్యక్తులు, కంపెనీలకు పారదర్శకమైన విధానం అమల్లోకి తేవడమే ఈ పథకం ఉద్దేశమని అప్పుడు కేంద్రం ప్రకటించింది. మన దేశానికి చెందిన పౌరులు, సంస్థలు వడ్డీ లేకుండా బ్యాంకుల నుంచి ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని ప్రత్యేక శాఖల్లో వెయ్యి రూపాయల నుంచి కోటి రూపాలయ విలువైన బాండ్లు అందుబాటులో ఉంచారు. 15 రోజుల కాలపరిమితి ఉండే బాండ్లను దాతల పేర్లు చెప్పాల్సిన అవసరం లేకుండా.. బ్యాంక్ అకౌంట్ నుంచి పేమెంట్ చేయడం ద్వారా కొనుగోలు చేయొచ్చు.

Also Read: మోదీ పాలనతో దేశం వినాశనం.. మేం అధికారంలోకి వస్తే..: దిగ్విజయ్ సింగ్

అలా దాతలు అందజేసిన ఎలక్టోరల్ బాండ్లను.. రాజకీయ పార్టీలు తమ అధికార అకౌంట్ల ద్వారా మాత్రమే డబ్బు రూపంలోకి మార్చుకునే అవకాశం ఉంది. ప్రతి ఏడాది జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబరులో కేవలం 10 రోజుల పాటు మాత్రమే ఈ ఎలక్టోరల్ బాండ్లు అందుబాటులో ఉంటాయి. అయితే.. ఎన్నికల ఏడాది మాత్రం మరో నెలరోజులపాటు ఎక్కువగా బాండ్లు అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేశారు.

ఈ బాండ్ల ద్వారా 2018 మార్చి నుంచి 2023 జూలై మధ్య పలు రాజకీయ పార్టీలకు 13 వేల కోట్ల రూపాయల నిధులు అందాయి. 2018 – 2022 మధ్యే 9 వేల 208 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్ల అమ్మకాలు జరిగాయి. అయితే.. 2023 జనవరిలో ఎన్నికల కమిషన్ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన ఆదాయంలో 55 శాతానికి పైగా బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీలకు చేరాయి. అయితే.. ఇందులో సింహభాగం మాత్రం అధికార బీజేపీయే దక్కించుకుంది.

Also Read: బీజేపీ డబుల్‌ స్ట్రాటజీ.. పార్లమెంట్‌ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ కోసం కమలనాథుల వ్యూహాలు

2022-23 సంవత్సరంలో దేశంలోని కేవలం 10 కంపెనీలే ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 332 కోట్ల రూపాయల నిధులు అందజేశాయి. ఇందులో 259 కోట్లు బీజేపీకే అందగా.. 5 ఐదు ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ల ద్వారా బీఆర్‌ఎస్ 90 కోట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్, ఆప్, కాంగ్రెస్ పార్టీలకు 17 కోట్లకు పైగా నిధులు సమకూరాయి.

ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో సాగే బ్యాంకుల ద్వారా తీసుకునే డొనేషన్లు పారదర్శకతను పెంచుతాయని తొలి నుంచీ కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. కానీ.. తమకిష్టమైన పార్టీలకు నిధులు అందించడం ద్వారా పలు కంపెనీలు లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తామని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు.. ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.

ట్రెండింగ్ వార్తలు