బీజేపీ డబుల్‌ స్ట్రాటజీ.. హ్యాట్రిక్‌ కోసం బీజేపీ వ్యూహాలు.. పెద్దల సభలో కొత్త వారికి ప్రాధాన్యం

బీజేపీకి ఒంటరిగా 370 స్థానాలు దక్కేందుకు ఇప్పటికే ఓ ఫార్ములా ప్రకటించిన మోదీ.. అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ తనదైన స్టైల్‌లో ముందుకు సాగుతున్నారు.

బీజేపీ డబుల్‌ స్ట్రాటజీ.. హ్యాట్రిక్‌ కోసం బీజేపీ వ్యూహాలు.. పెద్దల సభలో కొత్త వారికి ప్రాధాన్యం

how bjp rajya sabha election strategy workout explained here

BJP Rajya Sabha Election Strategy : పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో డబుల్‌ స్ట్రాటజీ అమలు చేస్తోంది బీజేపీ. ఎన్డీయే 400కు పైగా స్థానాలు సాధించే వ్యూహంలో భాగంగా.. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక చేపట్టింది. 28 మందిలో నలుగురు పాతవారికి మాత్రమే ఛాన్స్‌ కల్పించిన బీజేపీ.. మిగతా వారిలో కీలక నేతలను లోక్‌సభకు పంపే ప్రయత్నాలు చేస్తోంది. తద్వారా ఇటు రాజ్యసభతోపాటు.. అటు లోక్‌సభలోనూ మరింత బలం పెంచుకునే ప్రణాళిక రూపొందిస్తోంది.

బీజేపీకి ఒంటరిగా 370 స్థానాలు దక్కేందుకు ఇప్పటికే ఓ ఫార్ములా ప్రకటించిన మోదీ.. అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ తనదైన స్టైల్‌లో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. పార్టీలోని బలమైన నేతలను లోక్‌సభ ఎన్నికల రంగంలోకి దింపడం ద్వారా మెజార్టీ సీట్లు దక్కించుకునే వ్యూహాలు రచిస్తున్నారు.

నలుగురు పాతవారికి మాత్రమే..
ఇందులో భాగంగానే రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో కమలం పార్టీ ఆచితూచి వ్యవహరించినట్లు తెలుస్తోంది. మొత్తం 28 మంది బీజేపీ రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనుండగా.. అందులో నలుగురు పాతవారికి మాత్రమే అవకాశం కల్పించింది. ఇక కేంద్ర మంత్రులుగా ఉన్న ఇద్దరిని మాత్రమే రాజ్యసభకు నామినేట్‌ చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేదికి కూడా మరోసారి అవకాశం కల్పించారు.

ఇద్దరు కేంద్ర మంత్రులకే మళ్లీ అవకాశం
బీజేపీకి చెందిన 9 మంది రాజ్యసభ సభ్యులు కేంద్ర మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇందులో కేవలం ఇద్దరికి మాత్రమే రాజ్యసభ సభ్యులుగా ఈసారి అవకాశం కల్పించింది అధిష్టానం. ఇందులో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ఎల్.మురుగన్‌ ఉండగా.. మిగతా ఏడుగురిని లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మెజార్టీ స్థానాలు గెలవాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ.. కీలకమైన నేతలకు లోక్‌సభలో ప్రాధాన్యం కల్పించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వ్యూహాత్మకంగా అధిష్టానం అడుగులు
ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న మన్సుఖ్‌ మాండవీయ, ధర్మేంద్ర ప్రధాన్‌, రాజీవ్‌ చంద్రశేఖర్‌, భూపేంద్ర యాదవ్‌, పర్షోత్తమ్‌ రూపాలా, నారాయణ్‌ రాణే, వి.మురళీరధన్‌ కేంద్ర మంత్రులుగా ఉన్నారు. వీరి పదవీ కాలం ఏప్రిల్‌తో ముగియనుంది. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో వీరిని ఎంపీలుగా గెలిపించుకొని లోక్‌సభకు పంపాలని బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

Also Read: ఎన్నికల వేళ పార్టీలకు సుప్రీంకోర్టు షాక్.. ఎలక్టోరల్ బాండ్స్ స్కీంపై సంచలన తీర్పు

ఇదే సమయంలో చాలా మంది పార్టీ సీనియర్లను కూడా ఈసారి రాజ్యసభకు రీ నామినేట్‌ చేయలేదు బీజేపీ. ఇందులో బీజేపీ మీడియా విభాగం ఇన్‌చార్జి అనిల్‌ బలూని, మాజీ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌, బీహార్‌ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్‌కుమార్‌ మోదీ, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు సరోజ్‌పాండేతో పాటు జీవీఎల్‌ నరసింహారావు, సీఎం రమేశ్‌లాంటి వారున్నారు. అయితే.. తమ ప్రణాళికలో భాగంగానే వీరిని కూడా రాజ్యసభకు రీ నామినేట్‌ చేయలేదన్న చర్చ నడుస్తోంది.

Also Read: టీడీపీ, వైసీపీ పరోక్షంగా సహకరించుకుంటున్నాయి: నారాయణ

ఓవైపు పెద్దల సభలో కొత్త వారికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు.. మరోవైపు సీనియర్లను లోక్‌సభకు పోటీ చేయించడం ద్వారా సీట్ల సంఖ్య పెంచుకోవచ్చని భావిస్తోంది బీజేపీ. ఇందులో భాగంగానే.. సీనియర్‌ నేతలను కూడా లోక్‌సభ బరిలో నిలిపే అవకాశాలున్నాయన్న చర్చ సాగుతోంది.