Cockroach Janta Party : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’.. ఎవరీ అభిజీత్ దీప్కే.. అతను ఏం చెప్పాడంటే..

Cockroach Janta Party : సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు వినిపిస్తోంది. అదే కాక్రోచ్ జనతా పార్టీ (CJP). ఈ సెటైరికల్ వెబ్‌సైట్‌ కొద్దిరోజుల్లోనే ‘బొద్దికల పార్టీ’గా సోషల్ మీడియాలో సంచలనాలు నమోదు చేస్తోంది.

Cockroach Janata Party

Cockroach Janta Party : సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు వినిపిస్తోంది. అదే కాక్రోచ్ జనతా పార్టీ (CJP). ఈ సెటైరికల్ వెబ్‌సైట్‌ కొద్దిరోజుల్లోనే ‘బొద్దికల పార్టీ’గా సోషల్ మీడియాలో సంచలనాలు నమోదు చేస్తోంది. ఈ వెబ్‌సైట్ సృష్టికర్త అభిజీత్ దీప్కే అనే వ్యక్తి. తనను కాక్రోచ్ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడు అని పేరు పెట్టుకున్నాడు.

Also Read : Tamil nadu cabinet expansion : తమిళనాడులో విజయ్‌ క్యాబినెట్ విస్తరణ.. 21మది టీవీకే, ఇద్దరు కాంగ్రెస్.. ఆ పార్టీలకు నో చాన్స్..

అసలు ఆ పార్టీ ఎందుకు పుట్టుకొచ్చింది..
ఈనెల 15న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ ఫేక్ ప్రొపెషనల్ ధ్రువపత్రాల కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపాధి లేని యువతను ఉద్దేశించి కాక్రోచెస్ (బొద్దికలు)లాగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, ఆ మరుసటి రోజే ఆయన స్పందిస్తూ తన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేశారని, దేశ యువతను కాకుండా నకిలీ డిగ్రీలతో న్యాయవృత్తిలోకి వచ్చేవారిని ఉద్దేశించి తాను ఈ వ్యాఖ్యలు చేశానని స్పష్టత ఇచ్చారు. అప్పటికే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఓ కొత్త రాజకీయ ఉద్యమానికి దారితీసింది. మై భీ కాక్రోచ్ (నేను కూడా బొద్దికనే) అనే నినాదంతో కాక్రోచ్ జనతా పార్టీ ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టిస్తోంది. యువత ఎదుర్కొంటున్న సమస్యలను వ్యంగ్యంగా, హాస్యంగా ప్రస్తావిస్తూ ఈ పార్టీ లక్షలాది మందిని ఆకర్షిస్తోంది. కొద్దిరోజుల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పేజీ ఏకంగా 12.7 మిలియన్ల పైగా ఫాలోవర్లను సంపాదించుకుని ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారింది. యూట్యూబ్ సెన్సేషన్, బీజేపీ విధానాలను విమర్శించే ధ్రువ్ రాఠీ కూడా తాను ఆ పార్టీలో చేరతానంటూ ప్రకటించారు.

ఎవరీ అభిజీత్ దీప్కే..
కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించింది అభిజీత్ దీప్కే. దీంతో ఎవరీ అభిజీత్ దీప్కే అని నెటిజన్లు వెతుకుతున్నారు. అభిజీత్ మహారాష్ట్రంలోని ఛత్రపతి శంభాజీ నగర్ కు చెందిన వ్యక్తి. అతను పూణెలో జర్నలిజం చదివాడు. ఆ తరువాత ఇంట్లోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కు ప్రిపేరయ్యాడు. బోస్టన్ యూనివర్శిటీలో పబ్లిక్ రిలేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి అమెరికా వెళ్లాడు. 2020 నుంచి 2022 వరకు ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా సిబ్బందిలో ఉద్యోగిగా పనిచేశాడు. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్ఆద్మీ పార్టీ ప్రచారం కోసం వైరల్ మీమ్ ఆధారిత కంటెంట్ ను రూపొందించడంలో కీలక భూమిక పోషించినట్లు తెలిసింది. కాక్రోచ్ జనతా పార్టీని ఏర్పాటు చేసి.. ఆ పార్టీ కోసం ఒక వెబ్ సైట్ తోపాటు ఇన్ స్టాగ్రామ్, ట్విటర్ వంటి సోషల్ మీడియా ఖాతాలను సైతం ఏర్పాటు చేశాడు. ఇందులో దీప్కే పెట్టిన మొదటి పోస్టు ‘బయట ఉన్న ‘బొద్దింకలు’ అందరి కోసం ఒక కొత్త వేదికను ప్రారంభిస్తున్నాను. నిరుద్యోగులు, సోమరులు, నిరంతరం ఆన్‌లైన్‌లో ఉండేవారందరూ ఈ పార్టీలో చేరేందుకు అర్హులు’ అని సదరు పోస్టులో పేర్కొన్నాడు’. అంతటితో ఆగలేదు.. అదే రోజు cockroachjantaparty.org అనే పార్టీ వెబ్‌సైట్‌ను Voice of the Sozy and Unemployed” అనే ట్యాగ్‌లైన్‌తో ప్రారంభించాడు.

అభిజీత్ దీప్కే ఏమన్నాడంటే?
ఈ జెన్-జెడ్ ఉద్యమం నేపాల్ లేదంటే బంగ్లాదేశ్‌లో జరిగినట్లుగా మారుతుందా అని చాలా మంది పాత్రికేయులు నన్ను అడుగుతున్నారు. నేను ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. అటువంటి పోలికలు చేస్తూ భారతదేశంలోని జెన్-జెడ్‌ను అవమానించవద్దు. వారిని తక్కువ అంచనా వేయవద్దు. చాలా మంది అనుకున్నదానికంటే ఈ దేశ యువత చాలా పరిణతి, అవగాహన, రాజకీయ చైతన్యం కలిగి ఉన్నారు. వారు తమ రాజ్యాంగ హక్కులను అర్థం చేసుకున్నారు. శాంతియుత, ప్రజాస్వామ్య మార్గాల ద్వారా తమ అసమ్మతిని వ్యక్తం చేస్తారు. దయచేసి, వారిని కించపరచవద్దు. ఈ యువతలో చాలా మంది ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడుపుతున్న వారి కంటే చాలా ఎక్కువ విద్యావంతులు, విషయ పరిజ్ఞానం కలవారు ఉన్నారంటూ అభిజీత్ దీప్కే పేర్కొన్నాడు.

కాక్‌రోచ్ జనతా పార్టీ 5 సూత్రాల డిమాండ్లు ఇవే..
♦ మహిళలకు రాజకీయాల్లో, క్యాబినెట్‌లో 50 శాతం ప్రాతినిధ్యం కల్పించాలి.
♦ పార్టీలు మారే (ఫిరాయించే) ప్రజాప్రతినిధులపై 20 ఏళ్ల పాటు పోటీ చేయడానికి వీలు లేకుండా నిషేధం విధించాలి.
♦ మెయిన్‌స్ట్రీమ్ మీడియా యాంకర్ల బ్యాంక్ ఖాతాలను, వారి వెనుక ఉన్న కార్పొరేట్ శక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి.
♦ ఎన్నికల ముందు ఓటర్ల జాబితా నుండి అర్హులైన ఓటర్లను తొలగిస్తే.. అందుకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
♦ విద్యార్థుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముఖ్యంగా పరీక్షల్లో జరిగే మోసాలు, పేపర్ లీకేజీలపై గట్టిగా గళం విప్పాలి.. కఠిన చర్యలు తీసుకోవాలి.