Cockroach Janta Party : కాక్రోచ్ జనతా పార్టీ.. ఇండియాలో Gen Z ఉద్యమానికి నాంది.. తెర పైకి మరో కొత్త రాజకీయ పార్టీ..
Cockroach Janta Party : మన దేశంలో కూడా జెన్ జీ ఉద్యమం రాబోతుందా.. వీరికి వేదికగా సరి కొత్త రాజకీయ పార్టీ పుట్టుకొచ్చిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఆ వివరాలు..
cockroach janta party viral on social media who is founder website link manifesto full details
- దేశంలో మరో కొత్త రాజకీయ పార్టీ
- సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్
- యువతను ఆకర్షిస్తోన్న కాక్రోచ్ జనతా పార్టీ
Cockroach Janta Party : గత కొన్నాళ్లుగా ప్రపంచ రాజకీయాలను పరిశీలిస్తే.. ప్రతి చోట ఎక్కువగా వినిపిస్తోన్న పేరు జెన్ జీ (GenZ). నేటి యువతరం.. వీరు తల్చుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి.. కొత్త నాయకులు తెర మీదకు వస్తారు. అందుకు ఉదాహరణ ఈ మధ్య కాలంలో పలు దేశాల్లో వచ్చిన ప్రభుత్వ మార్పులు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే (TVK) విజయ్ ఇంత భారీ స్థాయిలో సీట్లు గెలిచి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఈ జెన్ జీ యువతరం. ఇప్పుడు ఈ జెన్ జీలు మన దేశంలో కూడా మరో సరికొత్త ఉద్యమానికి నాంది పలుకుతున్నారు.
ఆ వ్యాఖ్యలే పార్టీ స్థాపనకు కారణం
కొన్ని రోజుల క్రితం ఒక కోర్టు విచారణ సందర్భంగా దేశంలోని కొందరు నిరుద్యోగులను ఉద్దేశించి ‘బొద్దింకలు, పరాన్నజీవులు’ అంటూ వచ్చిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆ వ్యాఖ్యలకు నిరసనగా.. ఓ 30 ఏళ్ల యువకుడు వేసిన తొలి అడుగే ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP). అయితే పార్టీ స్థాపించిన కేవలం 48 గంటల్లోనే ఏకంగా 40 వేల మంది యువత ఇందులో సభ్యులుగా చేరారు. సోషల్ మీడియాలో సెటైర్లతో మొదలైన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఉద్యమం ఇప్పుడు దేశాన్ని ఊపేస్తోంది. మరీ ముఖ్యంగా యువత నిరసనలకు ఈ పార్టీ కొత్త వేదికగా, కొత్త రూపంగా నిలుస్తోంది. అభిజీత్ దిప్కే స్థాపించిన ఈ డిజిటల్ వేదిక క్రమంగా రాజకీయ రూపం దాల్చుతూ.. నిరుద్యోగం, అవినీతి వంటి సమస్యలపై ప్రశ్నిస్తూ దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.
* PoKలో రచ్చ రచ్చ.. జెన్ జీ ఉద్యమం స్టార్ట్.. పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తున్న యువత
ప్రారంభంలో కేవలం సామాజిక, రాజకీయ అంశాలపై సెటైర్ల రూపంలో మొదలైన ఈ ఉద్యమం, అతి తక్కువ కాలంలోనే యువత నిరసన గళానికి వేదికగా మారింది. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) పేరుతో ఎక్స్ (X), ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో విపరీతమైన ప్రచారం పొందింది. కేవలం గత మూడు రోజుల్లోనే సుమారు లక్ష మందికి పైగా తమ పార్టీలో సభ్యులుగా చేరారని నిర్వాహకులు చెబుతున్నారు.
వెనక ఉండి నడిపిస్తోంది తనే..!
గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సోషల్ మీడియా కార్యకలాపాల్లో పాలుపంచుకున్న అభిజీత్ దిప్కే అనే యువకుడు ఈ ఉద్యమానికి వ్యవస్థాపకుడిగా ఉన్నారని జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. రాజకీయ విమర్శలు, మీమ్స్‌తో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ సోషల్ మీడియాలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దేశంలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, పరీక్షల్లో అక్రమాలు (పేపర్ లీకేజీలు), రాజకీయ అవినీతి, వ్యవస్థలపై నమ్మకం కోల్పోవడం వంటి అంశాలను CJP తమ పోస్టుల ద్వారా బలంగా ప్రస్తావిస్తోంది.
*: టార్గెట్ జెన్‌జీ.. యువతను అట్రాక్ట్ చేసేలా పవన్ కల్యాణ్ పకడ్బందీ వ్యూహం..
ఈ పార్టీని “సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రాటిక్, లేజీ ” అంటూ వ్యంగ్యంగా పరిచయం చేసుకోవడం సోషల్ మీడియా యూజర్లను బాగా ఆకట్టుకుంది. ఈ వ్యంగ్య వ్యాఖ్యలు, మీమ్స్ వీరి పొలిటికల్ ఎజెండాను జనంలోకి గట్టిగా తీసుకెళ్లాయి.
కాక్రోచ్ జనతా పార్టీ 5 సూత్రాల డిమాండ్లు:
- మహిళలకు రాజకీయాల్లో, క్యాబినెట్లో 50 శాతం ప్రాతినిధ్యం కల్పించాలి.
- పార్టీలు మారే (ఫిరాయించే) ప్రజాప్రతినిధులపై 20 ఏళ్ల పాటు పోటీ చేయడానికి వీలు లేకుండా నిషేధం విధించాలి.
- మెయిన్‌స్ట్రీమ్ మీడియా యాంకర్ల బ్యాంక్ ఖాతాలను, వారి వెనుక ఉన్న కార్పొరేట్ శక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి.
- ఎన్నికల ముందు ఓటర్ల జాబితా నుండి అర్హులైన ఓటర్లను తొలగిస్తే.. అందుకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
- విద్యార్థుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముఖ్యంగా పరీక్షల్లో జరిగే మోసాలు, పేపర్ లీకేజీలపై గట్టిగా గళం విప్పాలి.. కఠిన చర్యలు తీసుకోవాలి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారిన ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ రానున్న భవిష్యత్తులో నిజమైన రాజకీయ పార్టీగా అవతరిస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఏది ఎలా ఉన్నా.. ప్రస్తుతం యువతరం తమ నిరసనను డిజిటల్ రూపంలో వ్యక్తం చేయడానికి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఒక సరికొత్త వేదికగా నిలిచింది. త్వరలోనే ఈ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, విధివిధానాలపై ఒక ఆన్లైన్ జెన్ జీ (GenZ) సదస్సు నిర్వహించనున్నట్లు వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ప్రకటించారు.
