Iron Dome system : ఇజ్రాయెల్ శత్రుదుర్భేద్య ఐరన్ డోమ్ వ్యవస్థ ఫెయిల్యూరుకు కారణాలు ఏమంటే…

అత్యంత అధునాతన ఆయుధాలతో శత్రు దుర్భేద్య దేశంగా పేరొందిన ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్ల దాడి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పాలస్తీనాలోని హమాస్ మిలిటెంట్లు భారీగా రాకెట్ దాడులు చేస్తూ బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నారు....

Iron Dome system

Iron Dome system : అత్యంత అధునాతన ఆయుధాలతో శత్రు దుర్భేద్య దేశంగా పేరొందిన ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్ల దాడి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పాలస్తీనాలోని హమాస్ మిలిటెంట్లు భారీగా రాకెట్ దాడులు చేస్తూ బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇజ్రాయెల్ దేశంలో ఐరన్ డోమ్ వ్యవస్థ ఉన్నా హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్ దేశంలో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. తమ దేశంపై రాకెట్ దాడులు జరగకుండా ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకున్న ఐరన్ డోమ్ వ్యవస్థ ఏమైంది, హమాస్ రాకెట్ దాడులను ఎందుకు తిప్పి కొట్టలేక పోయిందనే విషయం ప్రశ్నార్థకంగా మారింది.

అత్యంత అధునాతన క్షిపణి నిరోధక వ్యవస్థ ఐరన్ డోమ్

శత్రు సేనలు రాకెట్లతో తమ దేశంపై దాడి చేయకుండా వందలాది కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసుకున్న క్షిపణి నిరోధక ఐరన్ డోమ్ లు గగనతలంలో దూసుకువస్తున్న రాకెట్లను గుర్తించి వాటిని ధ్వంసం చేసేందుకు క్షిపణులను ప్రయోగిస్తోంది. ఈ ఐరన్ డోమ్ వ్యవస్థ జనావాసాల వైపు వస్తున్న రాకెట్లను నాశనం చేస్తుంది. ఒక్కో క్షిపణి ధర 1.1కోట్ల రూపాయలు ఉంటుందని ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు. ఈ క్షిపణులు గురి తప్పిన రాకెట్లను కాకుండా నిర్ణీత లక్ష్యాలు, జనావాసాలపై రాకెట్ దాడులు జరగకుండా నిరోధించనుంది.

ఐరన్ డోమ్ వ్యవస్థను ఎప్పుడు పెట్టారంటే…

లెబనాన్ కేంద్రంగా పనిచేసిన హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూఫుతో ఇజ్రాయెల్ యుద్ధం సందర్భంగా 2006వ సంవత్సరంలో ఐరన్ డోమ్ వ్యవస్థను రూపొందించింది. నాడు హిజ్బుల్లా గ్రూప్ రాకెట్ల దాడిలో పెద్ద సంఖ్యలో ఇజ్రాయిలీలు మరణించారు. ఈ దాడిలో పలు భవనాలు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో ఇజ్రాయెల్ రక్షణ సంస్థ రఫేల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్స్ పేరిట కొత్త క్షిపణి నిరోధక వ్యవస్థను రూపొందించింది. ఈ ప్రాజెక్టుకు అమెరికా 20 కోట్ల డాలర్ల నిధులను సమకూర్చింది. 2011వ సంవత్సరంలో మొదటి సారి ఇజ్రాయెల్ దేశంలోని బీర్షెబా పట్టణంపై శత్రువులు చేసిన మిసైల్ దాడిని ఐరన్ డోమ్ వ్యవస్థ అడ్డుకుంది.

గాజా దాడిలో ఇజ్రాయిలీల మృతి

గాజా నుంచి హమాస్ మిలిటెంట్ల రాకెట్ దాడుల్లో పలువురు ఇజ్రాయిలీలు మరణించారు. దీనిని బట్టి చూస్తే ఇజ్రాయెల్ దేశంలోని ఐరన్ డోమ్ వ్యవస్థ పూర్తిగా 100 శాతం రక్షణ ఇవ్వలేదని స్పష్టమైంది. తక్కువ సమయంలో ఎక్కువ రాకెట్లను ప్రయోగిస్తే ఐరన్ డోమ్ వ్యవస్థ సక్సెస్ రేటు ఉండదని చెబుతున్నారు.

స్మార్ట్ కంచె, ఐరన్ డోమ్ క్షిపణి వ్యవస్థలో లోపాలు

ఇజ్రాయెల్ దేశానికి ఉన్న స్మార్ట్ కంచె, ఐరన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థలో లోపాలున్నాయని తాజాగా గాజా హమాస్ దాడిలో తేటతెల్లమైంది. హమాస్ ఉగ్రవాదులు సొరంగాల మీదుగా సరిహద్దుల్లోని ఇజ్రాయెల్ సైనిక శిబిరాల కిందకు చేరి బాంబులు పెట్టి విధ్వంసం స్టృష్టించారు. 2021లో ఇజ్రాయెల్ సరిహద్దుల్లో హైటెక్ కంచెను నిర్మించినా, దాన్ని మిలిటెంట్లు నాశనం చేసి భూభాగంలోకి చొరబడ్డారు.

Also Read :Israel : ఇజ్రాయెల్ మ్యూజిక్ ఫెస్టివల్ సైట్‌పై హమాస్ మిలిటెంట్ల దాడి, 260 మృతదేహాలు లభ్యం

ఒకేసారి భారీగా రాకెట్లను ప్రయోగిస్తే ఐరన్ డోమ్ వ్యవస్థ తిప్పికొట్టలేదని గుర్తించిన హమాస్ మిలిటెంట్లు పెద్దఎత్తున రాకెట్ దాడులు చేశారు. కేవలం 20 నిమిషాల్లోనే 5వేలకు పైగా రాకెట్లను ప్రయోగించడంతో ఐరన్ డోమ్ వ్యవస్థ అడ్డుకోలేక పోయింది.

Also Read :Afghanistan earthquakes : అఫ్ఘానిస్థాన్‌లో ఎటు చూసినా శవాల గుట్టలే…2,445కు చేరిన మృతుల సంఖ్య