Ganesh Baraiya: ఆ యువకుడి వయసు 25. పేరు గణేశ్ బరైయా. అతడి ఎత్తు మాత్రం మూడు అడుగులు మాత్రమే. ఆసుపత్రిలో దాదాపు స్ట్రెచర్ అంత ఎత్తు ఉండే ఆ యువకుడు ఆ స్ట్రెచర్‌పై పడుకునే పేషెంట్లకు వైద్యం చేసేంత ఎత్తుకు (హోదాకు) ఎదిగాడు. 72 శాతం శారీరక వైకల్యంతో వైద్య వృత్తిలోకి వచ్చిన తొలి వ్యక్తిగా నిలిచాడు. డార్ఫిజం కారణంగా అంత శాతం లోకోమోటర్ డిసెబిలిటీ ఉంది.
గణేశ్ బరువు సుమారు 20 కిలోలు మాత్రమే. గుజరాత్ భావనగర్‌లోని సర్ టి జనరల్ ఆసుపత్రి ట్రామా సెంటర్‌కు వెళ్తే ఈ డాక్టర్ మెడలో స్టెతస్కోప్ వేసుకుని పేషెంట్లకు చికిత్స చేస్తూ కనపడతాడు. ప్రభుత్వ వైద్యాధికారిగా పనిచేస్తూ అందరినీ ఆశ్చర్యపర్చుతున్నాడు.
Also Read: చలికి ఇప్పటికే వణికిపోతున్న ప్రజలు.. ఈ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత పెరగనుందంటూ ఐఎండీ హెచ్చరిక
చదువులో గణేశ్ బరైయాకు ఎన్నో అడ్డంకులు
గణేశ్ బరైయా స్వస్థలం భావ్‌నగర్ జిల్లా గోరఖి గ్రామం. గ్రోత్ హార్మోన్ లోపంతో అతడు జన్మించాడు. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని కలలు కన్నాడు. ఇంటర్ పాసై, నీట్‌లో మంచి మార్కులు తెచ్చుకున్నాడు.
అయితే, గణేశ్‌కు శారీరక వైకల్యం కారణంగా ఎంబీబీఎస్‌లో ప్రవేశం పొందేందుకు భారత వైద్యమండలి ఒప్పుకోలేదు. దీంతో గణేశ్ గుజరాత్ హకోర్టులో కేసు వేసి, ఓడిపోయాడు. అయినప్పటికీ సుప్రీంకోర్టుకు వెళ్లాడు. అక్కడ కేసు గెలిచి 2019లో భావ్‌నగర్‌లోనే ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు పొందాడు.
చివరకు తాను అనుకున్నది సాధించి బాండెడ్ మెడికల్ ఆఫీసర్ హోదాలో నవంబర్ 27న విధుల్లో చేరాడు. గణేశ్ తల్లిదండ్రులు రైతులు. ఏడుగురు అక్కలు, తమ్ముడు కలిపి మొత్తం తొమ్మిది మంది తోబుట్టువుల్లో అతడు ఒకడు. తన ముందు ఇప్పుడు ఉన్న లక్ష్యం తన కుటుంబం కోసం మంచి ఇల్లు నిర్మించడమేనని చెబుతున్నాడు.
వైద్యకళాశాలలో అతడికి అనే కష్టాలు ఎదురయ్యాయి. అనాటమీ క్లాసుల్లో అతడికి ముందు సీట్లు ఇచ్చి, సర్జరీ ట్రైనింగ్‌లో ఆపరేషన్ టేబుల్ కనిపించేలా సహ విద్యార్థులు, ప్రొఫెసర్లు గణేశ్‌కు సాయం చేసేవారు.
తన ప్రొఫెసర్లు, స్నేహితులు ప్రతి అడుగులో తనకు తోడుగా నిలిచారని, తన ఎత్తు వల్ల తానేం వెనకబడలేదని అన్నాడు. రోగులు మొదట తనను చూసినప్పుడు ఆశ్చర్యపోతారని చెప్పాడు.