Plane Crash Compensation: గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కుప్పకూలింది. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలోని మేఘానీనగర్ లోని ఓ మెడికల్ కాలేజీ డాక్టర్స్ హాస్టల్ మీద ఫ్లైట్ నేలకూలింది. ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారనే విషయంలో క్లారిటీ లేదు. ఎయిర్ లైన్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 242 మంది (పైలెట్, విమాన సిబ్బందితో కలిపి) ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ విమాన ప్రమాదం జరిగిన తర్వాత ప్రజల్లో చాలా రకాలైన సందేహాలు ఉంటాయి. ఇలాంటి ప్రమాదాల్లో చనిపోతే వారి కుటుంబాలకు పరిహారం ఎవరు ఇస్తారు? ఎయిర్ లైన్స్ కంపెనీలు ఇస్తాయా? లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీలు ఇస్తాయా? ఒకవేళ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే ఏంటి? దీనికి సంబంధించి ఏమైనా రూల్స్ ఉన్నాయా ? తెలుసుకుందాం.
విమాన కంపెనీలకు ఉన్న బాధ్యతలు ఏంటి?
విమాన కంపెనీలకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. 1999లో మాంటెరియల్ కన్వెన్షన్ అని ఒక ఒప్పందం ఉంది. అంతర్జాతీయ విమాన ప్రమాదాలు జరిగినప్పుడు ఎంత పరిహారం ఇవ్వాలి. అందులో విమాన కంపెనీల బాధ్యతల మీద కొన్ని నిబంధనలు రూపొందించారు. అందులో ఇండియా కూడా భాగస్వామి. అంటే ఇండియాలో ఎయిర్ లైన్స్ ఆపరేట్ చేసే కంపెనీలకు కూడా ఈ రూల్స్ వర్తిస్తాయి.
* ఈ రూల్ ప్రకారం విమాన ప్రమాదంలో ఎవరైనా చనిపోతే వారి కుటుంబానికి సుమారు రూ.1.4 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
* ఒకవేళ విమాన ప్రమాదంలో కంపెనీ తప్పు కూడా ఉందని తేలితే పరిహారం ఇంకా పెరగడానికి అవకాశం ఉంది.
Also Read: ఇండియాలో డెడ్లీ ఫ్లైట్ యాక్సిడెంట్స్ ఇవే..
ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎంతవరకు బాధ్యత వహిస్తాయి?
విమాన కంపెనీలే కాకుండా కొన్ని సందర్భాల్లో ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా పరిహారం ప్రకటిస్తాయి. అందులో ముఖ్యమైనవి..
– ప్రమాదంలో చనిపోయినప్పుడు లేదా తీవ్రంగా గాయపడినప్పుడు
– వైద్యపరమైన ఖర్చుల కోసం
– ఎమర్జన్సీ హాస్పిటలైజేషన్ అయినప్పుడు
– విమానం ఆలస్యం లేదా క్యాన్సిల్ అయినప్పుడు
– ప్రయాణికుల లగేజీ పోయినప్పుడు
సహజంగా ఇన్సూరెన్స్ కంపెనీలు అందించే పరిహారాలు
– ఒకవేళ ప్రయాణికుడు చనిపోతే రూ.25లక్షల నుంచి రూ.కోటి వరకు పరిహారం
– పర్మినెంట్ గా వైకల్యం ఏర్పడితే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల పరిహారం
– హాస్పటల్ స్థాయిని బట్టి ట్రీట్ మెంట్ కు రోజుకు ఇంత మొత్తం అని పే చేస్తాయి
ఫ్లైట్ ఇన్సూరెన్స్ తీసుకున్న వారికి మాత్రమే ఈ రూల్స్ వర్తిస్తాయి. ఇన్సూరెన్స్ తీసుకోని వారికి ఇలాంటివి ఏవీ వర్తించవు. చాలా మంది ఇండియన్లు విమాన ప్రయాణాలు చేసే సమయంలో ఇన్సూరెన్స్ లు తీసుకోరు.
ఒకవేళ ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే పరిస్థితి ఏంటి?
– వారికి కేవలం విమాన కంపెనీ అందించే పరిహారం మాత్రమే వర్తిస్తుంది
– ప్రభుత్వం ప్రకటించే పరిహారం (ఒకవేళ ప్రకటిస్తే)
– ఎంప్లాయర్ ఇన్సూరెన్స్ (కంపెనీ తరఫున – బిజినెస్ క్లాస్ లో ప్రయాణించే వారికి)
– క్రెడిట్ కార్డ్ లింక్డ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ (ఒకవేళ కొన్ని ప్రీమియం క్రెడిట్ కార్డుతో టికెట్లు బుక్ చేసినట్టయితే)
పరిహారం ఎప్పుడు వస్తుంది?
విమాన ప్రమాదం జరిగిన వెంటనే పరిహారం వచ్చే అవకాశాలు ఉండవు. కొన్నిసార్లు నెలలు, కొన్ని సార్లు సంవత్సరం కూడా పడుతుంది.
– ఒకవేళ విమాన ప్రమాదంపై విచారణ జరుగుతుంటే పరిహారం వెంటనే రాదు
– ప్రమాదానికి ఎవరిది బాధ్యత అనే విషయంలో ఏదైనా గందరగోళం ఉంటే ఆలస్యం అవుతుంది
– ఒకవేళ ప్రయాణికుడికి ఎలాంటి ట్రావెల్ ఇన్సూరెన్స్ లేకపోయినా / నామినీ డిటెయిల్స్ లేకపోయినా పరిహారం రాదు
బస్సు, రైలు, విమాన ప్రయాణాలు.. ఇలా అన్నింటికీ చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ అందిస్తున్నాయి. కానీ, చాలా మంది ప్రయాణికులు తీసుకోరు. కొందరు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకున్నా అందులో నామినీ డీటైల్స్ నింపరు. ఇలా ఎప్పుడూ చేయకూడదని ఇన్సూరెన్స్ నిపుణులు చెబుతున్నారు. డొమెస్టిక్ అయినా ఇంటర్నేషనల్ ప్రయాణాలు అయినా సరే తప్పకుండా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. నామినీ డీటెయిల్స్ నింపాలని సూచిస్తున్నారు.