NCR Air Pollution : ఎన్‌సీఆర్‌లో గాలి కాలుష్యానికి పాకిస్తాన్ కారణమా? నోయిడా, ఘాజియాబాద్ అధికారులు ఎందుకు ఆరోపిస్తున్నారంటే?

NCR Air Pollution : నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లోని మూడు నగరాల్లో ఒకే రోజున గాలి నాణ్యత తీవ్ర స్థాయిలో క్షీణించడం ఈ ఏడాదిలో ఇదే మొదటిసారి.

Noida and Ghaziabad authorities blaming Pakistan

NCR Air Pollution : నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో గాలి నాణ్యత బాగా క్షీణించింది. గత ఆదివారం నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో ‘చాలా పేలవమైన’ స్థాయికి చేరుకుంది. నోయిడాలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) అంతకుముందు రోజు 169 నుంచి 304కి పడిపోయింది. గ్రేటర్ నోయిడా 312 ఏక్యూఐని నివేదించగా.. ఘజియాబాద్ 324 ఏక్యూఐని నమోదు చేసింది.

గ్రేటర్ నోయిడాలోని ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి డీకే గుప్తా మాట్లాడుతూ.. పాకిస్తాన్‌లో చెత్తను కాల్చడం వల్ల గాలి నాణ్యత అధ్వాన్నంగా మారిందని ఆరోపించారు. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లోని మూడు నగరాల్లో ఒకే రోజున గాలి నాణ్యత తీవ్ర స్థాయిలో క్షీణించడం ఈ ఏడాదిలో ఇదే మొదటిసారి. దీనికి ప్రధాన కారణం.. పొరుగు దేశమైన పాకిస్తాన్ అని అధికారి ఆరోపించారు. పాక్‌లో వ్యవసాయ వ్యర్థాలను కాల్చడంతో సరిహద్దులో విషపూరితమైన పొగను వ్యాప్తిచేస్తున్నాయని డీకే గుప్తా స్పష్టం చేశారు.

స్థానిక గాలి పరిస్థితులు, దృశ్యమానత సమస్యలు :
ఢిల్లీకి శివారు ప్రాంతాల్లో వ్యవసాయ వ్యర్థాలను కాల్చే ప్రదేశాల నుంచి పొగను వ్యాప్తిచేసేందుకు వీలుగా గాలులు అనుకూలంగా లేవని వాతావరణ శాస్త్ర అంచనాలు సూచించినప్పటికీ, స్థానిక గాలి వేగం సున్నాకి పడిపోయింది. దీనివల్ల కాలుష్య కారకాలు పేరుకుపోయాయి. ఆదివారం తెల్లవారుజామున పాలెం వద్ద 1,000 మీటర్లు, సఫ్దర్‌జంగ్ వద్ద 1,500 మీటర్ల దృశ్యమానత తగ్గడంతో రాజధానిని పొగమంచు కప్పేసింది.

కొన్ని పర్యవేక్షణ స్టేషన్లలో ఏక్యూఐ ‘తీవ్రమైన’ కేటగిరీలోకి పడిపోయింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ (IITM) బులెటిన్ ప్రకారం.. అక్టోబర్ 28 నుంచి అక్టోబర్ 30 వరకు గాలి నాణ్యత ‘చాలా పేలవమైన’ కేటగిరీలో ఉంటుందని అంచనా వేసింది. అక్టోబర్‌లో ‘తీవ్రమైన’ కేటగిరీకి చేరుకునే అవకాశం ఉంది. దీపావళి పండుగల కారణంగా అక్టోబర్ 30 నుంచి అక్టోబర్ 31 తేదీల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని ఐఐటీఎమ్ నివేదించింది.

తీవ్రమవుతున్న ప్రజారోగ్య ఆందోళనలు :
గాలి నాణ్యత క్షీణించడంతో, ప్రజారోగ్య ఆందోళనలు పెరుగుతున్నాయి. పౌరులు శ్వాసకోశ వ్యాధుల కేసులను నివేదించారు. గత కొన్ని రోజులుగా ఈ వాయు కాలుష్యం కారణంగా చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. సరిగా శ్వాస తీసుకోలేకపోవడం, కాలుష్యం వల్ల త్వరగా అలసిపోవడం, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కాలుష్యం విపరీతంగా పెరుగుతున్నందున ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని అక్కడి వారు వాపోతున్నారు.

జనవరి 1 నుంచి బాణాసంచా అమ్మకాలపై నిషేధం :
పెరుగుతున్న కాలుష్య స్థాయిలకు ప్రతిస్పందనగా, జనవరి 1 వరకు బాణాసంచా వినియోగం, అమ్మకాలపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. గాలిలోని ధూళి కణాలను తగ్గించడానికి రోడ్లపై నీటిని చల్లడం, బహిరంగ ప్రదేశాలను శుభ్రపరచడం వంటి చర్యలను కూడా ప్రభుత్వం అవలంబించింది.

అధిక కాలుష్య స్థాయిలపై ప్రభుత్వం చర్యలేంటి? :
పెరుగుతున్న కాలుష్య స్థాయిలపై ప్రభుత్వం 2019లో దేశవ్యాప్త క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ చొరవతో 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 2026 నాటికి 40శాతం వరకు గాలి కాలుష్య కారకాలకు సంబంధించిన పదార్ధాల సాంద్రతలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లపై కఠిన చర్యలు తీసుకోవడం, ఎయిర్ మానిటరింగ్ సిస్టమ్‌లను ఏర్పాటు చేయడం, బయోమాస్‌ను కాల్చడాన్ని నిషేధించడం వంటి కీలక చర్యలు ఉన్నాయి. భారత రాజధానిలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి అధికారులు రోడ్లపై నీటిని చల్లడం, కృత్రిమ వర్షపాతం కూడా ప్రారంభించారు. అయితే, ఈ చర్యలు వాయు కాలుష్యానికి దోహదపడే అంతర్లీన సమస్యలను పరిష్కరించలేవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రాజధానిలో పేలవంగా కాలుష్య స్థాయిలు :
ఢిల్లీ ప్రభుత్వం వాయు కాలుష్యంపై కఠినమైన చర్యలు చేపట్టినప్పటికీ కూడా దేశ రాజధానిలో ఏక్యూఐ ‘చాలా పేలవమైన’ కేటగిరీలో కొనసాగింది. అక్టోబర్ 28న ఏక్యూఐ 328 వద్ద నమోదైంది. మునుపటి రోజు సగటు 356 కన్నా కొంచెం మెరుగ్గానే ఉంది. ఆనంద్ విహార్ వంటి నిర్దిష్ట ప్రాంతాలు, ఉదయం 7 గంటలకు 357 ఏక్యూఐని నివేదించాయి. ముందు రోజు నమోదైన తీవ్రమైన ఏక్యూఐ 405 నుంచి తగ్గుదల కనిపించింది. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR) అంచనా ప్రకారం.. పటాకుల నిషేధంతో కూడా రాజధానిలో గాలి నాణ్యత రాబోయే వారంలో ‘చాలా పేలవమైన’ కేటగిరీలో ఉండే అవకాశం ఉంది.

Read Also : Russia Domestic Routes : మా దేశీయ మార్గాల్లో సర్వీసులను నడపండి.. భారతీయ విమానయాన సంస్థలకు రష్యా ఆహ్వానం!