కొత్త మోటారు వాహనాల చట్టం అమల్లోకి వచ్చాక వాహనదారుల్లో జాగ్రత్తలు పెరిగాయి. రూల్ ప్రకారం.. వెహికల్‌లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తప్పనిసరి కదా. అయితే దీనిలో ఓ కొత్త రూల్ వచ్చింది. ఈ బాక్స్‌లో కండోమ్స్ కూడా ఉండాలట. లేకపోతే ఫైన్ తప్పనిసరి అంటున్నాడు ధర్మేంద్ర అనే యూబర్ డ్రైవర్.
‘ఇటీవల నేను ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లో కండోమ్స్ వాడటం లేదని నా మీద ఫైన్ వేశారు. ఎప్పుడూ జాగ్రత్తగానే ఉంటాను అయినా తప్పలేదు’ అని అతను వాపోయాడు. అయితే అతనికి వేసిన చలానాలో కారణంగా ఓవర్ స్పీడ్ అని రాసి ఉందట. ఇతనికొక్కడికే కాదు ఢిల్లీలోని చాలా వాహనాల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్స్‌లో కండోమ్స్ తప్పనిసరి చేసేశారు. ఎవరైనా అవి లేకుండా ప్రయాణిస్తే చలానాలు తప్పవు మరి.
ఢిల్లీలోని సర్వోదయా డ్రైవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కమల్‌జీత్ గిల్ మాట్లాడుతూ.. ‘పబ్లిక్ సర్వీస్ చేసే వాహనాలు నడిపే వ్యక్తులు తమతో పాటు కనీసం మూడు కండోమ్‌లు కలిగి ఉండాలి. కండోమ్స్ అని తక్కువగా చూడొద్దని దానితో సౌకర్యాలను కూడా వారు చెప్పుకొస్తున్నారు.
‘ఎవరికైనా రక్తం కారుతున్నా కండోమ్ తొడిగి ఆపేయొచ్చు. గాయమైతే హాస్పిటల్‌కు చేరే లోపు కండోమ్‌నే కట్టి తీవ్రతను తగ్గించవచ్చు’ అని ఆ డ్రైవర్ వివరించారు. కండోమ్‌తో వైద్యానికి సంబంధం లేని ఉపయోగాలు కూడా ఉన్నాయని అన్నాడు. ఒక్క కండోమ్ మూడు లీటర్ల ద్రవాన్ని మోయగలదని తెలిపాడు. అంటే పెట్రోల్, డీజిల్ అయిపోయి బాటిల్‌తో తెచ్చుకోవాల్సిన పరిస్థితుల్లో కండోమ్‌ను వాడి అవసరం తీర్చుకోవచ్చని తెలిపాడు.
నిజానికి ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లో వేలికి డ్రెస్సింగ్ చేసుకునేవి, చేతికి లేదా కాలికి కట్టుకునే గుడ్డ, శరీరంలో గాయమైతే కట్టుకోవడానికి గుడ్డ, కాలిన గాయమైతే కట్టుకోవడానికి రెండు పెద్ద, మూడు చిన్న గుడ్డలు, రెండు 15గ్రాముల దూది ఉండలు, 2శాతం టింక్చర్ అయోడిన్, సాల్ వోలటైల్, ఒక ఖాళీ బాటిల్, మెడిసిన్ గ్లాస్, కంటిలో వేసుకునే ఐ డ్రాప్ లు ఉండాలి. ఇవన్నీ మోటార్ వెహికల్ రూల్స్ 1989లో ఉన్నాయి. కానీ, కండోమ్స్ ఫస్ట్ ఎయిడ్ కిట్ లో ఉండాలని ఎక్కడా లేదు.