Indian Politics: నమ్మిన వారిని నట్టేట ముంచడమే నయా పాలిటిక్స్.. రుజువులు ఇవిగో!

అప్పటివరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన నాయకులు... అలా చూస్తుండగానే పక్కపార్టీలోకి జంప్ చేస్తుంటారు. క్షణాల్లో రంగులు మార్చేస్తుంటారు. ఇలా నేతల జంపింగ్‌లు ఓ ప్రహసనంలా సాగుతున్నా.. రాజకీయాల్లో ఎప్పుడూ హాట్‌టాపిక్కే..

Indian Politics – Kumaraswamy: రాజకీయం అంటేనే రంగులు మార్చడం..! జెండాలు.. అజెండాలు పక్కనపెట్టేసి.. సొంత లాభం చూసుకోవడమేనా..? ప్రస్తుతం జాతీయ రాజకీయాలను (National Politics) గమనిస్తే ఇంతకుమించి మరేమీ కనిపించదు.. వినిపించదు.. ఏ పార్టీ అయినా సరే.. ఎలాంటి నేత అయినా సరే మాకేంటి? అన్నట్లే నడుస్తోంది నయా రాజకీయం.. ఎవరు.. ఎప్పుడు.. ఎక్కడ ఉంటారో.. ఎవరితో స్నేహం చేస్తారో.. ఇంకెవరితో కయ్యానికి సిద్ధమవుతారో అంత తేలిగ్గా అర్థం కాదు. ఒకప్పుడు రాజకీయాల్లో కనిపించే హుందాతనం.. ఇప్పుడు మచ్చుకైనా కనిపించదు.. సొంత పార్టీకి హ్యాండివ్వడం.. నమ్మిన వారిని నట్టేట ముంచడమే నయా పాలిటిక్స్.. ఈ సరికొత్త రాజకీయంలో ఎమ్మెల్యేలు.. ఎంపీలే కాదు ముఖ్యమంత్రి స్థాయి నేతలు.. పార్టీల అధినేతలూ ఉంటున్నారు.. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి (HD Kumaraswamy) ఎన్డీఏ కూటమిలో చేరడం ఇప్పుడు దేశరాజకీయాల్లో హాట్‌టాపిక్.. కుమారస్వామి ఒక్కరే కాదు ఎందరో నేతలు ఎప్పటికప్పుడు జెండాలు, అజెండాలు మార్చేస్తుంటారు.. ఇలాంటి నేతలు ఎవరెవరో.. ఏ పార్టీ రాజకీయ అవసరాల కోసం ఎలాంటి వైఖరి ప్రదర్శిస్తుందో చూద్దాం.

రాజకీయాల్లో నేతల వలసలు అత్యంత సహజం.. ఎన్నికల ముందు ఈ కప్పదాట్లు మరింత ఎక్కువగా ఉంటుంటాయి.. అప్పటివరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన నాయకులు… అలా చూస్తుండగానే పక్కపార్టీలోకి జంప్ చేస్తుంటారు. క్షణాల్లో రంగులు మార్చేస్తుంటారు. ఇలా నేతల జంపింగ్‌లు ఓ ప్రహసనంలా సాగుతున్నా.. రాజకీయాల్లో ఎప్పుడూ హాట్‌టాపిక్కే.. ఐతే ఒక్కోసారి కొన్ని పార్టీలు.. ముఖ్యనేతలు జెండాలు మార్చేయడం.. అజెండాలు పక్కన పెట్టేయడం సంచలనం సృష్టిస్తుంటుంది.. ఇప్పుడు దేశ రాజకీయాల్లో.. ముఖ్యంగా కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది బీజేపీ-జేడీఎస్ రాజకీయ కలయిక. మే నెలలో జరిగిన ఎన్నికల్లో ఈ రెండు పార్టీలూ పరస్పరం కత్తులు దూసుకున్నాయి.. ఆ ఎన్నికల్లో రెండింటికి చేదు ఫలితాలే మిగలడంతో ఇప్పుడు వైరం ముగించి.. స్నేహానికి సిద్ధమయ్యయాయి.

JP Nadda, Amit Shah, Kumaraswamy

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే
వచ్చేఎన్నికల్లో గెలవడమే అజెండాగా పెట్టుకుని ఎన్‌డీఏలో చేరింది జేడీఎస్. మాజీ ప్రధాని దేవెగౌడ స్థాపించిన జనతాదల్ సెక్యులర్ పార్టీ.. తొలుత కాంగ్రెస్‌తో స్నేహం చేసింది. 2006లో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు కుమారస్వామి.. ఆ తర్వాత కొన్నాళ్లకే కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పి బీజేపీకి మద్దతిచ్చారు కుమారస్వామి.. ఇలా 2007లో బీజేపీతో కేవలం నెల రోజుల స్నేహం చేసిన జేడీఎస్ మళ్లీ ఇప్పటివరకు కమలం పార్టీతో కలవలేదు. కుమారస్వామి పేచీలు తట్టుకోలేక బీజేపీ నేతలు ఇన్నాళ్లూ జేడీఎస్‌ను దూరంగానే ఉంచారు. కానీ, గత ఎన్నికల పరాభవంతో కమలనాథులు మళ్లీ కుమారస్వామిపై ఫోకస్ పెట్టారు. కర్ణాటకలో జేడీఎస్-బీజేపీ కలిస్తేనే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలుస్తామనే అంచనాతో 16 ఏళ్ల వైరానికి ఫుల్‌స్టాప్ పెట్టారు. జేడీఎస్-బీజేపీ తాజా స్నేహాన్ని గమనిస్తే.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అంటున్నారు పరిశీలకులు..

Bihar CM Nitish Kumar

ఎప్పటికప్పుడు స్టాండ్ మార్చే నితీశ్‌కుమార్ 
బీజేపీ ఇలా జేడీఎస్‌తోనే కాదు గతంలోనూ ఇలాంటి స్నేహాలు ఎన్నో చేసింది.. ఎదురుదెబ్బలు తగిలినా.. రాజకీయ అవసరాలు.. అవకాశాల కోసం ఎప్పటికప్పుడు వాటిని దిగమింగుకుంటూ ముందుకు వెళుతోంది. కాంగ్రెస్ రాజకీయాల్లో కూడా ఇలాంటి ట్విస్టులు ఎన్నో కనిపిస్తుంటాయి. కర్ణాటకలో కుమారస్వామి మాదిరిగా.. బిహార్‌లో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఎప్పటికప్పుడు తన స్టాండ్ మార్చేస్తుంటారు. తన అవసరమే నితీశ్‌కుమార్ అజెండా.. తన పదవి పదిలంగా ఉండాలని నితీశ్ ప్రదర్శించే రాజకీయం ఔరా అనిపిస్తుంటుంది. బీజేపీ మద్దతుతో బిహార్‌లో గెలిచిన నితీశ్.. కొన్నాళ్లు ఆ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని నడిపారు. కానీ ఏమైందో గత ఏడాది సడన్‌గా ప్లేట్ ఫిరాయించారు. ప్రతిపక్షంతో చేతులు కలిపి అంతవరకు మిత్రపక్షంగా ఉన్న బీజేపీని ప్రతిపక్షం చేసేశారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కంకణం కట్టుకుని కాంగ్రెస్‌తో కలిసి I.N.D.I.A. కూటమిని ఏర్పాటు చేశారు నితీశ్.. ఇలా నితీశ్ బాటలో మరికొందరు సీనియర్ నేతలు తామేం తక్కువ కాదని నిరూపిస్తుంటారు.

NCP Chief Sharad Pawar

శరద్‌ పవార్ రూటే సపరేటు
దేశంలో పెద్దరాష్ట్రాల్లో ఒకటైన మహారాష్ట్రలో రాజకీయం ఏ ఒక్కరికీ అంతుచిక్కదు. బీజేపీ వ్యతిరేక అజెండాకు తానే పెద్దన్నగా చెప్పుకునే సీనియర్ నేత, మరాఠా వృద్ధనేత శరద్‌ పవార్ పార్టీ ఎన్‌సీపీ పొలిటికల్ ట్విస్టులు.. అత్యంత నాటకీయంగా ఉంటాయి. కాంగ్రెస్.. శివసేన.. ఎన్‌సీపీ కలిసి ఏర్పాటు చేసిన మహావికాస్ అగాడీ ప్రభుత్వం కూలిపోయాక.. పవార్ రాజకీయం పవర్ ఎలా ఉంటుందో కాంగ్రెస్‌కు చూపిస్తున్నారు. కాంగ్రెస్‌తో స్నేహంగా ఉంటూనే ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించడంతోపాటు.. తన అన్న కుమారుడు అజిత్ పవార్ పార్టీని చీల్చి బీజేపీతో చేతులు కలిపినా.. అది తమ ఇంటి వ్యవహారంగా మార్చేశారు పవార్.. అజిత్ చీలికవర్గం నేత అంటూనే ఆయనతో తెరచాటు రాజకీయం నెరుపుతుంటారు శరద్‌పవార్.. ఇదేంటి ప్రత్యర్థులతో మీటింగేంటి అంటూ ఎవరైనా ప్రశ్నిస్తే రాజకీయం వేరు.. బంధుత్వం వేరు.. మాది ఉమ్మడి కుటుంబం.. కలుసుకోవడం చాలా కామన్ అంటూ విషయాన్ని.. వివాదాన్ని లైట్‌గా తీసిపారేస్తారు శరద్‌పవార్.

uddhav thackeray

బీజేపీని పక్కకు తోసేసిన ఉద్ధవ్
ఇక మహారాష్ట్రలో మరో ముఖ్యనేత ఉద్ధవ్‌ఠాక్రే కూడా ఈ ఊసరవెల్లి రాజకీయాలకు ఏమాత్రం తీసిపోరు. ఉద్ధవ్ ఠాక్రే పార్టీ శివసేన.. బీజేపీ చాలాకాలంగా మిత్రపక్షాలుగా వ్యవహరించాయి.. సైద్ధాంతికంగా ఈ రెండూ ఒకే తోవలో పయనించడం వల్ల దేశంలో సహజ మిత్రులుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. కానీ, గత ఎన్నికల్లో అధికార పంపకాల్లో తేడా రావడంతో బీజేపీని పక్కకు తోసేసిన ఉద్ధవ్.. కాంగ్రెస్ సహకారంతో సీఎం పీఠం ఎక్కారు. ఇది అప్పట్లో పెను రాజకీయ సంచలనమైంది.. హిందుత్వ అజెండా.. మరాఠా ప్రాధాన్యతతో పనిచేసే శివసేన.. కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తుందని అప్పటివరకు ఏ ఒక్కరూ ఊహించలేదు.

Also Read: ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కి షాక్.. పార్టీకి ఎమ్మెల్యే రాజీనామా.. ఎందుకంటే?

Delhi CM Arvind Kejriwal

కేజ్రీవాల్ కూడా..
ఇలాంటి పరిణామాలు మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలకే కాదు.. దేశవ్యాప్తంగా తరచూ కనిపిస్తునే ఉంటాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంగతి కూడా ఇంచుమించు ఇలానే ఉంటోంది. యూపీఏ సర్కార్ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించి.. ప్రత్యేక పార్టీని పెట్టిన కేజ్రీవాల్.. చిత్రంగా ఇప్పుడు కాంగ్రెస్‌తో స్నేహం చేస్తున్నారు. ఢిల్లీలో ఓ వైపు కాంగ్రెస్ శ్రేణులతో ఆప్ కార్యకర్తలు పోరాడుతుంటే.. జాతీయ రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తూ ఇండియా కూటమిలో చేరారు కేజ్రీవాల్.. ఇక ఈ కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షాలైన కమ్యూనిస్టులు, తృణమూల్ కాంగ్రెస్ కూడా కేరళ, పశ్చిమబెంగాల్ వరకు స్నేహం వద్దు.. ఇతర రాష్ట్రాల్లోనే కూటమి ముద్దు అన్న వైఖరిని ప్రదర్శిస్తుండటాన్ని ఊసరవెల్లి రాజకీయంగానే పరిగణించాల్సివస్తోంది. దిగువస్థాయిలో నాయకులు స్వలాభం కోసం పార్టీలు ఫిరాయిస్తున్నారని సరిపెట్టుకున్నా.. అదే వైఖరి పార్టీల అగ్రనాయకత్వం ప్రదర్శిస్తుండటం.. అజెండాలను పక్కనపెట్టేయడమే ఇప్పుడు రాజకీయాల్లో అసలు సిసలైన హాట్‌టాపిక్.

ట్రెండింగ్ వార్తలు