CAB చట్టం అమలయ్యేనా..? : తీవ్రంగా వ్యతిరేకిస్తున్న 5 రాష్ట్రాలు

పార్లమెంట్‌లో క్యాబ్ బిల్ పాసైనంత సులువుగా చట్టంగా అమలయ్యేలా కన్పించడం లేదు. ఓవైపు సుప్రీంకోర్టులో కొత్త చట్టానికి వ్యతిరేకంగా దాదాపు డజను పిటిషన్లు దాఖలవ్వగా..

  • Publish Date - December 14, 2019 / 02:23 AM IST

పార్లమెంట్‌లో క్యాబ్ బిల్ పాసైనంత సులువుగా చట్టంగా అమలయ్యేలా కన్పించడం లేదు. ఓవైపు సుప్రీంకోర్టులో కొత్త చట్టానికి వ్యతిరేకంగా దాదాపు డజను పిటిషన్లు దాఖలవ్వగా..

పార్లమెంట్‌లో క్యాబ్ బిల్ పాసైనంత సులువుగా చట్టంగా అమలయ్యేలా కన్పించడం లేదు. ఓవైపు సుప్రీంకోర్టులో కొత్త చట్టానికి వ్యతిరేకంగా దాదాపు డజను పిటిషన్లు దాఖలవ్వగా.. మరోవైపు తమ దగ్గర ఈ చట్టాన్ని అమలు చేసేది లేదంటూ ఐదు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.

పార్లమెంట్‌లో ఆమోదం పొందిన పౌరసత్వ చట్ట సవరణకి వ్యతిరేకంగా..సుప్రీంకోర్టులో వరసగా పిటీషన్లు దాఖలు అవుతున్నాయ్. ఇప్పటిదాకా 11 పిటీషన్లు దాఖలయ్యాయ్. కాంగ్రెస్ పార్టీకి చెందిన జైరామ్ రమేష్, లాయర్ ఎంఎల్ శర్మతో పాటు ఇండియన్ ముస్లిం లీగ్, మెహువా మొయిత్రా, పీస్ పార్టీ తదితరులు పిటీషన్లు దాఖలు చేసారు. వీటిపై సుప్రీంకోర్టు కలిపి విచారించాలా..లేక విడివిడిగా విచారించాలా అనే అంశం తొందర్లోనే తేల్చనుంది. పౌరసత్వ సవరణ చట్టం మత ప్రాతిపదికన ఏర్పడిందని..ఇది రాజ్యాంగంలోని 14వ ఆర్టికల్‌కి విరుద్ధమంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయ్. ఈ నేపధ్యంలోనే పార్లమెంట్‌లో బిల్లు పాసైన తర్వాత కోర్టులోనే ఈ విషయం తేల్చుకోవాలని పార్టీలు ముందుకు వస్తున్నాయ్. 

మరోవైపు ఇప్పటికి ఐదు రాష్ట్రాలు పౌరసత్వ చట్ట సవరణను అమలు చేసేది లేదంటూ స్పష్టం చేశాయ్. పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, పంజాబ్, చత్తీస్‌గడ్, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాలలో క్యాబ్‌ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ జాబితాలో మరి కొన్ని రాష్ట్రాలు కూడా చేరే అవకాశాలు కన్పిస్తున్నాయ్. కాంగ్రెస్, ఎన్‌సిపితో సంకీర్ణ ప్రభుత్వం నడిపిస్తోన్న శివసేన కూడా ఈ బాటలోనే పయనిస్తుందంటున్నారు. కాంగ్రెస్ ఇప్పటికే మహారాష్ట్రలో పౌరసత్వ చట్ట సవరణకి అనుమతి ఇవ్వబోమంటూ ప్రకటించగా..శివసేన మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతోంది..

మరోవైపు ఈశాన్య రాష్ట్రాలలో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయ్. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు లాఠీఛార్జ్ చేయగా పలువురు గాయపడ్డారు. ఢిల్లీ వీధుల్లోనూ జామియా మిలియా ఇస్లామియా ఆధ్వర్యంలో ఆందోళనలు చోటు చేసుకున్నాయ్. అసోం, త్రిపురలో కూడా ఆందోళనలు కొనసాగుతుండగా..జపాన్ ప్రధాని వచ్చే వారం అటెండ్ కావాల్సిన ఇండో-జపాన్ సదస్సు రద్దైంది. ఈ వరస పరిణామాల మధ్య ఐక్యరాజ్యసమితి ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్‌లోని పరిణామాలను గమనిస్తున్నామని.. అక్కడి ఆందోళనలు కూడా తమకి తెలుసంటూ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ ఆంటోనియా గుటెరస్ చెప్పడం పరిస్థితి తీవ్రతకి అద్దం పడుతోంది.

కొత్త చట్టం ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లో అణచివేతకు గురైన హిందూ, సిక్కు, బౌద్ద, జైన, పార్సీ, క్రిస్టియన్లకు చెందినవారికి భారత్‌లో పౌరసత్వం ఇస్తారు. అయితే వారంతా డిసెంబర్ 31, 2014లోపు భారత్ వచ్చి ఉండాలి. ఈ జాబితాలో ముస్లింలను చేర్చనందుకే ఇది మతపరమైన వివక్ష చూపినట్లుగా విపక్షాలు ఆరోపిస్తున్నాయ్.

Also Read : ఏ రాష్ట్రానికి ‘పౌరసత్వం’ అమలును తిరస్కరించే అధికారం లేదు