ఇంటికి వెళ్లను..కాశ్మీర్ వెళ్తానంటున్న అభినందన్

ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ సెలవుపై ఇంటికి వెళ్లేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.మార్చి 1న భారత్‌ కు తిరిగి వచ్చిన ఆయన విచారణ పూర్తయ్యాక ఢిల్లీలోని రీసెర్చ్‌ అండ్‌ రెఫరల్‌ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందారు.అనారోగ్యం కారణంగా నాలుగు వారాలు సెలవుపై ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు అభినందన్ కు సూచించారు. అయితే ఆయన తమిళనాడులోని తన స్వగ్రామానికి వెళ్లకుండా శ్రీనగర్‌ లో వాయుసేన క్యాంపులో యుద్ధ విమానాలు, సహోద్యోగుల మధ్యే గడిపేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఈ నాలుగు వారాలు పూర్తయ్యాక ఆయన మళ్లీ వైద్య పరీక్షలకు ఢిల్లీ రావాల్సి ఉంది. యుద్ధ విమానాలను నడిపేందుకు అయన ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుందని వైద్యులు ధ్రువీకరించాకే మళ్లీ ఆయన విమానాలను నడిపే అవకాశముంటుంది.

పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో పాక్ విమానాన్ని పేల్చివేసే క్రమంలో  పాక్ భూభాగంలోకి వెళ్లిన అభినందన్ ను పాక్ మిలటరీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.అయితే భారత్ ఒత్తిడి మేరకు అభినందన్ ను సేఫ్ గా పాక్ భారత్ కు అప్పచెప్పిన విషయం తెలిసిందే.