Winter Session Of Parliament : కరోనా వైరస్ అన్నింటిపై ప్రభావం చూపెడుతోంది. చివరకు పార్లమెంట్ సమావేశాలపై కూడా ఎఫెక్ట్ పడుతోంది. ఈసారి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగకపోవచ్చని తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. రోజుకు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న తరుణంలో శీతాకాల సమావేశాలు నిర్వహించకపోవడమే బెటర్ అనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల లోపు సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో సమావేశాల నిర్వహణ కోసం అంతతొందర లేదని అంటున్నారు. ఫిబ్రవరి 01 ముందుగా జనవరి చివరి వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించవచ్చని వెల్లడిస్తున్నారు.
సెప్టెంబర్ నెలలో వర్షాకాల సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా..కట్టదిట్టమైన ఏర్పాట్లు చేసింది కేంద్రం. అయినా..పలువురు ఎంపీలు కరోనా బారిన పడ్డారు. 17 మంది లోక్ సభ, 8 మంది రాజ్యసభ సభ్యులకు కరోనా వైరస్ సోకింది. తర్వాత..కూడా పలువురు వైరస్ బారిన పడడంతో షెడ్యూల్ కు ముందుగానే..పార్లమెంట్ సమావేశాలను ముగించారు. మరి..శీతాకాల సమావేశాలు జరుగుతాయా ? లేదా ? అనేది కొద్ది రోజుల్లో తెలియనుంది.