Chandrayaan 3
Chandrayaan 3 – ISRO scientist: ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం సఫలం కావడంతో చంద్రుడిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా భారత్ (India) అవతరించింది. అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ నిలిచింది. అంతేగాక, జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత్ నిలిచింది. వందలాది మంది ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఇందులో ఉంది.
భారత్ ఇంతటి ఘనవిజయం సాధించడం వెనుక ప్రధానంగా ఉన్న శాస్త్రవేత్తలు ఎవరో తెలుసా?
1.ఎస్. సోమనాథ్..
ఎస్. సోమనాథ్ ఇస్రో ఛైర్మన్. 2022 జూన్ 15 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఆయన ఎయిరో స్పేస్ ఇంజినీర్. చంద్రయాన్-3ని కక్ష్యలో ప్రవేశపెట్టిన ఎల్వీఎం 3 రాకెట్ అభివృద్ధిలోనే ఆయన పాలుపంచుకున్నారు. చంద్రయాన్-3ని పర్యవేక్షణ బాధ్యతలను ఆయన చూసుకున్నారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో చదివారు. ఆయనకు సంస్కృతంలోనూ పాండిత్యం ఉంది.
ఎస్. సోమనాథ్ ఛైర్మన్ గా ఉన్న సమయంలోనే చంద్రయాన్-3 ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత్ అడుగు పెట్టిందని భవిష్యత్తు తరాలు చెప్పుకుంటాయి. సోమనాథ్ ఇవాళ మాట్లాడుతూ… తమ టీమ్ కు అభినందనలు తెలిపారు. ప్రయోగం విజయవంతమైందని ప్రకటించారు. ఈ విజయాల పరంపరను కొనసాగించేందుకు కృషి చేస్తామని చెప్పారు.
2.పి.వీరముత్తువేల్
పి.వీరముత్తువేల్ చంద్రయాన్-3 ప్రాజెక్టు డైరెక్టర్. ఓ మాజీ రైల్వే ఉద్యోగి కుమారుడు వీరముత్తువేల్. ఈ శాస్త్రవేత్త సొంత రాష్ట్రం తమిళనాడు. చంద్రయాన్-3 మిషన్ మొత్తానికి ఆయనే ఇన్‌చార్జ్. 2014లో ఇస్రోలో చేరారు. ఆయనో మెకానికల్ ఇంజనీర్. ఐఐటీ మద్రాస్ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు.
చంద్రయాన్-3 మిషన్‌కు సంబంధించి ఇస్రో కేంద్రాలన్నింటినీ సమన్వయం చేస్తూ చంద్రయాన్-3 గ్రాండ్ సక్సెస్ సాధించడంలో కీలక పాత్రపోషించారు. జులై 14న ఎల్వీఎం 3 రాకెట్ ను కక్ష్యలోకి పంపినప్పటి నుంచి ఇప్పటివరకు వీరముత్తువేల్, ఆయన టీమ్‌లోని శాస్త్రవేత్తలు అందరూ బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్క్ (ISTRAC)లోని మిషన్ కంట్రోల్ రూమ్‌లోనే ఉన్నారు.
రాకెట్‌కు సంబంధించిన అన్ని అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. చంద్రయాన్-3 కక్ష్యను పెంచడం, తగ్గించడం వంటి అన్ని ఆపరేషన్లను వీరముత్తువేల్, ఆయన టీమ్ చేసింది. బుధవారం సాయంత్రం 17.47 గంటల వరకు చంద్రయాన్-3 సంబంధించిన అన్ని ఆపరేషన్లను వారే చేశారు.
అనంతరం ల్యాండింగ్ ప్రక్రియ చివరి 17 నిమిషాల్లో మాత్రం వీరి ప్రమేయం లేదు. వారు కూడా ప్రేక్షకుల్లా చూస్తూ కూర్చున్నారు. ఆ 17 నిమిషాలు వ్యోమనౌక స్వయంగా ఆపరేషన్ పూర్తి చేసేలా ముందుగానే ప్రోగ్రాం చేసిన విషయం తెలిసిందే. వీరముత్తువేల్ జులై 14న మాట్లాడుతూ.. ” చంద్రుడిని చేరేందుకు మా ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఎదురుచూస్తున్నాం. బెంగళూరులోని ISTRAC నుంచి చంద్రయాన్-3ని మేము పర్యవేక్షించాల్సి ఉంది ” అని చెప్పారు.
3. బీఎన్ రామకృష్ణ
బీఎన్ రామకృష్ణ బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్క్ (ISTRAC) ఏడో డైరెక్టర్. చంద్రయాన్-3 మిషన్ ను ISTRAC నుంచే నియంత్రించాల్సి ఉంటుంది. బెంగళూరులోని ఓ వర్సిటీ నుంచే రామకృష్ణ మాస్టర్స్ డిగ్రీ చేశారు. శాటిలైట్ల ద్వారా నేవిగేషన్, వ్యోమనౌక కక్ష్యల మార్పు, నిర్ధారణ వంటి అంశాల్లో ఆయన నిష్ణాతుడు.
4.ఎం.శంకరన్
ఎం.శంకరన్ బెంగళూరులోని యూఆర్ రావ్ సాటిలైట్ సెంటర్ (URSC) డైరెక్టర్. 2021 జూన్ నుంచి ఆయన ఆ పదవిలో ఉన్నారు. ఇస్రో అంతరిక్ష మిషన్లకు సంబంధించిన వ్యోమనౌకలను అక్కడ అభివృద్ధి చేస్తారు. యూఎస్ఎస్సీలోనే చంద్రయాన్-3 వ్యోమనౌకను అభివృద్ధి చేశారు. గతంలో శంకరన్ యూఎస్ఎస్సీలోనే కమ్యూనికేషన్స్, పవర్ సిస్టమ్స్ యూనిట్ డిప్యూటీ డైరెక్టర్ గా కొనసాగారు. చంద్రయాన్-1, చంద్రయాన్-2, మార్స్ ఆర్బిటర్ మిషన్ల కోసం సోలార్ అర్రేస్, పవర్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ అభివృద్ధి చేయడంలో పాలు పంచుకున్నారు.
5.ఎస్ మోహన కుమార్
ఎస్ మోహన కుమార్ చంద్రయాన్-3 లాంచ్ మిషన్ డైరెక్టర్. జులై 14న ఎల్వీఎం 3 రాకెట్ ను మోహన కుమార్ ఆధ్వర్యంలోనే కక్ష్యలోకి ఇస్రో పంపింది. చంద్రయాన్-3ని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టామని మొదటిసారి అధికారికంగా ప్రకటన చేసింది ఆయనే. ” నేను ఈ మిషన్ డైరెక్టర్ ను ” అంటూ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ఆయన ఆ ప్రకటన చేశారు.
” ఎల్వీఎం 3 రాకెట్ చంద్రయాన్-3ను కక్ష్యలో ప్రవేశపెట్టామని సంతోషంగా ప్రకటిస్తున్నాను. ఇస్రోకు చెందిన అత్యంత బరువైన రాకెట్లను కక్ష్యలోకి తీసుకెళ్లడంలో ఎల్వీఎం 3 చాలా సమర్థమంతమైందని మరోసారి నిరూపితమైంది ” అని ఆ సమయంలో చెప్పారు.
ఒక వెబ్ ఇండియా-2 సర్వీస్ కి సంబంధించి ఎల్వీఎం 3 లాంఛ్ మిషన్ డైరెక్టర్ కూడా ఎస్ మోహన కుమారే. ఆయన తిరువనంత పురంలోని విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ సీనియర్ శాస్త్రవేత్త. ఇస్రోలో ఆయన 30 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు.
6.వి.నారాయణ్
వి.నారాయణ్ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (LPSC) డైరెక్టర్. ఎల్వీఎం 3 కోసం క్రయోజెనిక్ ఇంజన్లను ఈ కేంద్రంలోనే రూపొందించారు. ఐఐటీ ఖరగ్‌పూర్ లో చదివారు. ప్రొపల్షన్ సిస్టమ్స్ విశ్లేషించడంలో, క్రయోజెనిక్ ఇంజిన్ డిజైన్, భారీ ప్రాజెక్టుల నిర్వహణలో నిష్ణాతుడు.
చంద్రయాన్-3కి సంబంధించిన ప్రొపల్షన్ సిస్టమ్స్ డిజైన్ చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. భారత అంతరిక్ష ప్రోగ్రాంలో ఇదో చారిత్రాత్మక ఘటన అని, అంతరిక్ష రంగానికి సంబంధించిన అందరం నాలుగేళ్లు ఎంతో కృషి చేశామని గత నెల చంద్రయాన్-3ని కక్ష్యలోకి ప్రవేశపెట్టాక అన్నారు. సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రొపల్షన్ మ్యాడ్యూల్లో రెండు, ల్యాండర్ లో రెండు ఇంజన్లు ఉన్నాయని వివరించారు.
7. ఎస్.ఉన్నికృష్ణన్ నాయర్
ఎస్.ఉన్నికృష్ణన్ నాయర్ తిరువనంతపురంలోని రాకెట్ అభివృద్ధి ప్రధాన కేంద్రం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్. ఆయన హ్యూమన్ ఫైట్ సిస్టమ్స్ లో నిపుణుడు. ఇస్రోలో ఆయన 1985లో చేరారు. అనేక ఏరోస్పేస్ వ్యవస్థలు, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, ఎల్వీఎం3 రాకెట్ల అభివృద్ధిలో ఆయన పాలుపంచుకున్నారు.
Chandrayaan 3 Updates: చంద్రయాన్-3 సక్సెస్.. భారత కీర్తి మరోసారి జగద్వితం..