Work From Home : నవంబర్ 5 నుంచి 50శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..! కారణం ఇదే..

Work from home : వాయు కాలుష్యాన్ని తగ్గించే నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 5 నుంచి 20వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో 50శాతం మంది ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరు కావాలని, మిగిలిన వారు ఇంటి నుంచే పనిచేసేలా చర్యలు చేపట్టాలని ఆయా సంస్థలు, విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది.

Work From Home

Work From Home : దేశ రాజధాని ఢిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో సగం మంది ఉద్యోగులు మాత్రమే కార్యాలయాలకు రావాలని, మిగిలిన వారు ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించింది. నవంబర్ 5 నుంచి 20వ తేదీ వరకు ఈ నిబంధన అమల్లో ఉండనుంది. మరోవైపు నిర్మాణ పనులపైనా ఆంక్షలు విధించారు.

Also Read : Tamil Nadu CM Vijay : తమిళనాడు సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయం.. నిరుద్యోగులకు శుభవార్త..

చలికాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌) లో గాలి నాణ్యత మరింత దిగజారే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిని ముందుగానే అరికట్టేందుకు వాయు నాణ్యత నిర్వహణ కమిషన్‌ (CAQM) కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో మొత్తం ఉద్యోగుల్లో గరిష్ఠంగా 50 శాతం మంది మాత్రమే కార్యాలయాలకు హాజరుకావాలి. మిగిలిన ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

ఈ నిబంధనలు ఢిల్లీతో పాటు ఐదు ఎన్‌సీఆర్‌ జిల్లాలకు వర్తిస్తాయి. ఢిల్లీ, గరుగ్రామ్, ఫరీదాబాద్, సోవిపట్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్ (నోడాయి, గ్రేటర్ నోడాయి ప్రాంతాలు) ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు ఉద్యోగుల హాజరును 50 శాతానికి పరిమితం చేయాల్సి ఉంటుంది.

అయితే, పరిశ్రమలు, అత్యవసర సేవలు అందించే సంస్థలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని, ఇంటి నుంచి పని చేయడం సాధ్యం కాని అత్యవసర సేవల విభాగాలు, పారిశ్రామిక సంస్థలకు ఈ ఆదేశాలు వర్తించవని ప్రభుత్వం తెలిపింది.

కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరును తగ్గించడంతోపాటు దుమ్ము, ధూళి ఎక్కువగా వెలువడే నిర్మాణాలు, కూల్చివేత పనులపైనా ఆంక్షలు విధించారు. నవంబర్ 5 నుంచి 20 వరకు మొత్తం ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో ఈ పనులను నిలిపివేయాలని ఆదేశించారు. రోడ్లు, జాతీయ రహదారులు, వంతెనలు, పైవంతెనలు, విద్యుత్‌ సరఫరా లైన్లు, పైప్‌లైన్లు, సమాచార వ్యవస్థలకు సంబంధించిన నిర్మాణ పనులు కూడా ఈ ఆంక్షల పరిధిలోకి వస్తాయి.

అయితే రైల్వేలు, మెట్రో రైలు, విమానాశ్రయాలు, అంతర్రాష్ట్ర బస్‌ టెర్మినళ్లు, ఆసుపత్రులు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు, జాతీయ భద్రత, రక్షణ రంగానికి సంబంధించిన అత్యవసర ప్రాజెక్టులకు మినహాయింపులు ఇచ్చారు.