Maha Kumbh : ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్.. కిక్కిరిసిన కుంభమేళా.. 300 కి.మీ మేర రద్దీ.. 11 గంటలకు పైగా నిలిచిన వాహనాలు.. నెటిజన్ల రియాక్షన్!

Maha Kumbh Traffic Jam : మహా కుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో 300 కి.మీ.ల ట్రాఫిక్ జామ్ భక్తులను ఉక్కిరిబిక్కిరి చేసింది. 11 గంటలకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. 'గూగుల్ నావిగేషన్‌ను నమ్మవద్దు' అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

World's biggest traffic jam

Maha Kumbh Traffic Jam : మహాకుంభమేళాకు భక్తుల రద్దీ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగా రాజ్‌కు రోజురోజుకు భక్తులు పోటెత్తుతున్నారు. కుంభామేళా మొదలై 28 రోజులు అవుతున్నా ఇప్పటికీ రద్దీ తగ్గడం లేదు. ఆదివారం సాయంత్రం 6 గంటల నాటికి 1.42 కోట్లకు పైగా భక్తులు గంగా, సంగమంలో స్నానమాచరించారు.

ఇప్పటివరకు 42 కోట్లకు పైగా భక్తులు కుంభమేళాకు చేరుకున్నారు. కోట్లాదిమంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌‌కు వెళ్లే రోడ్డు మార్గాలన్నీ వాహనాలతో నిండిపోయాయి.

ముఖ్యంగా ప్రయాగ్‌రాజ్ వైపు సుమారు 200 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే మార్గాల్లో భారీ రద్దీ కారణంగా, అనేక మంది భక్తులు 11 గంటలకు పైగా ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకున్నారు.

Read Also :  Vivo V50 Launch Date : గుడ్ న్యూస్.. ఏఐ ఫీచర్లతో వివో V50 ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్ డేట్ ఇదేనట.. గెట్ రెడీ!

మధ్యప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. కట్ని, మైహార్, రేవా అంతటా రోడ్లు మూసుకుపోయాయి. వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను నియంత్రించడానికి పోలీసులు ప్రయాగ్‌రాజ్ అధికారులతో కలిసి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ఈ ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు మధ్యప్రదేశ్‌లోనే వేలాది వాహనాలను పోలీసులు నిలిపివేస్తున్నారు. అయినప్పటికీ వాహనాల రద్దీ ఆగడం లేదు. ఎక్కడ చూసినా వాహనాలే.. రోడ్లన్నీ వాహనాలతోనే నిండిపోయాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్‌గా చెప్పవచ్చు.

ఒక రోజు ముందు, మధ్యప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలలో ప్రయాగ్‌రాజ్ వైపు వెళ్తున్న వందలాది వాహనాలను భారీ ట్రాఫిక్ కారణంగా, రద్దీని నివారించడానికి పోలీసులు నిలిపివేశారు. కట్ని జిల్లాలోని పోలీసు వాహనాలు సోమవారం వరకు ట్రాఫిక్ నిలిపివేసినట్లు ప్రకటించగా, మైహార్ పోలీసులు వాహనాలను కట్ని, జబల్పూర్ వైపు తిరిగి వెళ్లి అక్కడే ఉండాలని కోరారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ :
“ఈ రోజు ప్రయాగ్‌రాజ్ వైపు వెళ్లడం అసాధ్యం. ఎందుకంటే 200-300 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ ఉంది” అని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలోని అనేక వీడియోలు మధ్యప్రదేశ్‌లోని కట్ని, మైహార్, రేవా జిల్లాల్లోని రోడ్లపై వేలాది కార్లు, ట్రక్కులు భారీ క్యూలను చూపిస్తున్నాయి.

నెటిజన్లు దీనిని “ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్”​అని అంటున్నారు. రేవా జిల్లాలోని చక్‌ఘాట్ వద్ద కట్ని నుంచి ఎంపీ-యూపీ సరిహద్దుల వరకు 250 కి.మీల విస్తీర్ణంలో భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చాలా మంది భక్తులు చాలా గంటలుగా రోడ్లపై చిక్కుకుపోయారని పేర్కొన్నారు.

ఆదివారం రద్దీ కారణంగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయని ఇన్‌చార్జ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (రేవా జోన్) సాకేత్ ప్రకాష్ పాండే అన్నారు. రెండు రోజుల్లో పరిస్థితి తగ్గే అవకాశం ఉందని, ప్రయాగ్‌రాజ్ అధికారులతో సమన్వయం చేసుకున్న తర్వాత ఎంపీ పోలీసులు వాహనాలను తరలించడానికి అనుమతిస్తున్నారని ఆయన అన్నారు.

ఇంతలో, ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే యాత్రికుల సంఖ్య తగ్గడం లేదని, రేవా-ప్రయాగ్‌రాజ్ మార్గంలో వాహనాల ఒత్తిడి నిరంతరం పెరుగుతుందని రేవా జిల్లా యంత్రాంగం పేర్కొంది. చక్‌ఘాట్ దాటి జనసమూహం పెరగడంతో, అక్కడ, ఇతర ప్రదేశాలలో వాహనాలను నిలిపివేసినట్లు రేవా జిల్లా కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లొద్దు : చిక్కుకున్న భక్తులకు పోలీసుల సూచనలు :
ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే మార్గాల్లో గంటల కొద్ది ట్రాఫిక్ జామ్‌, రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల అనేక మంది భక్తులు తమ ఇళ్లకు తిరిగి వెళ్లాలని కోరారు. ప్రయాగ్‌రాజ్ నుంచి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధ్యప్రదేశ్ నగరమైన కట్నిలో ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించవద్దని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.

ప్రయాగ్‌రాజ్ స్టేషన్ తాత్కాలికంగా మూసివేత :
ప్రయాగ్‌రాజ్‌లో జనం భారీగా తరలిరావడంతో నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. రద్దీ పెరుగుతున్న దృష్ట్యా, ఆదివారం నాడు ప్రయాగ్‌రాజ్ సంగం స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. అయితే, రైలు కార్యకలాపాలు యథావిధిగా నడుస్తాయి. కానీ, సాధారణ ప్రజలకు స్టేషన్ మూసివేసినట్టు వెల్లడించారు.

ప్రయాగ్‌రాజ్‌లో ట్రాఫిక్ రద్దీపై అఖిలేష్ యాదవ్ విమర్శ :
ప్రయాగ్‌రాజ్‌లో భారీ ట్రాఫిక్ రద్దీ కారణంగా యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆహారం, నీరు, టాయిలెట్ సౌకర్యాలు లేకుండా గంటల తరబడి వేచి ఉండాల్సిన వాహన ప్రయాణికులు ఎదుర్కొంటున్న అసౌకర్యాన్ని కూడా ఎస్పీ నేత ఎత్తి చూపారు.

Read Also : NRDRM Recruitment 2025 : ఎన్ఆర్‌డీఆర్ఎమ్‌లో 13,762 ఉద్యోగాలు.. నెలకు జీతం రూ. లక్షా 20వేల వరకు.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

కుంభమేళా ట్రాఫిక్ జామ్‌పై నెటిజన్ల రియాక్షన్ :
మరోవైపు.. చిక్కుకుపోయిన భక్తులు సోషల్ మీడియాలో తమ బాధలను పంచుకున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో ట్రాఫిక్ రద్దీకి సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేస్తున్నారు. అధికారుల నిర్వహణ లోపం పట్ల తమ నిరాశను వ్యక్తం చేశారు.

“మహా కుంభమేళాకు వెళ్లే దారిలో గత 3 గంటలుగా ట్రాఫిక్‌లో చిక్కుకున్నాను. ఈ ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ, సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. అవసరమైన చర్యలు తీసుకోవాలని కుంభమేళా అధికారులను అభ్యర్థిస్తారా అంటూ పోస్టులు పెడుతున్నారు.

గూగుల్ మ్యాప్ గుడ్డిగా నమ్మొద్దు :
#కుంభ్ చాలా రద్దీగా ఉంది, మొత్తం #ప్రయాగ్రాజ్ ట్రాఫిక్ గందరగోళంగా, ఉక్కిరిబిక్కిరి అయ్యింది. మొదటిసారి, #GoogleNavigation మొత్తం మార్గాన్ని బ్లూ కలర్‌లో కనిపించింది. అయినప్పటికీ కేవలం 15–20 కి.మీ ప్రయాణించడానికి దాదాపు 5 గంటలు పట్టింది. గూగుల్ నావిగేషన్ నమ్ముకుని రావొద్దు. ఫిబ్రవరి 5 తర్వాత జనం భారీగా పెరిగారని, ఇప్పుడు జనవరిలో ఉన్నంతగా నిండిపోయారని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.