Mobile Phone Blast (Photo Credit : Google)
Mobile Phone Blast : సెల్ ఫోన్.. మనిషి జీవితంలో భాగమైపోయింది. చాలా మంది ఫోన్ కి అడిక్ట్ అయిపోయారు. తిండి, నీరు లేకపోయినా ఉండగలరేమో కానీ, ఒక్క సెకను కూడా తమ దగ్గర ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. మేల్కొని, నిద్రలో ఉన్నా, పనిలో ఉన్నా, ఖాళీగా ఉన్నా.. కచ్చితంగా తమ చేతిలో మొబైల్ ఉండాల్సిందే. అంతగా కొందరు సెల్ ఫోన్ కి అడిక్ట్ అయిపోయారు. అయితే, ఈ అలవాటు చాలా ప్రమాదకరంగా మారుతోంది. ప్రాణాలకే ముప్పు తీసుకొస్తోంది. వంట చేస్తూ చేతిలో పట్టుకున్న ఫోన్.. ఓ వ్యక్తి ప్రాణం తీసింది. మధ్యప్రదేశ్ లో ఈ ఘోరం జరిగింది.
బింద్ జిల్లాలో ఓ వ్యక్తి వంట చేస్తున్నాడు. ఆ సమయంలో అతడి చేతిలో ఫోన్ ఉంది. అయితే, ప్రమాదవశాత్తు అతడి చేతిలో ఉన్న ఫోన్ జారి వేడి వేడి నూనె ఉన్న పాత్రలో పడింది. అంతే.. ఒక్కసారిగా బ్యాటరీ పేలిపోయింది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం బాధితుడిని గ్వాలియర్ తరలిస్తుండగా మృతి చెందాడు.
ఫోన్ వేడి వేడి నూనెలో పడటంతో బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మొబైల్ ఫోన్ పేలుడుతో మృతి చెందినట్లు సెక్షన్ 194 బీఎన్ ఎస్ కింద కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మృతుడిని చంద్రప్రకాశ్ గా గుర్తించారు. బింద్ లోని లహర్ లో నివాసం ఉంటున్నాడు. చంద్రప్రకాశ్ కిచెన్ లో వంట చేస్తున్నాడు. అదే సమయంలో అతడు తన ఫోన్ చూస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఫోన్ చేతిలో నుంచి జారి సలసల మరుగుతున్న నూనె పాత్రలో పడిపోయింది. ఆ వేడికి మొబైల్ ఫోన్ బ్యాటరీ పేలిపోయింది. పేలుడు ధాటికి వేడి వేడి నూనె అతడిపై పడింది. అదే సమయంలో మంటలు వ్యాపించాయి. తీవ్రంగా గాయపడిన చంద్రప్రకాశ్ ను తొలుత స్థానికి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్ లో గ్వాలియర్ తరలిస్తుండగా.. మృతి చెందాడు.
వంట చేస్తూ ఫోన్ చూడటం ఎంత ప్రమాదకరమో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. ఏ మాత్రం అటు ఇటు అయినా.. ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోవడం ఖాయం. అందుకే, కొన్ని చోట్ల ఫోన్ కి దూరంగా ఉండటమే మంచిది. లేదంటే ప్రాణాలకే ప్రమాదం.
Also Read : రోడ్డుపై టపాసులు కాల్చుతున్న యువకుడిని ఢీకొట్టి దూసుకెళ్లిన కారు