Zika Virus Nine New Cases Found In Kanpur, Total Count Goes Up To 98
Zika virus new cases : ఉత్తరప్రదేశ్‌లో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. కాన్పూర్ సిటీలో జికా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మంగళవారం (నవంబర్ 9) కొత్తగా 9 మందిలో జికా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. దాంతో ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన జికా వైరస్ కేసుల సంఖ్య 98కి చేరింది. జికా వైరస్ నియంత్రించేందుకు యోగి సర్కార్ 100 వైద్య బృందాలను రంగంలోకి దించింది. జికా వైరస్ కేసుల సంఖ్య ఎక్కడ ఉంది? ఎవరిలో జికా వైరస్ లక్షణాలు ఉన్నాయి అనేది మెడికల్ టీం ఎప్పటికప్పుడూ పర్యవేక్షించినుందని కాన్పూర్ సిటీ మెడికల్ ఆఫీసర్ నేపాల్ సింగ్ పేర్కొన్నారు.
వంద మంది వైద్యబృందాలు ఇంటికి వెళ్లి శాంపిల్స్ సేకరిస్తుండగా.. మరో 50 బృందాలు టెస్టుల కోసం శాంపిల్స్ సేకరించి తగిన చికిత్స అందించేలా పనిచేస్తున్నాయి. అదనంగా మరో 15 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు (RRT) కూడా రంగంలోకి దిగి జికా వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేసే దిశగా చర్యలు చేపట్టినట్టు సింగ్ తెలిపారు. జికా వైరస్ సోకిన బాధితుల స్నేహితులు, బంధువుల్లో ఎవరికైనా వైరస్ లక్షణాలు ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడూ వైద్యబృందాలు పర్యవేక్షించాల్సిందిగా నేపాల్ సింగ్ సూచించారు. కాన్పూర్‌కు చెందిన ఆరోగ్య విభాగం, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సైతం జికావైరస్ ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని నేపాల్ సింగ్ చెప్పారు.
శ్యామ్‌నగర్, కోయిలా నగర్, చకేరి, జగ్మౌ, ఎయిర్‌ఫోర్స్ కాలనీల్లో జికా ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. జికా వైరస్ అనేది దోమల కుట్టడం ద్వారా వ్యాప్తి చెందుతుంది. Aedes అనే జాతికి చెందిన దోమ కుట్టినప్పుడు జికా వైరస్ సంక్రమిస్తుంది. ఈ వైరస్ సోకినప్పుడు స్వల్ప జ్వరంతో పాటు దద్దర్లు, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, కండ్లకలక వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరోవైపు.. జికా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం (నవంబర్ 10)న కాన్పూర్ లో పర్యటించనున్నారు.
Read Also : OnePlus Nord 2 : మళ్లీ పేలిన వన్‌ప్లస్ నోర్డ్ 2 ఫోన్.. యూజర్‌కు తీవ్రగాయాలు.. ఫొటోలు వైరల్!