Zomato : జొమాటో వినియోగదారులకు బిగ్ షాక్.. క్యాష్ ఆన్ డెలివరీకి కొత్త ఫీజు! కోట్లలో అదనపు ఆదాయం?
Zomato Cash On Delivery : జొమాటోలో క్యాష్ ఆన్ డెలివరీ ఎంచుకునే వారికి కొత్తగా రూ.5 ‘పే ఆన్ డెలివరీ ఫీజు’ వసూలు చేస్తోంది. ఇప్పటికే పలు ఛార్జీలతో పెరుగుతున్న ఫుడ్ బిల్లు.. ఈ కొత్త ఫీజుతో మరింత పెరగనుంది.
- Harish Thanniru
- Published on- September 12, 2026 / 02:03 PM IST
Zomato Cash On Delivery
Zomato Cash On Delivery : ఫుడ్ ఆర్డర్ చేసి.. డెలివరీ బాయ్‌కి చేతిలో నగదు ఇస్తే సరిపోతుందని అనుకుంటున్నారా? ఇకపై అలా కుదరదు.. మీ జేబుపై అదనపు భారం పడనుంది. జొమాటోలో క్యాష్ ఆన్ డెలివరీ ఎంచుకునే వారికి కొత్తగా రూ.5 ‘పే ఆన్ డెలివరీ ఫీజు’ వసూలు చేస్తోంది. ఇప్పటికే పలు ఛార్జీలతో పెరుగుతున్న ఫుడ్ బిల్లు.. ఈ కొత్త ఫీజుతో మరింత పెరగనుంది.
దేశంలో రోజురోజుకూ ఆన్‌లైన్ ఆర్డర్లకు ఆదరణ పెరుగుతోంది. ఫుడ్ నుంచి గ్రాసరీ, ఇతర నిత్యావసరాల వరకు ఇంటి నుంచే ఆర్డర్ చేసేవారి సంఖ్య ఎక్కువవుతోంది. ముఖ్యంగా జొమాటో, స్విగ్గీ వంటి ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌పామ్‌కు ఎక్కువ ఆదరణ ఉంది. అయితే, ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లపై ఇప్పటికే పలు రకాల ఛార్జీలు వసూలు చేస్తున్న జొమాటో.. తాజాగా మరో కొత్త ఫీజును తీసుకొచ్చింది. ఇకపై క్యాష్ ఆన్ డెలివరీ ఎంచుకునే వినియోగదారుల నుంచి అదనంగా రూ.5 వసూలు చేయడం ప్రారంభించింది. ఈ కొత్త ఛార్జీని బిల్లులో ప్రత్యేకంగా పే ఆన్ డెలివరీ ఫీజుగా చూపిస్తోంది.
జొమాటో ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకునే సమయంలో ఆన్‌లైన్ పేమెంట్ చేయకుండా.. ఫుడ్ డెలివరీ అయిన తరువాత క్యాష్ ఇచ్చే ఆప్షన్ ను ఎంచుకుంటే ఇక నుంచి అదనపు ఛార్జీలు పడనున్నాయి. డెలివరీ బాయ్ ఆర్డర్ ఇచ్చిన తరువాత ఫుడ్ ఆర్డర్, డెలివరీ ఛార్జీలతో కలిపి అదనంగా మరో రూ.5 ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఆ రూ.5 కూడా ముందుగానే బిల్లులో చేర్చుతున్నట్లు తెలుస్తోంది. అయితే, కొన్ని సందర్భాల్లో రూ.5కు బదులుగా రూ.7, మరికొన్ని సందర్భాల్లో ఏకంగా రూ.20 వరకు కూడా ఛార్జ్ కనిపించినట్లు కొందరు వినియోగదారులు పేర్కొంటున్నారు. ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసేవారికి మాత్రం ఈ ప్రత్యేక సీఓడీ ఛార్జీ ఉండదు.
గణాంకాల ప్రకారం.. జొమాటో రోజుకు సుమారు 23–25 లక్షల ఫుడ్ ఆర్డర్లు ప్రాసెస్ చేస్తుందని సమాచారం. ప్రతి ఆర్డర్‌పై రూ.5 వసూలు చేస్తే దాదాపు కోట్లలో అదనపు ఆదాయం సమకూరే చాన్స్ ఉంది. వినియోగదారుల నుంచి చిన్న మొత్తాల్లో ఫీజులు వసూలు చేయడం ద్వారా భారీ స్థాయిలో ఆదాయాన్ని పెంచుకోవడం ఫుడ్ డెలివరీ సంస్థలకు కీలకమైన వ్యూహంగా మారుతోంది. 2023లో ప్లాట్‌ఫామ్ ఫీజులు ప్రవేశపెట్టిన తర్వాత జొమాటో వాటిని క్రమంగా పెంచుతూ వస్తోంది. ఈ ఏడాది ప్లాట్‌ఫామ్ ఫీజును ఒక్కో ఆర్డర్‌కు రూ.14.99కు పెంచిన విషయం విధితమే.
