Haryana Murrah Breed Buffalo
Haryana Murrah breed buffalo : ఓ దున్నపోతు ధర అక్షరాలు రూ.25 కోట్లు అంటే ఆశ్చర్యపోతాం. ఏదో వజ్రాల ధర విన్నట్లుగా షాక్ అవుతాం. పైగా ఆ కాస్ట్లీ దున్న సంపాదన కూడా అదే రేంజ్ లో ఉంది. నెలకు దాదాపు రూ.10 లక్షలు సంపాదిస్తోంది. ముర్రాజాతికి చెందిన ఈ హైరేంజ్ కాస్ట్ గల ఈ దున్న పేరు కూడా మాంచి పాష్ గా రాజసంగా ఉందండోయ్..ఆ దున్న పేరు ‘షెహన్‌షా’.
గేదె అయితే పాల ఉత్పత్తితో డబ్బులు సంపాదించొచ్చు కానీ దున్నతో సంపాదన ఏంటీ అనుకోవచ్చు. కానీ మేలుజాతికి చెందిన పశువుల ధరల గురించి తెలిసివారు, అటువంటి పశువులను పెంచి పోషించేవారికి మాత్రం అదెలా సాధ్యమో తెలుస్తోంది. మేలు జాతి గేదెల కంటే దున్నలకే ఎక్కుడ డిమాండ్ ఉంటుంది. మేలు జాతి దున్నల వీర్యానికి మంచి డిమాండ్ ఉంటుంది. అలా ‘షెహన్‌షా’ అనే ఈ దున్నపోతు వీర్యానికి దేశవిదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. అలా తన వీర్యంతో నెలకు రూ.9.60లక్షలు సంపాదించి పెడుతోంది తన యజమానికి.
హర్యానాలోని పానిపట్ జిల్లా దిద్వాడి గ్రామానికి చెందిన నరేంద్రసింగ్ అనే రైతు ఈ ‘షెహన్‌షా’ దున్నను పెంచి పోషిస్తున్నాడు. నరేంద్రసింగ్ పెంచుకునే ఈ దున్నపోతు వయస్సు పదేళ్లు.ఆరడుగుల ఎత్తు, 15 అడుగుల పొడవుతో మాంచి బలిష్టంగా నల్లగా నిగనిగలాడిపోతుంటుంది ‘షెహన్‌షా’. ముర్రాజాతికి చెందిన ఈ జాతి దున్నల వీర్యానికి దేశవిదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. వీర్యంతో దాదాపు 800 డోసులను తయారు చేస్తారు.వీటిని వేరు చేసే ప్రక్రియలో ప్రతి డోసుకు రూ. 300 వరకు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత దీనిని మార్కెట్లో అమ్ముతారు. అలా ప్రతినెలా దున్న వీర్యాన్నిఅమ్మటం ద్వారా నెలకు రూ. 9.60 లక్షల ఆదాయం లభిస్తోంది నరేంద్రసింగ్ కు.
మరి ఈ రేంజ్ ఉన్న ‘షెహన్‌షా’కు నరేంద్రసింగ్ ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ‘షెహన్‌షా’ కోసం ప్రత్యేకంగా ఈతకొలను కట్టించారు. ఎక్కడ పశువుల పోటీలు ఉంటే అక్క ‘షెహన్‌షా’ దర్శనమిస్తుంది. విజేతగానూ నిలిచి బహుమతులు అందుకోవటం ‘షెహన్‌షా’కు సర్వసాధారణంగా మారిపోయింది. అలా ఓ చాంపియన్‌షిప్‌లో రూ. 30 లక్షలు బహుమతి గెలుచుకుని మరోసారి ముర్రాజాతి గొప్పతనాన్ని చాటింది. కాగా హర్యానాలోని కర్నాల్ నగరం ముర్రాజాతి దున్నపోతులకు ప్రసిద్ధి. ఆ జాతి పశువులన్ని ‘నల్లబంగారం’గా అని గొప్పగా పిలుచుకుంటారు హర్యానా వాసులు.