Smallest Polling Booth In rajasthan elections
Smallest Polling Booth : ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, మిజోరాంలో పోలింగ్ పూర్తి అయ్యింది. రాజస్థాన్‌లో నవంబర్ 25న పోలింగ్ జరగనుంది. దీంట్లో భాగంగా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దీంట్లో భాగంగా ఒకే ఒక్క కుటుంబం కోసం ఎన్నికల సంఘం అతి చిన్న పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేసింది. మారుమూల గ్రామంలో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 35 మంది కోసం చిన్న పోలింగ్ బూత్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది.
పాకిస్థాన్, భారత్ సరిహద్దు ప్రాంతమైన బార్మర్ జిల్లాలోని బాద్మేర్ కా పార్‌లో ఒకే ఒక కుటుంబం నివసిస్తోంది. ఈ కుటుంబంలో మొత్తం 35 మంది కుటుంబ సభ్యలున్నారు. ఈ గ్రామంలో ఈ ఒక్క కుటుంబమే నివసిస్తోంది. ఈ 35మంది కుటుంబ సభ్యుల్లో 18 మంది పురుషులు, 17 మంది మహిళలు ఉన్నారు. వీరి కోసం ప్రత్యేకమైన పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేశారు ఈసీ అధికారులు.
ఒక్కపుడు ఈ కుటుంబ ఓట్లు వేయటానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఓట్లు వేసి తిరిగి వచ్చేవారు. ఆ 20కిలోమీటర్లు దూరం కూడా రహదారి ఏమాత్రం బాగుండదు. అతి కష్టమీద నడాల్సి ఉంటుంది. కేవలం కాలినడక మాత్రమే ఆ గ్రామానికి ఉన్న ఏకైక మార్గం. అంతగా కాకుంటే ఒంటెలపై ప్రయాణించేవారు. ఒంటెలపై ప్రయాణం కూడా కష్టమే. ఏమాత్రం పట్టుతప్పిన గాయాలు కావటం ఖాయం. దీంతో మహిళలు, వృద్ధులు ఓట్లు వేసేందుకు వెళ్లటానికి అంతగా ఆసక్తి చూపేవారు కాదు.
దీంతో వారి ఓటు హక్కును వినియోగించుకునేలా ఈ సారి ఈసీ ఆ కుటుంబం కోసం ప్రత్యేక పోలింగ్ బూత్ ఏర్పాటు చేసింది. దీంతో వారి ఇబ్బందులు తీరనున్నాయి. దీంతో ఈసారి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మగవారితోపాటు మహిళలు, వృద్ధులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమ కోసం పోలింగ్ బూత్ ఏర్పాటు చేయటంతో ఆ కుటుంబం హర్షం వ్యక్తంచేస్తోంది.