మహారాష్ట్ర సీఎం ఆదిత్య ఠాక్రే…ప్లెక్సీలు ఏర్పాటు

హర్యానా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే గురువారం ఫలితాలు వెలువడిన వెంటనే శివసేన సీఎం సీటు ఈ సారి తమకే ఇవ్వాలని బీజేపీ ముందు డిమాండ్ పెట్టింది. 50-50ఫార్ములాకు శివసేన డిమాండ్ చేస్తోంది. ఎన్నికల ముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తమ ఇంటికి వచ్చినపుడు ఇదే విషయంపై చర్చించామని, ఇప్పుడు సమయం ఆసన్నమైందని, ఆ ఫార్ములను అమలు చేయాలని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఫలితాలొచ్చి ఒక్కరోజు కూడా గడవక ముందే భావి సీఎం ఆదిత్య ఠాక్రే అంటూ ముంబైతో సహా మహారాష్ట్ర అంతటా పోస్టర్లు వెలుస్తున్నాయి. ఇప్పటికే శివసేన చీఫ్ ఉద్ధవ్ ఈ విషయాన్ని పదే పదే ప్రకటిస్తున్నా సరే.. కార్యకర్తలు తమ డిమాండ్‌ను పోస్టర్ల ద్వారా బీజేపీ దృష్టికి తీసుకెళ్తున్నారు. 29ఏళ్ల ఆదిత్య పోటీచేసిన ‘వర్లీ’ లో ప్రత్యర్థి అయిన ఎన్సీపీ అభ్యర్థిని ఓడించి 67వేల భారీ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. దీంతో శివసేన కార్యకర్తలు మరింత ఉత్సాహంతో ‘భావి సీఎం ఆదిత్య’ అంటూ అంతటా పోస్టర్లను, ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు.

మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలుండగా.. బీజేపీ, శివసేన కూటమి 161 స్థానాల్లో విజయఢంకా మోగించింది. కాంగ్రెస్- ఎన్సీపీ కూటమి 98 చోట్ల గెలిచింది. ఎంఐఎం 2 చోట్ల, ఇతరులు 27చోట్ల విజయం సాధించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లు ఎన్డీఏ కూటమి క్వీన్ స్వీప్ చేయలేక పోయింది. ఎన్నికల ఫలితల వెల్లడి ముందు వరకు తామే సొంతగా అధికారంలోకి వస్తామని  బీజేపీ అంచనా వేసింది. కానీ ఆ పార్టీ కేవలం 105 స్థానాలకే పరిమితమైంది. శివసేన 56 స్థానాల్లో గెలుపొందింది.