ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. అక్షరాలా రెండున్నర లక్షల కోట్లకు పైగా అప్పులు ఏపీ నెత్తిన వేలాడుతున్నాయి. ఇవి చాలవన్నట్లు వేల కోట్లు అప్పులు చేసేందుకు జగన్ సర్కార్ రెడీ అవుతోంది. పరిస్థితి చూస్తుంటే.. వచ్చే బడ్జెట్‌లో ఆదాయంతో సమానంగా అప్పులు కూడా చూపించినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది.
ఆదాయం సంగతేమోగాని.. ఏపీకి అప్పులు మాత్రం బాగా పెరుగుతున్నాయి. ఇప్పటికే రెండున్నర లక్షల కోట్ల అప్పులు నెత్తిమీదున్నాయి. జగన్ అధికార పగ్గాలు చేపట్టిన 8 నెలల్లోనే అప్పుల భారం మరో 47 వేల కోట్లు పెరిగింది. ఇంకా రెండు వేల కోట్లు అప్పు చేసుకొనే వెసులుబాటు ఉంది. ఇవి కాకుండా మరో ఏడు వేల కోట్లు అప్పు చేసుకొనే అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఆ అవకాశం కూడా దక్కితే పది నెలల్లో అప్పులు 56 వేల కోట్లకు చేరుకొనే అవకాశం వుంది.
చంద్రబాబు హయాంలో రూ.లక్షా 90వేల కోట్ల అప్పులు:
ఆరేళ్లు అవుతున్నా రాష్ట్ర విభజన కష్టాలు తప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీడీపీలో అప్పుల వాటా 31.6 శాతంగా ఉంది. తెలంగాణ జీడీపీలో 17 శాతం మాత్రమే అప్పులున్నాయి. విడిపోయాక నెత్తిమీద అప్పులు పెట్టుకొని కష్టాలతో ఉన్న ఏపీని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కేంద్రం సాయం చేయాల్సిన రాజధాని, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి చంద్రబాబు పాలనలో రాష్ట్ర నిధులనే ఎక్కువ వాడాల్సి వచ్చింది. ఏపీలో పరిశ్రమలు, సేవా రంగాలు లేనందున సహజంగానే ఆదాయం లేదు. దీంతో ప్రతి దానికీ అప్పులు చేయాల్సి వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వంలో చేసిన సుమారు లక్షా తొంభై వేల కోట్ల రూపాయల అప్పుల భారం జగన్ సర్కార్‌కు సంక్రమించింది. వాటిలో చెల్లించాల్సిన బిల్లులే 40 వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇవి కాక డిస్టలరీస్, సోలార్, విండ్ పవర్ సంస్థలకు చెల్లించాలిన బకాయిలు పెద్ద ఎత్తున ఉన్నాయి.
పాలన చేతకాకపోతే తప్పుకోండి:
చేసిన అప్పులకు వడ్డీలే వేల కోట్ల రూపాయలు కట్టాల్సిన పరిస్థితిలో ఉంది జగన్ సర్కార్. నవరత్నాలకే సర్కార్ ప్రాధాన్యత ఇస్తుండడంతో బాకీల చెల్లింపులు ఆగిపోతున్నాయి. రుణాలు, వాటి వడ్డీల భారం అంతకంతకు పెరగడంతో ఆర్థిక శాఖ పలుమార్లు ఓవర్ డ్రాఫ్ట్‌కి వెళ్లింది. పరిస్థితి ఇలా ఉంటే.. జగన్‌కు సంపద సృష్టించడం చేతకాక, రాష్ట్రాన్ని అప్పు పాలు చేసిందని చంద్రబాబు విమర్శిస్తున్నారు. పాలన చేతకాకపోతే పదవి నుండి తప్పుకోవాలని ఇటు చంద్రబాబు, అటు పవన్ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఏపీ అప్పులు @ రూ.2.5లక్షల కోట్లు:
2018-19 ఆర్థిక సంవత్సరంలో ఏపీ రుణ భారం జీఎస్‌డీపీలో 28.79 శాతంగా ఉంది. రాష్ట్రం విడిపోయాక అప్పుల భారం 96 వేల కోట్లు ఉండగా.. చంద్రబాబు సీఎం అయ్యాక తొలి మూడున్నరేళ్లలోనే లక్షా 9వేల కోట్ల రూపాయల అప్పులు చేశారు. 2018-19 నాటికి ఏపీ అప్పుల భారం దాదాపు రెండున్నర లక్షల కోట్లకు చేరింది. బాబు ఐదేళ్ల పాలనలో లక్షన్నర కోట్లకుపైగా అప్పులు చేశారు. దీంతో చంద్రబాబు ఏపీని అప్పుల కుప్పగా మార్చారని వైసీపీ ఆరోపించింది. ఏదేమైనా వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆర్థిక సమస్యల కారణంగా అన్ని రకాల బిల్లులను పెండింగ్‌లో పెట్టారు. చంద్రబాబు వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థతి ఇలా ఉందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
చంద్రబాబు పాలనలో కేంద్రం సహాయం చేయకుండా ఎలా వ్యవహరించిందో అదే పద్దతిలో ఇప్పుడు కూడా కేంద్ర వ్యవహరిస్తుండటంతో జగన్ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది. అసలు కంటే కొసరు ఎక్కువన్నట్లు.. ఈసారి రాష్ట్ర ఆదాయంతో సమానంగా అప్పులు కూడా ఉండనున్నాయి.
* అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్
* అక్షరాలా రెండున్నర లక్షల కోట్లకు పైగా అప్పులు
* ఇంకా వేల కోట్లు అప్పులు చేసేందుకు రెడీ అవుతున్న జగన్ సర్కార్
* వచ్చే బడ్జెట్‌లో ఆదాయంతో సమానంగా అప్పులు కూడా?
* 8 నెలల్లోనే అప్పుల భారం మరో రూ.47 వేల కోట్లు
* ఇంకా రూ.2వేల కోట్ల అప్పు చేసుకొనే వెసులుబాటు
* మరో రూ.7వేల కోట్ల అప్పునకు అవకాశం ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి