Jubilee Hills By Election: మారుతున్న జూబ్లీహిల్స్ బైపోల్ ఈక్వేషన్స్.. ఉపఎన్నిక బరిలో కవిత? వ్యూహం అదేనా?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ఎవరు అభ్యర్థిగా పోటీలోకి దిగనున్నారు? ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి?

Jubilee Hills By Election: సిట్టింగ్ ఎమ్మెల్యే అకాల మరణంతో ఆ సీటు ఖాళీ అయింది. బైపోల్ కోసం ఇంకా నోటిఫికేషన్ రాలేదు. కానీ రేపోమాపో ఎన్నికలు అన్నట్లుగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. రోజుకో నేత తెరమీదకు వస్తున్నారు. టికెట్ రేసు నుండి కొందరు ఔట్ అయితే..మరికొందరు ఇన్ అవుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ఎవరు బరిలో నిలవబోతున్నారు? గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి? సమీకరణాలు మారుతున్నాయా? బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవిత..జూబ్లీహిల్స్ బైపోల్స్ పై దృష్టి పెడుతున్నారా?
జూబ్లీహిల్స్ బైపోల్ నెక్ట్స్ లెవల్ హీట్ క్రియేట్ చేస్తోంది. మినీ భారత్ గా ఉన్న ఈ నియోజకవర్గంలో ఉపఎన్నిక జరగబోతుండటంతో..అన్ని పార్టీలు ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కాక రేపుతోంది జూబ్లీహిల్స్ బైపోల్ రేసు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో ఈ సీటును దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకోసం గ్రౌండ్ లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తన వ్యూహాలను పదనుపెడుతోంది.
జూబ్లీహిల్స్ లో గత జనరల్ ఎలక్షన్స్ లో పోటీ చేసిన అజారుద్దీన్ ను బైపోల్ లో బరిలోకి దించితే ఈక్వేషన్స్ వర్కౌట్ కావని.. ఆయనను గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ.. బైపోల్ టికెట్ రేసు నుంచి తప్పించింది అధికార పార్టీ. ఇక ఈ సీటు నుంచి కచ్చితంగా బీసీలకే ఛాన్స్ ఇవ్వాలని పార్టీ స్ట్రాంగ్ గా డిసైడ్ అయిందంటున్నారు.
తెరపైకి నగరవ్యాప్తంగా ఇమేజ్ ఉన్న లీడర్..
బీసీ కోటాలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, నవీన్ యాదవ్ పేర్లను పరిశీలిస్తున్న కాంగ్రెస్ పెద్దలు..ఎవరైతే బెస్ట్ అనే అంశంపై రకరకాల సమీకరణాలను అంచనా వేస్తున్నారట. అయితే త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అడుగులు వేస్తోందట కాంగ్రెస్.
ప్రస్తుతం హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి గట్టి నాయకత్వం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే..వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో గట్టి దెబ్బ పడే ప్రమాదం ఉందనే ఆలోచనలో పార్టీ ముఖ్య నేతలు ఉన్నారట. అందుకు అనుగుణంగా జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక ఉంటుందని అంటున్నారు. దీంతో నగరవ్యాప్తంగా ఇమేజీ ఉన్న బొంతు రామ్మోహన్ పేరు తాజాగా తెరపైకి వస్తోంది.
ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా ఎట్టి పరిస్థితిలో సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ కలిసొచ్చే విధంగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భార్య సునీతను బరిలో నిలపడం దాదాపు ఖాయమనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినాయకత్వం ఇదే విషయాన్ని క్యాడర్ కు స్పష్టం చేసింది. గులాబీ పార్టీ ఇప్పటికే ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేసింది.
జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో కవిత నిలవనుందనే ప్రచారం..
అయితే బీఆర్ఎస్ కు ఇప్పుడు కంట్లో నలుసు మాదిరిగా కవిత ఎపిసోడ్ మారింది. ఇప్పటికే పార్టీకి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందనే నెపంతో..పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేశారు. ఆమె కూడా పార్టీకి, ఎమ్మెల్సీకి పదవికి రిజైన్ చేసి తెగదెంపులు చేసుకున్నారు. దీంతో రాజకీయంగా లైమ్ లైట్ లో ఉండాలంటే జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో కవిత నిలవనుందనే ప్రచారం ఊపందుకుంది. జాగృతి పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి తన పొలిటికల్ స్ట్రాటజీని ప్లే చేయాలని అనుకుంటున్నారట కవిత.
తెలంగాణలో పట్టుకోసం ఎంతోకాలం నుంచి ఎదురు చూస్తున్న కాషాయ పార్టీ..అదును కోసం చూస్తోంది. గతంలో ఉప ఎన్నికలు జరిగిన ప్రతీసారి సంచనాలు సృష్టించిన బీజేపీ.. ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా అదే సీన్ రిపీట్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. అర్బన్ ఏరియాలో సహజంగా పట్టున్న పార్టీ కాబట్టి.. జూబ్లీహిల్స్ లో సత్తా చాటాలని చూస్తోంది.
అన్నింటికి మించి కేంద్రమంత్రి కిషన్ డ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ వస్తోంది. దాంతో అభ్యర్థి సెలక్షన్ లో కిషన్ రెడ్డిది మేజర్ పాత్ర ఉండే అవకాశం ఉంటుంది. గత జనరల్ ఎలక్షన్స్ లో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి వైపే కిషన్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
నియోజకవర్గంలో కిషన్ రెడ్డి ఏ కార్యక్రమానికి హాజరైన దీపక్ రెడ్డిని వెంట పెట్టుకుని వెళ్తున్నారట. దీపక్ రెడ్డితో పాటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాజీ కార్పొరేటర్ కిలారి మనోహర్ కూడా టికెట్ రేసులో ఉన్నారట. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ ఆశిస్తున్న మరో నేత కీర్తిరెడ్డి. మహిళానేతగా తనకు అవకాశం ఇవ్వాలని ఆమె రిక్వెస్ట్ చేస్తున్నారట. 2014లో కేటీఆర్ పై, 2018లో కేసీఆర్ పై పోటీ చేసిన ఆకుల విజయ కూడా జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే జూబ్లీహిల్స్ బైపోల్ విషయంలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల అంశంతో పాటు కల్వకుంట్ల కవిత పోటీ చేసే విషయం తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read: ఏపీలో మరో ఎన్నికల సమరం.. ఈ సారి ముందుగానే..!