IND vs SA : క్రికెట్ చరిత్రలోనే ఏ జట్టుకు సాధ్యం కాని రికార్డుపై కన్నేసిన దక్షిణాఫ్రికా.. గంభీర్ పని గోవిందా!
గౌహతి వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో (IND vs SA ) దక్షిణాఫ్రికా పట్టు బిగించింది.
South Africa Team On The Verge Of History No Other Team Has Done To India
IND vs SA : గౌహతి వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో సఫారీ జట్టు 489 పరుగులు చేసింది. ఆ తరువాత బౌలింగ్‌లో విజృంభించి భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 201 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో దక్షిణాఫ్రికాకు 288 పరుగుల ఆధిక్యం లభించింది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో భారత్ ఈ మ్యాచ్‌లో గెలవడం దాదాపు అసాధ్యం.
ఒకవేళ ఈ మ్యాచ్‌లో (IND vs SA)దక్షిణాఫ్రికా విజయం సాధిస్తే.. ప్రపంచ క్రికెట్‌లో ఏ జట్టుకు సాధ్యం కాని ఓ రికార్డును అందుకుంటుంది. స్వదేశంలో భారత్‌ను రెండు సార్లు వైట్ వాష్ చేసిన జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. టెస్టుల్లో టీమ్ఇండియా ఇప్పటి వరకు స్వదేశంలో రెండు సార్లు మాత్రమే ప్రత్యర్థుల చేతిలో వైట్‌వాష్ కు గురైంది.
2000 సంవత్సరంలో హన్సీ క్రానే నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు భారత్‌ను 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. గతేడాది టాప్ లాథమ్ సారథ్యంలోని న్యూజిలాండ్ జట్టు 3-0 తేడాతో భారత్‌ను చిత్తు చేసింది.
1980లో బీసీసీఐ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ముంబై వేదికగా ఇంగ్లాండ్‌తో ఒకే ఒక టెస్టు మ్యాచ్‌ను నిర్వహించారు. ఆ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. సాంకేతికంగా ఒకే మ్యాచ్ ఆడడాన్ని సిరీస్‌గా పరిగణించరు.
గంభీర్ ఖాతాలో చెత్త రికార్డు..
ప్రస్తుతం గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ ఓడిపోతే టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఖాతాలో ఓ చెత్త రికార్డు నమోదు అవుతుంది. స్వదేశంలో రెండు విదేశీ జట్ల చేతుల్లో రెండు వైట్‌వాష్‌లు ఎదుర్కొన్న మొదటి హెడ్ కోచ్‌గా అతడు నిలుస్తాడు. గతేడాది (2024లో ) భారత్‌ను కివీస్ వైట్‌వాష్ చేసినప్పుడు కూడా టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా గంభీర్ ఉన్నాడు.
