Team India : వంద పరుగులు దేవుడికి ఎరుక.. కనీసం 100 బంతులు ఆడలేకపోతున్నారుగా.. కుల్దీప్ నువ్వు తోపయ్యా..
ప్రస్తుతం టీమ్ఇండియా పరిస్థితి (Team India) కూడా సరిగ్గా ఇలాగే ఉంది.
IND vs SA test series only two individual innings of over 100 balls for India
Team India : బరిలోకి దిగడమే ఆలస్యం.. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా బాదేస్తున్నారు నేటి తరం బ్యాటర్లు. టీ20ల్లో, వన్డేల్లో అయితే ఇది ఒకే కానీ.. 5 రోజుల పాటు సాగే టెస్టు క్రికెట్‌లో మాత్రం ఇలా ఆడతామంటే కుదరదు. ఇందుకు బ్యాటర్లు కాదు జట్టు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం టీమ్ఇండియా పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది.
ఒకప్పుడు సచిన్, గంగూలీ, ద్రవిడ్ వంటి ఆటగాళ్లు ఫార్మాట్‌కు తగ్గట్లుగా తమ ఆటతీరును మార్చుకునే వాళ్లు. ఆ తరువాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వాళ్లని అనుసరించారు. అయితే.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్‌లు పెరిగిపోవడం, మనదేశంలోనూ ఐపీఎల్‌లో కోట్ల వర్షం కురుస్తుండడంతో ఆటగాళ్లు బాదుడే లక్ష్యంగా ఆడుతున్నారు.
టెస్టుల్లో కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ తరువాత గమనిస్తే ఒకరిద్దరు ఆటగాళ్లు మినహా మిగిలిన వాళ్లంతా వచ్చామా, బాదామా అన్నట్లుగా ఆడేస్తున్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఏదో పని ఉన్నట్లుగా పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. పోనీ పరుగులు అయినా చేస్తున్నారా? అంటే షాట్లు ఆడే క్రమంలో తక్కువ స్కోరుకే పరిమితం అవుతున్నారు. ఇందుకు దక్షిణాఫ్రికా సిరీసే చక్కటి ఉదాహరణ.
కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ మాత్రమే వందకు పైగా బంతులు ఆడాడు. 119 బంతులు ఆడి 39 పరుగులు సాధించాడు. అతడు మినహా మరే టీమ్ఇండియా బ్యాటర్ కూడా ఓ ఇన్నింగ్స్‌లో కనీసం 100 బంతులు ఆడలేకపోయారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోనూ భారత బ్యాటర్ల తీరు మారలేదు. తొలి ఇన్నింగ్స్‌లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒక్కడే వందకు పైగా బంతులు ఆడాడు. 134 బంతులు ఎదుర్కొని 19 పరుగులు సాధించాడు. అతడు వాషింగ్టన్ సుందర్‌కు చక్కటి సపోర్టు అందించాడు. ఈ ఇన్నింగ్స్‌లో కుల్దీప్ తరువాత అత్యధిక బంతులు ఆడింది యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్ మాత్రమే. జైస్వాల్ 97 బంతులు ఆడగా సుందర్ 92 బంతులు ఆడాడు.
🚨 HISTORIC FROM KULDEEP. 🚨
– Kuldeep Yadav now has faced most deliveries in an innings for India in this Test series. pic.twitter.com/vxnUprJ69V
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 24, 2025
ప్రత్యర్థి బ్యాటర్లు అలవోకగా పరుగులు చేస్తున్న అదే పిచ్ పై టీమ్ఇండియా బ్యాటర్లు విఫలం అవుతున్నారంటే.. బ్యాటర్లు టీ20లకు ఎంతగా అలవాటు పడ్డారో అర్థమవుతోంది. ఇప్పటికే తొలి టెస్టు మ్యాచ్ ఓడిపోయిన భారత్ గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో గెలవడం మాట అంటుంచి కనీసం డ్రా చేసుకోవాలన్నా కూడా మహాద్భుతం జరగాల్సిందే. ఈ మ్యాచ్‌లోనూ భారత జట్టు ఓడిపోతే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం అవుతాయి.
IND vs SA : తిలక్ వర్మపై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్.. వన్డేల్లో అతడిని..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగులు చేసింది. ఆ తరువాత టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 201 పరుగులకే ఆలౌటైంది. దీంతో సఫారీలకు 288 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. టీమ్ఇండియా బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (59) హాఫ్ సెంచరీ చేశాడు. వాషింగ్టన్ సుందర్ (48) రాణించగా.. కేఎల్ రాహుల్ (22), కుల్దీప్ యాదవ్ (19) పర్వాలేదనిపించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ ఆరు వికెట్లు తీశాడు. సైమన్ హార్మర్ మూడు వికెట్లు పడగొట్టాడు. కేశమ్ మహరాజ్ ఓ వికెట్ సాధించాడు.
