గుడ్‌న్యూస్‌.. తిరుపతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్‌ ట్రైన్‌.. ప్రయాణ సమయం ఏకంగా ఎంత తగ్గుతుందంటే?  

ప్రస్తుతం హైదరాబాద్-చెన్నై మధ్య రైలు ప్రయాణానికి 12 గంటల సమయం పడుతోంది.

గుడ్‌న్యూస్‌.. తిరుపతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్‌ ట్రైన్‌.. ప్రయాణ సమయం ఏకంగా ఎంత తగ్గుతుందంటే?  

Updated On : November 25, 2025 / 10:52 AM IST

Bullet train project: హైదరాబాద్-చెన్నై బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ తదుపరి దశలోకి అడుగుపెట్టింది. ప్రతిపాదిత 778 కిలోమీటర్ల ఈ హైస్పీడ్‌ రైలు కారిడార్‌ ఇంటర్‌ సిటీ ట్రావెల్‌ను రీషేప్‌ చేయనుంది. డీటైల్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్)లో చేర్చేందుకు తుది అలైన్‌మెంట్‌ను తమిళనాడు ప్రభుత్వానికి సౌత్‌ సెంట్రల్‌ రైల్వే సమర్పించింది. సర్వే కొనసాగేందుకు అనుమతులు కోరింది.

చెన్నై యూనిఫైడ్‌ మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (సీఏయూఎంటీఏ) సభ్య కార్యదర్శి జయకుమార్‌ మాట్లాడుతూ.. తమిళనాడు అనుమతితో డీపీఆర్‌కు ఒక నెలలో తుదిరూపు దక్కుతుందని తెలిపారు. తమిళనాడు అభ్యర్థనతో గూడూరు మార్గాన్ని మార్చి తిరుపతి స్టేషన్‌ను చేర్చేలా అలైన్‌మెంట్‌ను సవరించామని అన్నారు. (Bullet train project)

ప్రస్తుతం హైదరాబాద్-చెన్నై మధ్య రైలు ప్రయాణానికి 12 గంటల సమయం పడుతోంది. బుల్లెట్‌ ట్రైన్‌ వస్తే సుమారు 2.20 గంటలకు సమయం తగ్గుతుంది. ఇందుకు రైలు వెళ్లాల్సిన వేగానికి అనుగుణంగా కారిడార్‌ రూపకల్పన ఉంటుంది. తమిళనాడులో రెండు స్టేషన్లు ఉంటాయి. చెన్నై సెంట్రల్, చెన్నై రింగ్‌ రోడ్‌ సమీపంలోని మింజూర్‌ వద్ద కొత్త స్టేషన్‌.

ప్రతి స్టేషన్‌ వద్ద ట్రాన్సిట్‌ ఓరియెంటెడ్‌ డెవలప్మెంట్‌ కోసం సుమారు 50 ఎకరాల భూభాగాన్ని రైల్వే కోరింది. అలైన్‌మెంట్‌, స్టేషన్‌ ప్రాంతాల తుది నిర్ణయం, భూసేకరణకు ప్రాథమిక అనుమతి, హైస్పీడ్‌ కారిడార్‌ను రాష్ట్ర దీర్ఘకాలిక మౌలిక వసతుల ప్రణాళికలో చేర్చడం వంటి అంశాలతో ఈ వారం తమిళనాడు రవాణా శాఖకు రైల్వే లేఖ పంపింది.

ఫైనల్‌ లొకేషన్‌ సర్వే ఆలస్యం కాకుండా సంయుక్త పర్యటనలు చేయాలని రైల్వే కోరింది. హైదరాబాద్-చెన్నై కారిడార్‌తో పాటు హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్‌ మార్గం దక్షిణ ప్రాంతంలో ప్రణాళికలో ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో ఆర్థిక కేంద్రాలను అనుసంధానించేందుకు ఈ కారిడార్‌ల రూపకల్పన చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెప్టెంబరులో ఈ ప్రాజెక్ట్‌ సర్వే జరుగుతోందని ప్రకటించిన నేపథ్యంలో ఇది ముందుకు సాగుతోంది. “త్వరలో దక్షిణ భారత్‌కు బుల్లెట్‌ ట్రైన్‌ రానుంది. హైదరాబాద్, చెన్నై, అమరావతి, బెంగళూరు నగరాలను అనుసంధానిస్తుంది” అని విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో ఆయన చెప్పారు.