Mlc Kavitha: కేసీఆర్‌పై సీబీఐ విచారణ.. హరీశ్ రావు, సంతోశ్ రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు..

తనపై కుట్రలు చేసినా సహించానని, కేసీఆర్ మీద ఆరోపణలు చేస్తే మాత్రం తాను సహించేది లేదని కవిత హెచ్చరించారు.

Mlc Kavitha: కేసీఆర్‌పై సీబీఐ విచారణ.. హరీశ్ రావు, సంతోశ్ రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు..

Updated On : September 1, 2025 / 7:51 PM IST

MLC Kavitha: కాళేశ్వరం ప్రాజెక్టు మీద సీబీఐ విచారణకు తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. దీనిపై ఎమ్మెల్సీ కవిత భగ్గుమన్నారు. హరీశ్ రావు, సంతోష్ రావు వల్లే కేసీఆర్ కు అవినీతి మరకలు అంటుకున్నాయన్నారు. అందుకే బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత హరీశ్ రావును ఇరిగేషన్ శాఖ పదవి నుంచి తప్పించారని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు తమ ఆస్తులు పెంచుకోవడం కోసం చేసిన పనుల వల్ల కేసీఆర్ మీద విచారణ వరకు వచ్చిందన్నారు. ఇంత జరుగుతుంటే పార్టీ ఎందుకు సైలెంట్ గా ఉందని నిలదీశారు కవిత.

‘కేసీఆర్ మీద విచారణకు ఆదేశిస్తే ఇంకా పార్టీ సైలెంట్ గా ఎందుకుంది? తెలంగాణ బంద్ కు ఎందుకు పిలుపునివ్వలే?. ఇంత జరిగాక తొక్కలో పార్టీ ఉంటే ఎంత? లేకపోతే ఎంత?’ అని ఆమె హాట్ కామెంట్స్ చేశారు.

తన వ్యాఖ్యల వల్ల పార్టీకి లోకల్ బాడీ ఎన్నికల్లో నష్టం వచ్చినా తాను అన్ని విషయాలు బయటపెడుతున్నానన్నారు. తనపై కుట్రలు చేసినా సహించానని, కేసీఆర్ మీద ఆరోపణలు చేస్తే మాత్రం తాను సహించేది లేదని కవిత హెచ్చరించారు.

ఆ ఇద్దరి వల్లే కేసీఆర్ కు చెడ్డ పేరు..!

కేసీఆర్ పై సీబీఐ విచారణకు సంబంధించిన అంశంపై మీడియాతో మాట్లాడిన కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు, సంతోష్ రావు టార్గెట్ గా నిప్పులు చెరిగారు. కేసీఆర్ పై సీబీఐ విచారణకు వారిద్దరే కారణం అన్నారు. మాజీ ఎంపీ సంతోష్, మాజీ మంత్రి హరీశ్ వల్ల కేసీఆర్ కు చెడ్డ పేరు వచ్చిందన్నారు. కేసీఆర్ జనం కోసం పని చేస్తే.. ఆయన పక్కన ఉన్న వారు సొంత ఆస్తులు పెంచుకునేందుకు పని చేశారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

హరీశ్, సంతోష్ లు తనపై అనేకసార్లు కుట్రలు చేశారన్న కవిత.. తన గురించి ఏం మాట్లాడినా తాను నోరు మెదపలేదన్నారు. ఈరోజు కేసీఆర్ బిడ్డగా తాను ఎంతో బాధపడుతున్నట్లు చెప్పారు. హరీశ్ సంతోష్ వెనక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని కవిత ఆరోపించారు.

”కేసీఆర్ పక్కన ఉండే వాళ్లు ఎంతో లబ్ది పొందారు. కేసీఆర్ మీద ఆరోపణలు రావడానికి ఒకరిద్దరు కారణం. కేసీఆర్ పై కుట్రలో హరీశ్ రావుదే కీలక పాత్ర. హరీశ్ రావు, సంతోష్ రావు వెనక రేవంత్ రెడ్డి ఉన్నారు. తరతరాలకు తరగని ఆస్తిగా కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ను బద్నాం చేస్తున్నారు.

మహా సముద్రం లాంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మేడిగడ్డ అనేది ఒక చిన్న పార్ట్. ఆ చిన్న పార్ట్ లో ఒక మూడు పిల్లర్లు కుంగిపోతే కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని మాట్లాడుతున్నారు. అది నిన్న పరాకాష్టకు చేరింది. అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ని అనేక మాటలు అన్నారు. కేసీఆర్ లాంటి వ్యక్తి మీద ఇలాంటి నిందలు వేయడం దారుణం.

తెలంగాణ విషయం, ప్రజల విషయం తప్పితే వ్యక్తిగత విషయాలు మాట్లాడే సమయం ఒక శాతం కూడా ఉండదు. అటువంటి ఒక మహా నేత మీద ఇన్ని అభాండాలు వేస్తూ, రోజుకొక రీతిలో చెప్పుకుంటున్నారు. లక్ష కోట్లు దోచుకున్నారు, నిజాం కన్నా ధనవంతులు అవ్వాలని అనుకున్నారు అని అంటున్నారు. కచ్చితంగా నిజాం బాటలోనే నడుస్తాం.

200 సంవత్సరాల తర్వాత కూడా కేసీఆర్ ని తలుచుకుంటారు..

కాళేశ్వరం ప్రాజెక్ట్ మనకు ఎంతో గర్వకారణం. 200 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ బిడ్డలు కేసీఆర్ ని తలుచుకుంటారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ మనకు వ్యతిరేకంగా పని చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి నిన్న పొద్దున నుంచి సాయంత్రం వరకు కేసీఆర్ ని ఎన్నో అనరాని మాటలు అన్నారు. వింటుంటే గుండె తరుక్కుపోతోంది” అని కవిత వాపోయారు.

”కేసీఆర్ మీద ఇంత కుట్రపూరితంగా అభాండాలు ఎందుకు వేస్తున్నారు, అవి వేసే అవకాశం ఎవరిచ్చారు? అనేది బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు ఆలోచన చేయాలి. కేసీఆర్ పక్కన ఉన్న వారిలో కొంతమంది కేసీఆర్ పేరు చెప్పుకుని అనేక రకాలుగా లబ్ది పొందారు. వారు చేసిన అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ పేరు బద్నాం అయ్యే పరిస్థితి వచ్చింది.

ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్ లో కేసీఆర్ కి మరక అంటింది అంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకరైతే, హరీశ్ రావు మరొకరు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారు. కేసీఆర్ ప్రజల కోసం, నీళ్ల కోసం ఆలోచన చేస్తే.. వీళ్లు సొంత వనరుల కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచించారు. వేలు చూపించి కేసీఆర్ పై సీబీఐ విచారణ వేస్తానని రేవంత్ అంటున్నారంటే కారణం ఎవరు?

ఇదే హరీశ్, ఇదే సంతోష్ అనేక కుట్రలు చేసినా నేను భరించాను. ఇంతవరకు నేను వారిని పేరు పెట్టి పిలవలేదు. ఫస్ట్ టైమ్ వారి పేర్లు చెప్పా. ఈ వయసులో కేసీఆర్ పై సీబీఐ విచారణ ఏంటి? ఎందుకోసం ఈ కర్మ? ఎందుకు భరించాలి? నా మాటలతో బీఆర్ఎస్ పార్టీ తమ్ముళ్లకు కోపం రావొచ్చు. వాస్తవాలు చేదుగా ఉన్నా మాట్లాడుకోవాలి” అని కవిత అన్నారు.

Also Read: తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. సీబీఐకి కాళేశ్వరం ప్రాజెక్టు కేసు