Kaleshwaram Project : తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. సీబీఐకి కాళేశ్వరం ప్రాజెక్టు కేసు

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం (Kaleshwaram Project) బ్యారేజీల్లో అక్రమాలు, వైఫల్యాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి

Kaleshwaram Project : తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. సీబీఐకి కాళేశ్వరం ప్రాజెక్టు కేసు

CM Revanth Reddy

Updated On : September 1, 2025 / 7:14 AM IST

Kaleshwaram Project : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం బ్యారేజీల్లో అక్రమాలు, వైఫల్యాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి సీబీఐకి కేసు అప్పగించాలని శాసనసభ నిర్ణయించింది.

Also Read: KTR: మరో ప్రజా ఉద్యమానికైనా సిద్ధం, కాళేశ్వరాన్ని కాపాడుకుంటాం- కేటీఆర్

శాసనసభ సమావేశాల్లో భాగంగా ఆదివారం సభలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చ జరిగింది. సుమారు తొమ్మిదిన్నర గంటల పాటు చర్చ కొనసాగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్ఈసీ, సీఎఫ్సీ భాగస్వామ్యమై ఉన్నాయని, అందుకే కేసును సీబీఐకి అప్పగించడం సముచితమని శాసనసభ భావిస్తోందని చెప్పారు.

తమ పరిధిలో ఉన్న ఏ సంస్థ దర్యాప్తు చేసినా తమ చిత్తశుద్ధిని శంకిస్తారని, ఇప్పటికే నివేదికలు ఇచ్చిన ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, కాగ్, జస్టిస్ ఘోష్ కమిషన్ గత ప్రభుత్వాన్ని, నాటి ప్రభుత్వ పెద్దలను తప్పుపట్టాయని అన్నారు. అందుకే ఎలాంటి సందేహాలకు తావులేకుండా కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ చేసిన మోసం అంతాఇంతాకాదు.. రూ. లక్ష కోట్లు కొల్లగొట్టారు. ప్రాజెక్టుపేరుతో లూటీ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రజలకు మేము హామీ ఇచ్చాం. అందుకు అనుగుణంగానే దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే నిర్మాణ వ్యయం, లిఫ్టులు, నిర్వహణ భారం తగ్గేవి. కానీ, కాంట్రాక్టర్ల కమీషన్లకు కక్కుర్తి పడ్డారని రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

బీఆర్ఎస్ వాకౌట్..

శాసనసభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని నిరసిస్తూ ఆదివారం రాత్రి సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. అనంతరం అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కుకు చేరుకున్న బీఆర్ఎస్ సభ్యులు.. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక పత్రాలను చెత్త బుట్టలో వేసి నిరసన తెలిపారు. శాసనసభ సాక్షిగా బీఆర్ఎస్ గొంతు నొక్కారని, స్పీకర్ కూడా ఏ మాత్రం సంబంధం లేనట్లుగా వ్యవహరించారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరాన్ని శాశ్వతంగా మూసేసే ప్రయత్నం చేస్తున్నాయని, రైతాంగానికి వరదాయనిగా మారిన ప్రాజెక్టును కాపాడుకునేందుకు అవసరమైతే ఉద్యమం చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.