KTR: మరో ప్రజా ఉద్యమానికైనా సిద్ధం, కాళేశ్వరాన్ని కాపాడుకుంటాం- కేటీఆర్
కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరాన్ని శాశ్వతంగా మూసేసే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణ రైతన్న వర ప్రదాయిని కాళేశ్వరాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే..

KTR: కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కాపాడుకోవటానికి మరో ఉద్యమం చేయటానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దీనిపై పార్టీలో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. అవసరమైతే జిల్లాలు, నియోజకవర్గాల వారీగా సదస్సులు పెట్టి కాళేశ్వరం విషయంలో జరుగుతున్న కుట్రలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. అవసరమైతే కాళేశ్వరాన్ని కూలగొట్టి, చంద్రబాబుకు వత్తాలు పలికేందుకు బనకచర్లకు నీళ్లు పంపేందుకు చేస్తున్న కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్తామని కేటీఆర్ అన్నారు.
మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని సభ నుంచి వాకౌట్ చేసిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్ పార్క్ దగ్గర నిరసన తెలిపారు. అమరవీరుల స్థూపం దగ్గర ఘోష్ కమిషన్ రిపోర్ట్ ప్రతులను చించి చెత్త బుట్టలో వేశారు.
”ఓవైపు న్యాయ పోరాటం చేస్తాం, మరోవైపు ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. పార్టీలో మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటాం. శాసనసభలో మా పార్టీ గొంతును నొక్కేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా కాళేశ్వరాన్ని కాపాడుకుంటాం. కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరాన్ని శాశ్వతంగా మూసేసే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణ రైతన్న వర ప్రదాయిని కాళేశ్వరాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే మరో ప్రజా ఉద్యమం చేస్తాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం, ఇంజనీరింగ్ మార్వెల్ కాళేశ్వరాన్ని కాపాడుకుంటాం. కాలేశ్వరం విషయంలో కాంగ్రెస్ కుట్రలపై తదుపరి కార్యాచరణ గురించి పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం” అని కేటీఆర్ తెలిపారు.