Rahul Gandhi: త్వరలో.. హైడ్రోజన్ బాంబు పేలుస్తాం..! ప్రధాని మోదీ ముఖం చూపించలేరు..! మరోసారి రాహుల్ సంచలనం

ఆ బాంబు పేల్చిన తర్వాత ప్రధాని మోదీ ఇక దేశానికి తన ముఖం చూపించలేరు, ప్రజలను ఎదుర్కోలేరని రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Rahul Gandhi: త్వరలో.. హైడ్రోజన్ బాంబు పేలుస్తాం..! ప్రధాని మోదీ ముఖం చూపించలేరు..! మరోసారి రాహుల్ సంచలనం

Updated On : September 1, 2025 / 8:03 PM IST

Rahul Gandhi: ఓట్ల చోరీ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ పై తీవ్ర ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీ.. తాజాగా అంతకుమించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల చోరీ విషయంలో ఇటీవలే అణుబాంబు పేల్చామన్న రాహుల్.. త్వరలోనే మరింత శక్తిమంతమైన హైడ్రోజన్‌ బాంబు పేలుస్తామన్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటారని అన్నారు. ఓటర్‌ అధికార్‌ యాత్ర ముగింపు సందర్భంగా పాట్నాలో రాహుల్‌ ఈ కామెంట్స్ చేశారు.

ఓటర్ల జాబితాలో అవకతవకలకు సంబంధించి కాంగ్రెస్ త్వరలో “హైడ్రోజన్ బాంబు”ను పేలుస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు రాహుల్ గాంధీ. ‘ఓటు చోరి’ నినాదం చైనాలో కూడా ప్రతిధ్వనిస్తోందన్నారు. ఆ బాంబు పేల్చిన తర్వాత ప్రధాని మోదీ ఇక దేశానికి తన ముఖం చూపించలేరు, ప్రజలను ఎదుర్కోలేరని రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఓట్ల దొంగతనం గురించి నిజం బయటపడుతుంది..!

”బీజేపీ నాయకులకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మీరు అణుబాంబు కంటే పెద్ద దాని గురించి విన్నారా? అదే హైడ్రోజన్ బాంబు. సిద్ధంగా ఉండండి. అతి త్వరలో హైడ్రోజన్ బాంబు పేలుస్తాం. ఓట్ల దొంగతనం గురించి నిజం బయటపడుతుంది” అని హెచ్చరించారు రాహుల్ గాంధీ.

”ఓట్ చోర్, గడ్డి చోడ్’ అనే నినాదాన్ని నేను లేవనెత్తాను. ప్రజలు దాన్ని స్వీకరించారు. ఇప్పుడు అది చైనాలో కూడా ప్రతిధ్వనిస్తోంది. అమెరికాలోని ప్రజలూ అలాగే చెబుతున్నారు” అని ఇండియా బ్లాక్ ఓటర్ అధికార్ యాత్ర ముగింపులో రాహుల్ వ్యాఖ్యానించారు.

హైడ్రోజన్ బాంబు పేలుస్తాం అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు మూర్ఖంగా ఉన్నాయని కొట్టిపారేసింది. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు నిజమే అయితే ఎన్నికల కమిషన్ కోరిన అఫిడవిట్‌ను ఎందుకు సమర్పించలేదని బీజేపీ ప్రశ్నించింది. “రాహుల్ వ్యాఖ్యలు ఆయన మూర్ఖత్వానికి నిదర్శనం. ఓటర్లను అవమానించేలా ఉన్నాయి. అణు బాంబు, హైడ్రోజన్ బాంబు అని ఏదేదో అంటున్నారు. అసలు ఎన్నికలకు ఈ బాంబులకు ఏంటి సంబంధం?” అని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.

“ఓటర్ల జాబితాలో 21 లక్షల మందికి పైగా చనిపోయిన వారి పేర్లు కనిపించాయి. అవి అక్కడే ఉండాలా? రాహుల్ గాంధీ దీనికి సమాధానం చెప్పాలి. ఆయన అఫిడవిట్ సమర్పించడానికి ఎందుకు నిరాకరిస్తున్నారు? అందులో అబద్ధం చెబితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయనకు తెలుసు” అని ఎంపీ రవిశంకర్ ప్రసాద్ అన్నారు.

కాగా.. ఓటర్ల జాబితాలో ఈసీ అవకతవకలకు పాల్పడిందని, బీజేపీ అప్రజాస్వామికంగా ఓటు చోరీ చేసిందని రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన ఓటర్ అధికార్ యాత్రను చేపట్టారు. ఓట్ చోరీ అంటూ కేంద్రాన్ని, ఈసీని రాహుల్ టార్గెట్ చేశారు. బీజేపీ, ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను దుర్వినియోగం చేయడం ద్వారా ఎన్నికలను తారుమారు చేస్తున్నాయని రాహుల్ మండిపడ్డారు. ఓట్లను దొంగిలించే క్రమబద్ధమైన ప్రక్రియ ద్వారా బీజేపీ ఎన్నికల్లో గెలుస్తోందని సంచలన ఆరోపణలు చేశారు.

Also Read: చైనా గడ్డపై నిలబడి చైనాకే షాక్ ఇచ్చిన మోదీ.. ఒక్క మాటతో…