రాజధాని రగడ : రైతులకు అండగా నిలుస్తామన్న పవన్..సుజనా

  • Publish Date - August 25, 2019 / 01:35 AM IST

ప్రస్తుత పరిస్థితుల్లో రాజధానిగా అమరావతి ఉండటమే సబబని జనసేన అధ్యక్షుడు పవన్‌‌కల్యాణ్ తేల్చి చెప్పారు. పవన్‌ కళ్యాణ్‌ను రాజధాని ప్రాంత రైతులు కలిశారు. తమ పోరాటానికి అండగా ఉండాలని రైతులు కోరారు. ప్రభుత్వ నిర్ణయాల్లో తప్పులుంటే సరిచేయాలే కానీ..రద్దు చేస్తామనడం సరికాదని పవన్ హితవు పలికారు. రాజధానిని తరలిస్తామని చెప్పడం సరికాదన్నారు.

దీనిని జనసేన పార్టీ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం కేవలం 29 గ్రామాల ప్రజల సమస్య కాదని తెలిపారు. ఇప్పుడు రాజధానిని మార్చడం వల్ల ప్రజాధనం వృథా అవుతుందన్నారు. రైతులు తరతరాలుగా వస్తున్న భూములను త్యాగం చేశారని కొనియాడారు. రైతుల ఆవేదన అర్థం చేసుకున్నానని, వారికి అండగా నిలుస్తానని పవన్ హామీ ఇచ్చారు. ఈ నెల 30, 31 తేదీల్లో రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని చెప్పారు. ఇప్పటికే చేపట్టిన పనులు, నిలిచిన ప్రాజెక్టులను పరిశీలిస్తానని పవన్‌ వెల్లడించారు

దీనిపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. ప్రకృతి సిద్ధంగా వచ్చే వరదలను ఎవరూ ఆపలేరన్నారు. రాజధాని ప్రాంత రైతులు ఎంపీని కలిశారు. తమ పోరాటానికి అండగా ఉండాలని రైతులు కోరారు. వరదలు వచ్చాయని రాజధానిని మారుస్తామనడం సరికాదని ప్రభుత్వానికి హితవు పలికారు సుజనాచౌదరి. రాజధాని ప్రాంతంపై సీఎం జగన్‌ ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదన్నారు.

విజయసాయిరెడ్డి చెప్పిన దాంట్లో ఏ మాత్రం నిజం లేదని కొట్టిపారు. వైసీపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోవాల్సిన పనిలేదన్నారు. రాజకీయ కారణాలతోనే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. అమరావతిలో తనకు ఎలాంటి భూములు లేవని స్పష్టం చేశారు. తనకు బినామీలుగా ఉండాల్సిన అవసరం ఎవరికీ లేదని వెల్లడించారు. రాజధాని రైతులకు అండగా ఉంటానని సుజనాచౌదరి హామీ ఇచ్చారు.
Read More : ఇదే మాట చెబుతా : రాజధాని ముంపు ప్రాంతం – మంత్రి బోత్స

ట్రెండింగ్ వార్తలు